NTV Telugu Site icon

Off The Record: కొండా, రేవూరి వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్

Otr Congress

Otr Congress

Off The Record: ఓరుగల్లు కాంగ్రెస్‌ పోరుకు కేరాఫ్‌ అవుతోందా? మంత్రి వర్సెస్‌ ఎమ్మెల్యేగా మొదలైన వ్యవహారం మొత్తం పార్టీకే చుట్టుకుంటోందా? ఏకంగా అధికార పార్టీ కేడరే పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నా చేయడాన్ని ఎలా చూడాలి? మంత్రి కొండా సురేఖ నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి కొత్త వివాదానికి తెర తీశారా? ఉమ్మడి వరంగల్‌ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గాల మధ్య ఒక రకంగా యుద్ధమే జరుగుతోందన్నది పార్టీ నాయకుల వాయిస్‌. చివరికి పండగ ఫ్లెక్సీల్లో ఫోటోల కోసం కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చిందట. దసరా ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా ధర్మారంలో మంత్రి కొండా సురేఖ అనుచరులు ఫ్లెక్సీలు వేయించారు. అయితే అది పరకాల నియోజకవర్గం కిందకు వస్తుంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫొటో ఫ్లెక్సీల్లో లేకపోవడాన్ని గమనించిన ఆయన అనుచరులు కొండా వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగి దాడులు జరగడంతో… ముగ్గుర్ని అరెస్ట్‌ చేశారు గీసుకొండ పోలీసులు. తన అనుచరుల్ని అరెస్ట్‌ చేయడంపై రగిలిపోయిన మంత్రి కొండా సురేఖ… నేరుగా స్టేషన్‌కు వెళ్ళి సీఐ ఛైర్‌లోనే కూర్చుని ఆయనకు క్లాస్‌ పీకారట. ఆ క్రమంలో మంత్రి వ్యవహారశైలిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా మంత్రి ఎంట్రీ ఇవ్వడంతో… ఈ వ్యవహారంలో పోలీస్‌ కమిషనర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందట. ఈ ఎపిసోడ్‌తో కొండా, రేవూరి వర్గాల మధ్య విభేదాల వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చింది. వీళ్ళిద్దరూ ఇలాదే ఆధిపత్యపోరుకు పోయి ఎక్కడ జిల్లాలో పార్టీకి నష్టం చేస్తారోనన్న ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నారట కార్యకర్తలు. గతంలోకూడా పలు సందర్భాల్లో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు బయట పడింది. ఇప్పటికే కాంగ్రెస్‌లో సీనియర్, జూనియర్‌ పంచాయితీ నడుస్తుండగా… ఇప్పుడు ఫ్లెక్సీ వార్ ముదిరి ఏకంగా అధికార పార్టీ నేతలే పోలీస్‌ స్టేషన్‌ ముందు ధర్నా చేయడంతో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్‌కు మైనస్‌ అవుతుందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. గతంలో పరకాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కొండా. ఈసారి తన భర్త మురళికి ఆ సీటు కోసం ప్రయత్నించినా…ఫలితం లేకపోయింది. రేవూరి ప్రకాష్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా… పరకాలలో తమ పట్టు తగ్గకుండా కొండా దంపతులు జాగ్రత్త పడుతుండంతో వ్యవహారం ముదురుతోందన్న చర్చ సైతం జరుగుతోంది.

నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారంలో సైతం ఫోన్‌లోనే పరస్పరం దూషించుకున్నారట. ఇప్పుడు దసరా ఉత్సవాల ఫ్లెక్సీలు అగ్గికి ఆజ్యం పోశాయి. గీసుగొండ కొండా దంపతుల సొంత మండలం కాగా.. అక్కడ కొండా మురళి ముఖ్య అనుచరుడు, పార్టీ మండల అధ్యక్షుడు రడం భరత్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి కొండా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారాయన. ఆ చేరిక రేవూరి ప్రకాష్‌రెడ్డికి ఇష్టం లేదట. ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య ఫోన్‌లో మాటా మాటా పెరిగిందంటున్నారు. మొత్తంగా కొండా, రేవూరి వర్గాలు రెండూ తగ్గేదేలే అన్నట్టుగా ఉండటంతో…ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేగుతున్నాయి. ఒకదాని వెంట ఒకటిగా పెరుగుతున్న వివాదాల కారణంగా పార్టీ పరువు పోతోందంటూ కొందరు ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్టు సమాచారం. మరి పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని మేటర్‌ సెటిల్‌ చేస్తారా? లేక సమస్యని కాలానికి వదిలేస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.