వెలమల కోటలో బీసీ రెండోసారి పాగా వేయగలుగుతారా? ఒకసారి గెలిచిన బీసీ ఎంపీ రెండోసారి గెలవబోరన్న సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా? లేక బలపడుతుందా? అగ్రవర్ణ నేతలతో ఢీ అంటే ఢీ అంటున్న ఆ సిట్టింగ్ ఎంపీ రెండోసారి లోక్‌సభ మెట్లు ఎక్కగలుగుతారా? ఏదా నియోజకవర్గం? ఏంటా సెంటిమెంట్ స్టోరీ? కరీంనగర్ లోక్‌సభ సీట్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఈ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కలిపి 17 లక్షల 96 వేల దాకా ఓట్లు ఉన్నాయి. 17 సాధారణ, రెండు ఉప ఎన్నికలు జరగ్గా… కాంగ్రెస్ పదిసార్లు గెలిచింది. కమ్యూనిస్టులు ఒకసారి, తెలుగుదేశం ఒకసారి, బీజేపీ మూడుసార్లు, బీఆర్‌ఎస్ మూడుసార్లు గెలుపొందాయి.. ఇప్పటి వరకు ఇక్కడ నుంచి 12 మంది నేతలు ఎంపీలుగా ఎన్నిక అవ్వగా…. అందులో ఒక దళితుడు, ఒకరు రెడ్డి, ముగ్గురు బీసీలు మినహా మిగతా ఏడుగురు వెలమ నేతలే ఉన్నారు. దీన్ని బట్టి కరీంనగర్ వెలమలకు పెట్టని కోటలాగా ఉందంటారు పొలిటికల్ పండిట్స్. ఇక్కడ బీసీ నేత ఎంపీగా ఎన్నిక అవడానికి 45 ఏళ్ళు పట్టింది. దాదాపు 8 లక్షల బీసీ ఓట్లు ఉండటంతో ఈసారి అందరి దృష్టి ఆ ఓట్ల మీదే పడింది. 1996 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు బీసీ కార్డు ప్రయోగం చేశారు.. మెజారిటీగా ఉన్న బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఎలగందుల రమణను వ్యూహాత్మకంగా బరిలోకి దించారు. పద్మశాలీలు ఓన్ చేసుకోవడంతోపాటు మిగతా బీసీ కులాల వారు కూడా కలిసి రావడంతో… అప్పట్లో ఆ ప్లాన్ ఫలించింది. అప్పటి వరకు సాగుతూ వస్తున్న వెలమల విజయాలకు 96లో బ్రేక్ వేశారు ఎల్.రమణ. ఆ తర్వాత 1998 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్ రావు చేతిలో ఓడిపోయారు రమణ. అలా ఒక్కసారి మాత్రమే పార్లమెంట్ మెట్లు ఎక్కారాయన. తెలుగుదేశం అనుసరించిన వ్యూహాన్నే 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంచుకుంది.
అప్పటి సీఎం వైఎస్సార్ తనదైన శైలిలో సోషల్ ఇంజనీరింగ్ చేసి.. బీసీల్లో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌ను రంగంలోకి దించారు. నాడు చతుర్ముఖ పోటీలో పొన్నం ఎంపీగా ఎన్నికయ్యారు. అందివచ్చిన అన్ని అవకాశాలను వినియోగించుకుని అంచెలంచెలుగా ఎదిగిన పొన్నం ప్రభాకర్ 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు.. ఆతర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ మూడోస్థానానికే పరిమితమయ్యారాయన. 2009 ఎన్నికల్లో బీసీ సమీకరణాలను సద్వినియోగం చేసుకున్న పొన్నం ఆ తర్వాత వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారనే టాక్ ఉంది. కేవలం సొంత సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్నది ఆయన మీదున్న అపవాదు. పొన్నం వరుస ఓటములతో ఇక్కడ ఒకసారి గెలిచిన బీసీ రెండో సారి గెలవరనే సెంటిమెంట్ మొదలైందట. ఈ క్రమంలో బీజేపీ నుంచి 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మరో బీసీ నేత బండి సంజయ్ అనూహ్య విజయాన్ని దక్కించుకున్నారు. అప్పటి ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా బండి గెలవడం అప్పట్లో సంచలనమైంది.
హిందూత్వ, బీజేపీకి ఉన్న సంస్థాగత బలానికి తోడుగా బీసీ ఓట్ల ఏకీకరణ కలిసొచ్చిందట. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బలమైన సామాజికవర్గంగా ఎదిగిన మున్నూరు కాపులు ఒక్కతాటిపైకి రావడం.. మిగతా బీసీ కులాలైన పద్మశాలీలు, యాదవ్, ముదిరాజ్ లాంటి వారిని కలుపుకోవడంలో సక్సెస్ అయ్యారాయన. ఇప్పుడు మరోసారి కరీంనగర్ నుంచి బండి సంజయ్ బరిలోకి దిగడంతో ఆయన గెలుపుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకసారి గెలిచిన బీసీ ఎంపీ ఇక్కడ మరోసారి గెలవరన్న సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక బండి సంజయ్ తన టాలెంట్‌తో సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తారా అన్న విశ్లేషణలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో. ప్రత్యర్ధులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇద్దరూ వెలమలే కావడం కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారట బండి. గత ఎన్నికల తర్వాత పెరిగిన క్రేజ్, అప్పటితో పోలిస్తే బీసీల్లో వచ్చిన చైతన్యం తనకు పాజిటివ్ అవుతాయన్నది ఆయన నమ్మకమని ప్రచారం జరుగుతోంది. దాదాపు 8 లక్షలకు పైగా ఉన్న బీసీ ఓటర్లు కులాల వారీగా విడిపోతారా…? లేక బీసీ ఓన్లీ నినాదాన్ని అందుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.