NTV Telugu Site icon

Off The Record : చట్టపరంగా పెద్దారెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారా..?

Kethireddy Peddareddy Otr

Kethireddy Peddareddy Otr

ఆ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారా? ఇంకా మాట్లాడితే… అసలు జిల్లా నుంచే బహిష్కరించేలా పావులు కదుపుతున్నారా? గడిచిన ఐదేళ్ళలో ఆయన, అనుచరులు చేశారని చెబుతున్న అరాచకాల చిట్టా తీసి చట్టపరంగా ఎక్కడికక్కడ నట్లు బిగించాలనుకుంటున్నారా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటా రివెంజ్‌ పాలిటిక్స్‌? తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని గతం ఇప్పుడు వెంటాడుతోందా అంటే… అవునన్నదే నియోజకవర్గంలోని రాజకీయ వర్గాల మాట. ప్రతీకార రాజకీయాలకు పెట్టింది పేరైన తాడిపత్రిలో ఏం జరిగినా అది గతం తాలూకు రియాక్షనే అన్నది విస్తృత అభిప్రాయం. మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య జరుగుతున్న వార్‌ కూడా ఈ సిరీస్‌లో భాగమేనంటున్నారు. గత ఐదేళ్లలో తాడిపత్రిలో ఒక్కరోజు కూడా ప్రశాంతత అన్నదే కనిపించలేదు. రెండు వర్గాల మధ్య ఏదో ఒక అంశం మీద వివాదం నడుస్తూనే ఉండేది. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతైనా పరిస్థితి మారిందా అంటే… ఏ మాత్రం మారలేదన్నదే సమాధానం. పెద్దారెడ్డిని ప్రస్తుతం తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వడం లేదు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని గడిచిన ఐదేళ్ళలో అరాచకంగా ప్రవర్తించిన వ్యక్తిని ఇప్పుడు ఊళ్ళోకి రానివ్వబోమంటూ ఓపెన్‌ స్టేట్‌మెంట్సే ఇస్తున్నారు టిడిపి లీడర్స్‌ అండ్‌ కేడర్‌. పోలింగ్‌ మరుసటి రోజు జరిగిన అల్లర్ల తర్వాత జేసీ ఫ్యామిలీతో పాటు కేతిరెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలోకి రాకూడదంటూ ఆంక్షలు విధించింది కోర్ట్‌. ఆ తర్వాత ఆంక్షల సడలింపుతో… జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే అస్మిత్‌ రెడ్డి తాడిపత్రిలో ఉంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దారెడ్డిని మాత్రం అడుగు పెట్టనివ్వబోమని తెగేసి చెబుతోంది జేసీ వర్గం.

పైగా ఆయన్ని అసలు జిల్లా నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ ను తెరప్తెకి తెస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. పెద్దారెడ్డి అనుచరుడు కందిగోపుల మురళి ఇంటిపై దాడులు జరిగాయి. దీంతో ప్రస్తుతం తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక మాజీ ఎమ్మెల్యేని నియోజకవర్గంలోకి ఎందుకు అడుగు పెట్టనివ్వరంటే… అధికారంలో ఉండగా ఆయన ఏం చేశారో మర్చిపోయారా అని ప్రశ్నిస్తోందట జేసీ వర్గం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రిలో ఎంతోమందిపై అక్రమ కేసులు పెట్టించారని, పెద్దారెడ్డి కొడుకులు దౌర్జన్యాలు చేశారని, అలాగే ఆయన స్వయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారని, అలాంటి వ్యక్తిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తామన్నది జేసీ అనుచరుల మాటగా చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా నేను అనుకుంటే మీరు తాడిపత్రిలో అడుగు పెట్టలేరంటూ గతంలో పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారట. అంతేకాకుండా తాడిపత్రి మహిళా కౌన్సిలర్లు, ఇతర మహిళా నాయకులు పెద్దారెడ్డి పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారట. మహిళలని కూడా చూడకుండా అక్రమ కేసులు పెట్టించి తమను పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పారని, గతంలో ఊళ్ళు వదిలివెళ్ళాల్సిన పరిస్థితి కల్పించిన వ్యక్తికి ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలంటూ జేసీ అనుచరులు రివర్స్‌లో ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. గడిచిన ఐదేళ్ళలో తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన అన్ని వ్యవహారాలను బయటికి తీసు చట్టపరంగా కూడా పెద్దారెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారట టీడీపీ నాయకులు. వాటన్నిటి మీద ఫిర్యాదులు చేయడంతో పాటు… జనంలో చర్చకు పెట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అసలు జిల్లా నుంచి బహష్కరించాలన్న డిమాండ్‌కు పదును పెట్టాలనుకుంటోందట జేసీ వర్గం. ఈ ఎత్తులు, పై ఎత్తులతో తాడిపత్రి రాజకీయం రసవత్తరంగా మారడంతోపాటు ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఈ గొడవలు ఎట్నుంచి ఎటు పోతాయోనని టెన్షన్‌ పడుతున్నారు నియోజకవర్గ ప్రజలు.