NTV Telugu Site icon

Off The Record: ఆ బాబాయ్‌, అబ్బాయ్‌కి పొలిటికల్‌గా చుక్కలు కనిపిస్తున్నాయా..?

Otr Kethireddy

Otr Kethireddy

Off The Record: ఆ బాబాయ్‌, అబ్బాయ్‌కి పొలిటికల్‌గా చుక్కలు కనిపిస్తున్నాయా? వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు నియోజకవర్గాలను సొంత సామ్రాజ్యాల్లా ఏలిన ఇద్దరికీ ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయా? వీళ్ళిద్దరి విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? గతం వదల బొమ్మాళీ… అంటున్న ఆ బాబాయ్‌, అబ్బాయ్‌ ఎవరు? ఏంటి వాళ్ళ కథ?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్‌, అబ్బాయ్‌ రాజకీయ సవాళ్ళతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు తమ నియోజకవర్గాల్లో తిరుగులేని పెత్తనం చెలాయించిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇప్పుడు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారట. కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి సోదరుడు పెద్దారెడ్డి. సూర్య ప్రతాప్ రెడ్డి కొడుకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి. అప్పట్లో సూర్య ప్రతాప్ రెడ్డి హత్య తర్వాత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఇక 2019లో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక గుడ్ మార్నింగ్ పేరుతో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు వెంకట్రామిరెడ్డి. 2019 నుంచి 24 వరకు ఇటు అబ్బాయి.. అటు బాబాయ్… ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. తాడిపత్రిలో పెద్దా రెడ్డి.. ధర్మవరంలో కేతిరెడ్డి తమ మార్క్‌ వేసుకున్నారు. అదే సమయంలో… తమ రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించారన్న ఆరోపణలున్నాయి. ఇక 2024 ఎన్నికల్లో కూటమి వేవ్‌లో బాబాయి, అబ్బాయి ఇద్దరికీ ఓటమి తప్పలేదు. దీంతో ఐదేళ్లపాటు నియోజకవర్గాలకు రారాజుల్లా వెలిగిపోయిన ఇద్దరికీ అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయన్నది లోకల్‌ టాక్‌. ముఖ్యంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి మధ్య జరిగిన వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నిత్యం ఏదో ఒక వివాదంతో ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి. మాటలు తూటాల్లా కాకుండా… డైనమైట్స్‌లా పేలేవి. గతంలో అధికారంలో లేనప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డికి ఎదురు నిలబడ్డారు. ఇప్పుడిక అధికారం రాగానే తానేంటో చూపిస్తున్నారాయన. ప్రస్తుతం ఓ తాడిపత్రిలో పెద్దారెడ్డికి ఓ రేంజ్‌ ఎదురు దెబ్బలు తగులుతున్నాయట.. బాబాయ్ పరిస్థితి ఇలా ఉంటే… ఇక అబ్బాయి పరిస్థితి మరోలా ఉంది. సహజంగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గొడవలకి దూరంగా ఉంటారన్న పేరుంది. తన తండ్రి ఫ్యాక్షన్‌కు బలి కావడంతో.. ఆయన ధర్మవరంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటారని చెబుతుంటారు కార్యకర్తలు. అయితే ఈసారి ఇక్కడ బీజేపీకి చెందిన సత్యకుమార్ గెలవడం… ఆయన ఏకంగా రాష్ట్ర మంత్రి కావడంతో కేతిరెడ్డికి షాక్ తగిలినట్టయిందట. ఓటమి తర్వాత రాజకీయాలప్తె తనదైన శ్తెలిలో విశ్లేషణలు మొదలు పెట్టారు వెంకట్రామిరెడ్డి.అయితే మూడు రోజుల క్రితం సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయకులను పరామర్శించేందుకు వచ్చినప్పుడు వాహనం టర్నింగ్ తిరిగే విషయంలో కేతిరెడ్డి డ్రైవర్ కు బిజెపి శ్రేణులుకు మధ్య గొడవ జరిగింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. నాకు లెక్కలు బాగా తెలుసు అని, కచ్చితంగా త్వరలోనే అందరి లెక్కలు తేలుస్తానని బిజెపి శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మంత్రి సత్య కుమార్ కూడా అదే రేంజ్‌లో స్పందించడంతో పొలిటికల్‌ కాక పెరిగింది.

కేతిరెడ్డికి ఓటమితో మైండ్ బ్లాక్ అయిందని… ప్రజలపై కారు నడిపి గుద్దుకుంటూ వెళ్లి తన నిజస్వరూపం ఏంటో బయట పెట్టారని కామెంట్‌ చేశారు సత్యకుమార్. కేతిరెడ్డి చేసిన దోపిడీలు, దౌర్జన్యాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా… ఆయనకు బుద్ధి రాలేదన్నారు. జైలు జీవితం గడపాలని అంత కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామంటూ సత్య కుమార్ ఎక్స్ లో కౌంటర్ ఇచ్చారు. విషయం అక్కడితో ఆగలేదు.. కేతిరెడ్డిపై ఏకంగా మర్డర్ అటెంప్ట్ కేసు కూడా బుక్‌ అయింది. ఆయనతో పాటు మరో ఆరుగురి మీద కేసులు నమోదుకావడం చూస్తుంటే.. ధర్మవరంలో కేతిరెడ్డి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందంటున్నారు పరిశీలకులు. ఇలా ఐదేళ్లపాటు ఒక వెలుగు వెలిగిన.. బాబాయ్, అబ్బాయిలకు ఎదురు దెబ్బలు తగులుతుండటం ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ అయింది.