NTV Telugu Site icon

Off The Record : ఆ ఎమ్మెల్యే సొంత హామీలు..గెలిచి 9 నెలలు గడిచినా..!

Kamareddy Mla

Kamareddy Mla

పార్టీ మేనిఫెస్టోతో సంబంధం లేకుండా సొంత స్కీమ్స్‌ ప్రకటించేశారా ఎమ్మెల్యే. నన్ను చూసి ఓటెయ్యండి, నా పథకాల్ని చూడండి. 150 కోట్లు ఖర్చయినా సరే… సొంత ఆస్తుల్ని అమ్మి అయినా సరే… నియోజకవర్గాన్ని నందనవనం చేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. గెలిచినా, ఓడినా ఆరు నెలల్లో అన్నీ మొదలుపెడతానన్న లీడర్‌.. తీరా గెలిపించి 9 నెలలు అవుతున్నా ఆ ఊసేలేదట. నియోజకవర్గ ప్రజలు రివర్స్‌ అవుతున్నారని భయపడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏంటి ఆయన సొంత హామీలు? కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్- తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారాయన. ఇద్దరు ఉద్దండులను కాదని రమణారెడ్డికి తొలిసారి అవకాశం ఇచ్చారు నియోజకవర్గ ప్రజలు. అలా ఎందుకంటే…. అందుకూ.. ఓ కారణం ఉందంటున్నారట. ఎన్నికల ప్రచారంలో దాదాపు 150 కోట్లతో సొంత మ్యానిఫెస్టో ప్రకటించారు కాటిపల్లి. ఏ ఎమ్మెల్యే అభ్యర్ధి చేయని సాహసం చేశారాయన. తాను ఓడినా, గెలిచినా 150 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తానని చెప్పారు అప్పట్లో. ప్రజలు సైతం ఆ మాటలను నమ్మి గెలిపించారు. 6నెలల్లో హామీలను అమలు చేస్తానని అప్పట్లో ఆన్నారట కాటిపల్లి. గడువు ముగియడంతో ఇంత కాలం ఓపిక పట్టిన ప్రజలు ఇప్పుడు ఆ హామీలు సంగతేంటని ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. బీజేపీ క్యాడర్ సైతం హామీల అమలు సాధ్యమేనా అని చర్చించుకుంటున్నారట. సొంత ఆస్తులు అమ్మైనా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ప్రామిస్ చేసిన ఎమ్మెల్యే… ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదట. ప్రభుత్వాలు చేసేదేంటి… నన్ను గెలిపించండి అన్నీ నేనే చేసి చూపిస్తానంటూ నాడు గొప్పలుపోయిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటూ రాజకీయ ప్రత్యర్థులు సైతం ఎదురుదాడి మొదలు పెట్టినట్టు తెలిసింది.

అయిసే… కల్లాల నిర్మాణం కోసం గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు ఎమ్మెల్యే అనుచరులు. ఒక్కో హామీని వరుసగా అమలు చేసి చూపిస్తామంటూ జనాన్ని సముదాయించే ప్రయత్నంలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికలకు ముందు అంతన్నాడింతన్నాడు…ఇప్పుడేమైందన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. నియోజకవర్గం మొత్తం ఉచిత కార్పొరేట్ విద్య , వైద్యం, ఉచిత శిక్షణ కేంద్రాలు, రైతులకు కల్లాల నిర్మాణం, క్రీడా ప్రాంగణాలు, జనరల్ ఆసుపత్రులను నిర్మిస్తానని ఎన్నికల హామీలు ఇచ్చారు కాటిపల్లి. 150 కోట్ల రూపాయల సొంత నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. సొంత నిధులతో ఆస్పత్రులు, స్కూళ్లు కట్టిస్తా… ఆస్తులు అమ్మి అయినా పని చేస్తానన్న మనిషి ఇప్పుడేమయ్యారంటూ ప్రజల వైపు నుంచి కూడా నిసదీతలు మొదలవుతున్నాయట. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా…ప్రభుత్వం పై కాటిపల్లి విమర్శలు చేస్తే.. 150 కోట్ల మ్యానిఫెస్టోను అంశాన్ని తెర మీదికి తెస్తున్నారట కాంగ్రెస్ నేతలు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాటిపల్లి మేనిఫెస్టోనే జనం ముందుపెట్టి టార్గెట్‌ చేసే ప్లాన్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నట్టు సమాచారం.ఇటు బీజేపీ మాత్రం 150 కోట్ల మ్యానిఫెస్టో పై ప్రజల నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. ఇటు ఎమ్మెల్యే ను ప్రశ్నించేందుకు రైతులు, విద్యార్థులు, యువత, సిద్ధమవుతుండటంతో కామారెడ్డి బీజేపీకి మున్సిపల్‌ ఎన్నికల గండం పొంచి ఉందంటున్నారు పరిశీలకులు. మరి ఎమ్మెల్యే వారికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అనిపిస్తోందని ఆ మధ్య అసెంబ్లీ సమావేశాల సందర్భందా వెంకట రమణారెడ్డి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఈ సెల్ఫ్‌ మేనిఫెస్టో ఎపిసోడ్‌ ఎట్నుంచి ఎటు వెళ్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.