NTV Telugu Site icon

Off The Record : అనలిస్టు అవతారమెత్తిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..

Kethi Reddy Otr

Kethi Reddy Otr

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలుసుగా! రోజూ పొద్దున్నే ఓ 20 మందిని వేసుకుని, వీధులన్నీ తిరుగుతూ, అందరినీ పలకరిస్తూ, పెన్షన్ వచ్చిందా? పథకం వచ్చిందా అంటూ టిపికల్ సీమ యాసలో మాట్లాడుతుంటారు! ఎస్.. ఆయనే! ఈ ఎన్నికల్లో ఓడిపోయిన కేతిరెడ్డి ఇప్పుడేం చేస్తున్నారు? ఈసారి ఆయన ఎత్తిన అవతారమేంటి? ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి! సోషల్ మీడియాను అప్పుడప్పుడు ఫాలో అయ్యేవాళ్లకు కూడా తెలిసిన ఫేస్! ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోజూ పొద్దున్నే ఓ 20-30 మందిని వెనకాల తిప్పుకుంటూ.. నియోజకవర్గంలోని ఊరు ఊరునూ పలకరించుకుంటూ.. పెద్దమ్మా చిన్నమ్మా అంటూ మాట్లాడేవారు. ఇల్లుందా, వాకిలి ఉందా పొలముందా అని అడుగుతూ సాగిపోవడం ఆయన దినచర్య. టీషర్టు.. ట్రాక్ పాయింటు.. మిలట్రీ కటింగు.. రెండు చేతులు వెనక్కి పెట్టుకుని టిపికల్ వాకింగ్ స్టయిల్‌తో నడుచుకుంటూ వెళ్లే కేతిరెడ్డి ఏపీలోనే కాదు.. తెలంగాణలో కూడా ఫుల్ ఫేమస్. ఆయన వాయిస్ మీద సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చాయి.

కేతిరెడ్డి మొదటి నుంచి రాజకీయాల్లో చాలా భిన్నంగా ఉంటారు. చాలాఏళ్ల క్రితమే గుడ్ మార్నింగ్ అంటూ ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. ప్రతి అంశాన్ని కూలంకషంగా తెలుసుకుంటారని పేరుంది. ఎవరైనా విమర్శలు చేస్తే దానికి ఆయన దగ్గర ఆన్సర్లు రెడీగా ఉంటాయని పొలిటికల్ సర్కిల్లో వినిపించే మాట. సరే, రాజకీయాలన్నాక గెలుపు ఓటములు సహజం! జనం ఇచ్చిన తీర్పుతో కేతిరెడ్డి కూడా మాజీ అయ్యారు. సరే బానే ఉంది. ఇంతకూ ఆయన ఇప్పుడేం చేస్తున్నారు.

ఇదిగో ఇలా.. విశ్లేషకుడిగా మారిపోయారు కేతిరెడ్డి. ఎన్నికల ఫలితాలపై చాలామంది మేధావులు, రాజకీయ పండితులు కూడా చెప్పని కారణాలు చెబుతూ అనలైజ్ చేస్తున్నారు. కాకపోతే ఆయన ఏ మీడియా డిబేట్లో పాల్గొనడం లేదు. సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫాం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఓటమికి కారణాలేంటి అన్న అంశాల మీద రకరకాల యాంగిల్లో, రకరకాల లాజిక్స్ వివరిస్తూ కాలం గడుపుతున్నారు. అంతేకాకుండా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, జగన్ కోటరీ ఇలాంటి అంశాల మీద కూడా సున్నితంగా విమర్శలు చేస్తున్నారు. ఈ కామెంట్స్ నియోజకవర్గంలో సంచలనంగా మారాయి. ఎన్నికల ఫలితాలు తర్వాత మూడు నాలుగు సార్లు ఇలా వీడియోలు విడుదల చేసి తన ఒపీనియన్‌ షేర్ చేశారు. అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనపై కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఈవీఎంలపై ఏపీలో వివాదం పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఇప్పటికే ఈ అంశంపై కోర్టుకు వెళ్లారు. ఇదే టాపిక్‌పై కేతిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా దేవాలయంలో హుండీ చోరీకి గురైతే.. దొంగతనం ఎలా జరిగిందో కనుక్కోవాలి కానీ మళ్లీ.. కొత్తగా హుండీలో డబ్బులు వేయండి.. అప్పుడు లెక్కిస్తామంటే ఎలా ఉంటుందో ప్రస్తుతం ఎన్నికల అధికారుల తీరు కూడా అలాగే ఉందంటూ విమర్శిస్తున్నారు. ఈవీఎంలపై తాను వ్యక్తం చేస్తున్న అనుమానాలు.. దేశంలో చాలామంది ప్రముఖులకు వస్తున్నాయని కేతిరెడ్డి అంటున్నారు.

ఒక్క ఎలక్షనే కాదు.. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం.. ఒలింపిక్స్‌లో భారత్ ఎందుకు వెనుకబడిపోయింది? రాయలసీమలో వానలు ఎప్పుడెప్పుడు కురుస్తాయి? చంద్రబాబు సృష్టించే సంపద ఎన్ని పథకాలకు వస్తుంది? ఇలా తనకున్న ప్రాపంచిక పరిజ్ఞానాన్ని అందరికీ తలా ఇంత పంచుతున్నారు. గల్లీ నుంచి గ్లోబల్ వరకు కేతిరెడ్డి టచ్ చేయని టాపిక్ లేదు. రాజకీయాల్లో ముదిరితే.. పండిపోయిందిక్కడ.. రంగేశాం అంతే.. అంటారు. కానీ ఈయన మాత్రం కలర్ వేయకుండానే సీనియర్ అనలిస్టుగా మారిపోయారు.

 

 

Show comments