NTV Telugu Site icon

Off The Record : ఆ వైసీపీ నేతల స్వరం మారుతుందా? ఒక్కొక్కరిగా ఓపెన్ అవుతున్నారా?

Dharmavaram Otr

Dharmavaram Otr

ఓటమిపై మొన్న ఆవేదన.. నిన్న విశ్లేషణ.. నేడు అధినేత తప్పిదాలపై పరోక్ష విమర్శలు. వైసీపీలో స్వరం మారుతోందా? నేతలు ఒక్కొక్కరుగా ఓపెనైపోతున్నారా? ఆ మాజీ ఎమ్మెల్యే విశ్లేషణలకు పార్టీ వర్గాల్లో ఎందుకంత ప్రాధాన్యం దక్కుతోంది? ఆయన మాటలకు మద్దతు పెరుగుతోందన్నది నిజమేనా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఓటమిపై ఏంటి ఆయన విశ్లేషణ? కర్ణుడి చావుకి కారణాలెన్నో అన్నట్టుగా… ఏపీలో వైసీపీ ఓటమికి కూడా రకరకాల విశ్లేషణలు బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో బయటి వాళ్ళు చెప్పే మాటలు ఒక ఎత్తయితే… తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న విశ్లేషణలు చర్చనీయాంశం అవుతున్నాయి. గతంలో తమకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ… ఇప్పుడు బయటపడుతున్నారు కొందరు. ఈ క్రమంలోనే….ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేస్తున్న అనాలసిస్‌ పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారిందట. నాయకులెవరూ దీన్ని కాదనలేకపోతున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలందరికంటే భిన్నంగా గుడ్‌మార్నింగ్‌ పేరుతో రోజూ జనంలోకి వెళ్తూ…ట్రెండ్‌ సెట్‌ చేసిన కేతిరెడ్డి మాటల్ని గట్టిగానే పట్టించుకుంటున్నాయట పార్టీ శ్రేణులు. నిత్యం ప్రజల్లో ఉంటూ… సమస్యలు పరిష్కాం చేసినా… నాకెందుకీ ఓటమి అంటూ… మాజీ ఎమ్మెల్యే రకరకాలుగా విశ్లేషించుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా మాట్లాడుకుంటే… తెలుగుదేశం పార్టీ వేవ్‌లో కేతిరెడ్డి ఓటమి అన్నది పెద్ద విషయం కాదంటున్నారు పొలిటికల్ పండిట్స్‌. కానీ….. బీజేపీ అభ్యర్థి సత్య కుమార్ చేతిలో ఓడిపోవడాన్ని మాత్రం ప్రత్యేకంగానే చూడాలన్నది వాళ్ళ అభిప్రాయం. ఓడిపోయాక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ… ఓ వీడియో కూడా రిలీజ్‌ చేశారు మాజీ ఎమ్మెల్యే. అందులో చాలా అంశాలను ప్రస్తావించారాయన.

అయితే… అదంతా ఆయనలో ఉన్న ఆవేదన అనుకున్నారు అప్పట్లో అంతా.కానీ… ఆ తర్వాత వివిధ అంశాలపై కేతిరెడ్డి చేస్తున్న కామెంట్స్‌ పార్టీ వర్గాలను ఆలోచనలో పడేస్తున్నాయట. మరీ ముఖ్యంగా… ప్రభుత్వ సలహాదారు విషయంలో ఆయన నేరుగా చేసిన వ్యాఖ్యలను చాలా మంది సమర్ధిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ఒక ఎమ్మెల్యే సీఎం సలహాదారును లేదంటే ఆయన కింద ఉన్న అధికారిని కలవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో.. ఎన్ని గంటలు వేచి ఉండాలో అందరికీ అర్థమయ్యేట్టు మాజీ ఎమ్మెల్యే చెప్పిన విధానంపై పార్టీ వర్గాలు గట్టిగానే చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యల మీద అలా చర్చ జరుగుతున్న టైంలోనే…తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలు ఇంకా సెగలు పుట్టిస్తున్నాయట. అందులో ఏకంగా పార్టీ అధినేత లోపాలను ఎత్తి చూపారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందంటున్నారు. జగన్ గ్రౌండ్ రియాల్టీకి చాలా దూరంగా ఉండటం వల్లే ఓడిపోయామన్నది మాజీ ఎమ్మెల్యే మాటల సారాంశం. అసలు జగన్‌కి, చంద్రబాబుకి పోటీగా ఈ ఎన్నికల్ని జనం చూడలేదని, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డితో పోల్చుకున్నారని, మాజీ సీఎం ఈ చిన్న లాజిక్‌ మిస్‌ అవడం వల్లే ఇంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నట్టుగా ఉన్నాయట కేతిరెడ్డి మాటలు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ విషయంలో కాపులు ఎంత సీరియస్‌గా ఉన్నారన్న విషయాన్ని కూడా గమనించలేకపోయామని కొంప మునగడానికి అది కూడా ఓ కారణమన్నారు. ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ చేతిలో ఉన్నా…. కింది స్థాయిలో ప్రజల నాడి ఏంటన్నది తెలుసుకోలేకపోవడం తప్పిదమేనన్నారు కేతిరెడ్డి. ఉచితంగా ఇచ్చిన దానికి విలువ ఉండదు, అడగకుండా చేసిపెట్టిన పనికి గుర్తింపు ఉండదని, కాబట్టే మా విలువ జనానికి తెలియలేదన్నట్టుగా ఉంది మాజీ ఎమ్మెల్యే వ్యవహారం. అటు షర్మిల… వైఎస్‌ కుటుంబ విషయాలను రాజకీయాల్లోకి తీసుకు రావడం కూడా.. తమ ఓటమికి ఒక కారణమని విశ్లేషించారు కేతిరెడ్డి. ఇప్పుడు ఈ విశ్లేషణ మీదే వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందులో చాలా వరకు నిజాలున్నాయన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోందట. అధినేతతో పాటు పార్టీలోని లోపాల గురించి నిర్మొహమాటంగా చెప్పగలగడం మంచిదేనని, మరి దీన్ని పెద్దలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి వైసీపీలో.