NTV Telugu Site icon

Off The Record : రగిలిపోతున్న టీడీపీ నేతలు.!

Tdp

Tdp

ఆ ఏపీ మంత్రి వైఖరితో లోకల్‌, నాన్‌ లోకల్‌ సమస్యలు తలెత్తుతున్నాయా? బయటి నుంచి ఎవరో వచ్చి మా నెత్తినెక్కి డాన్స్‌ ఆడుతున్నారంటూ… ఆ యన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రగిలిపోతున్నారా? మా ఎమ్మెల్యే మంత్రి అయితే… ఆ లెక్కే వేరబ్బా అనుకున్నవాళ్ళ అంచనాలు తల్లకిందులయ్యాయా? ఇంతకీ ఎవరా మినిస్టర్‌ సాబ్‌? ఏంటా లోకల్‌, నాన్‌ లోకల్‌ వార్‌? కొలుసు పార్ధసారధి… ఏపీ మినిస్టర్‌. టీడీపీ తరపున తొలిసారి నూజివీడు నుంచి గెలిచి… బీసీ కోటాలో కేబినెట్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పెనమలూరు ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన సారధి వైఎస్సార్ మంత్రి వర్గంలో పనిచేశారు. ఆ తర్వాత 2014లో వైసీపీ తరఫున బందరు ఎంపీగా బరిలోకి దిగి ఓడిపోయారాయన. 2019లో మాత్రం తన సొంత నియోజకవర్గానికి తిరిగి వచ్చిన సారధి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ప్రభుత్వంలో కూడా బీసీ కోటాలో మంత్రి పదవి ఆశించినా…. దక్కకపోవటంతోపాటు ఇతర కారణాలతో అసంతృప్తికి గురై… ఎన్నికల ముందు వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే సిట్టింగ్ స్థానం పెనమలూరులో సర్దుబాటుకాకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నూజివీడు వెళ్ళాల్సి వచ్చింది సారధి. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అవటంతో ఇక ఎదురుండదని భావించిన స్థానిక టీడీపీ నేతలకు ఇప్పుడు సీన్ రివర్సైందట. వాస్తవానికి 2014, 2019లో రెండుసార్లు నూజివీడు నుంచి టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరావు పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు, స్థానికంగా ఉన్న కమ్మ సామాజిక వర్గ కీలక నేతలకు ఏ మాత్రం పొసిగేది కాదని లోకల్ టాక్. ముద్దరబోయిన నాయకత్వాన్ని నియోజకవర్గ పార్టీ నేతలు వ్యతిరేకించటంతో వ్యవహారం అధిష్టానం వరకు వెళ్ళింది. ఈ పరిస్థితుల్లో మూడోసారి రిస్క్ చేయటం ఎందుకని అధిష్టానం ముద్దరబోయిన సామాజిక వర్గానికే చెందిన పార్దసారధిని అభ్యర్థిగా నియమించింది.

దీంతో స్థానికంగా ఉన్న ముద్దరబోయిన వ్యతిరేక వర్గం కూడా సారధి కోసం గట్టిగా పని చేసిందట. కానీ….గెలిచిన తర్వాత సారధి వర్గం ఇచ్చిన షాకులతో స్థానిక టీడీపీ నాయకత్వం షేకైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందుకు ప్రదాన కారణం మంత్రి సొంత నియోజకవర్గమైన పెనమలూరు నుంచి ఆయన వర్గీయులు వచ్చి నూజివీడులో పెత్తనం చేయడమేనట. నూజివీడు సెగ్మెంట్‌లో నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో పెనమలూరు నుంచి వచ్చిన సారధి వర్గానికి చెందిన ఒకరు అంతా తామై చూసుకుంటున్నారట. రోడ్డు కాంట్రాక్టులు, నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెస్ కాంట్రాక్టులు, అనధికార మైనింగ్…. ఇలా అన్నిట్లో నాన్‌ లోకల్స్‌దే పెత్తనమని, ఎన్నికల్లో పార్టీ కోసం అంతలా చించుకుని పని చేసిన మేం ఏమైపోవాలంటూ స్థానిక టీడీపీ నాయకులు తీవ్ర అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల నూజివీడు మున్సిపాలిటీకి జరిగిన వైస్ ఛైర్మన్‌ ఎన్నికలో… పదవి స్థానిక టీడీపీకి చెందిన చెరుకూరి దుర్గాప్రసాద్ కు దక్కుతుందని భావించగా… వైసీపీ నుంచి వచ్చిన పగడాలకు కట్టబెట్టారట సారధి. దీంతో అసమ్మతి నేతలు పార్టీ ముఖ్య నాయకుల దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబుచ్చుకున్నట్టు తెలిసింది. ముద్దరబోయిన స్థానంలో సారధి వస్తే బాగుంటుందని భావిస్తే… ఆయన వర్గం ఇస్తున్న షాకులతో మాకు మతిపోతోందన్నది నూజివీడు తెలుగుదేశం నాయకుల మనోగతంగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి పంచాయితీ చేయాలని డిసైడైందట స్థానిక నాయకత్వం. పెద్దలు సెట్‌ చేయగలుగుతారా? లేక అక్కడి వరకు తలూపేసి తిరిగి ఎవరి పంథాలో వాళ్ళు కొనసాగుతారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.