NTV Telugu Site icon

Off The Record : మనల్ని వాడుకొని వదిలేశాయి.. జీవన్ రెడ్డి ట్రెండింగ్ లో ఉండాలనుకుంటున్నారా.?

Jeevan Reddy

Jeevan Reddy

ఆ కాంగ్రెస్‌పార్టీ సూపర్‌ సీనియర్‌… మోఖా చూసి ధక్కా ఇస్తున్నారా? కావాల్సింది సాధించుకోవడానికి ఇదే కరెక్ట్‌ టైం అనుకుంటున్నారా? పార్టీ నన్ను వాడుకుని వదిలేసిందన్న కామెంట్స్‌ వెనక వ్యూహం ఉందా? లేక అవి కట్టలు తెంచుకున్న ఆవేదన నుంచి వచ్చాయా? సరిగ్గా ఎలక్షన్‌ టైం చూసి మనసులో మాట బయటపెట్టిన ఆ ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఎవరు? ఏంటాయన వ్యధాభరిత రాజకీయ గాధ? టీ. జీవన్‌రెడ్డి… ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణదాకా…కాంగ్రెస్ రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. ఓసారి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన…కొన్నాళ్ళ నుంచి అలకలకు కేరాఫ్… అడ్రస్‌గా మారారు. సమయం దొరికిన ప్రతీసారీ ఏదో ఒక కారణంతో…తన అసంతృప్తి వెళ్లగక్కేందుకు అలకాస్ట్రాన్ని సంధిస్తున్నారు. అంత సీనియార్టీ ఉంది కాబట్టి….పార్టీ నేతలు కూడా సీరియస్‌గా తీసుకుని ఎప్పటికప్పుడు ఆయన్ని కూల్‌ చేస్తున్నారు. అయితే… హస్తంపార్టీ రాజకీయాలను ఔపోసన పట్టిన ఆయన ఎప్పటికప్పుడు పార్టీలో తన పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారట. ఏదో ఒక అంశంపై కామెంట్స్‌తో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారట. జగిత్యాల అసెంబ్లీ స్థానంలో జీవన్‌ని వరుసగా రెండు సార్లు ఓడించిన సంజయ్‌కుమార్ కారు దిగి కాంగ్రెస్ తీర్దం పుచ్చుకోవడంతో స్టార్టయిన ఈ అసంతృప్త రాగం రోజుకో తాళంలో మోగుతూనే ఉందని అంటున్నారు. సంజయ్ చేరిక సందర్భంలో జీవన్ రెడ్డి తన నిరసనను ఓ రేంజ్‌లో తెలిపారు. పార్టీ ముఖ్యనాయకులు జగిత్యాల వెళ్ళి బతిమిలాడాల్సిన పరిస్థితి కల్పించారు. ఆతర్వాత నియోజకవర్గంలో తన పెత్తనం సాగకపోవడంతో అనుచరులతో మరో ఎపిసోడ్ నడిపించేసారు… అదే సమయంలో జరిగిన తన అనుచరుడి హత్యతో రోడ్డెక్కి పార్టీ నేతల తీరును బహిరంగంగానే విమర్శించారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో జరుగుతున్న కోల్డ్‌వార్‌ని తన వ్యాఖ్యలతో తెరపైకి తెచ్చారు… ఇలా ఆయన అలిగిన ప్రతీసారి నేతలు కలవడం… లేదంటే హైదరాబాద్‌కి పిలవడం… మాట్లాడి పంపించడం జరుగుతూనే ఉంది. అదంతా ఒక ఎత్తయితే…. తాజాగాఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జగిత్యాల పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

గ్రాడ్యుయేట్‌ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి తిరిగి పోటీ చేయకుండా ప్రచారానికి పరిమితం అయ్యారు. అందులో భాగంగా జగిత్యాలలో ఆయనకు నియోజకవర్గ బీజేపీ నేత రవీందర్‌రెడ్డి ఎదురు పడ్డారు. పార్టీలు వేరైనా… పలకరించుకోవడం కామన్‌ కాబట్టి… ఇద్దరూ విష్‌ చేసుకున్నారట. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ మనల్ని వాడుకుని వదిలేశాయంటూ… రోలొచ్చి మద్దెలతో చెప్పుకున్నట్టు పరస్పరం ఫీలింగ్స్‌ పంచుకుని వాపోయారట ఇద్దరూ. పార్టీల బలోపేతం కోసం పనిచేసిన మనల్ని కాదని కొత్తవారికి ప్రయార్టీ ఇస్తున్నాయని అన్నారట జీవన్ రెడ్డి. గత ఎన్నికల్లో రవీందర్‌రెడ్డిని కాదని బోగ శ్రావణికి బీజేపీ టికెట్ దక్కిన అంశం, తమ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన సంజయ్‌కి ప్రాధాన్యత లభిస్తున్న విషయాలను ప్రస్తావించారట ఆయన. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి కూడా… క్రమశిక్షణకు తాను మారుపేరు అని చెప్పుకునే నేత ఇలా మాట్లాడటంతో ఆయనతో పాటు ప్రచారంలో ఉన్న అవాక్కయినట్టు సమాచారం. తనకన్నా ఎంతో జూనియర్ అయిన రవీందర్‌రెడ్డితో జీవన్‌రెడ్డి ఎందుకు ఈ అంశాలను ప్రస్తావించాల్సి వచ్చిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. అయితే జీవన్‌రెడ్డి వ్యాఖ్యల వెనక వ్యూహం ఏంటనేది అంతుచిక్కులేదని ద్వితీయ శ్రేణి నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. నిన్న మొన్నటి దాకా జీవన్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని జగిత్యాలలో జోరుగా ప్రచారం సాగింది….. ఆ తర్వాత క్యాబినెట్ హోదా ఖాయమని చెప్తూ వచ్చారు ఆయన అనుచరులు… కానీ పెద్దాయన ఒక్కసారిగా ఇలా నిర్వేదంగా మాట్లాడటంతో అసలు ఏం జరుగుతోందో అర్దం కాని పరిస్థితి నెలకొందట క్యాడర్‌లో. నన్ను వాడుకుని వదిలేశారు అంటే… ఎమ్మెల్సీ పదవి లేనట్టేనా? అనే డిస్కషన్ షురూ అయిందట జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్‌లో. లేదంటే… జీవన్‌ కాంగ్రెస్ అధిష్టానానికి తన వైఖరిని చెప్పేందుకు పవర్‌ఫుల్‌ ఆయుధమైన అసంతృప్తిని, అలకలను ప్రయోగిస్తున్నారా అనేది ఇంకొందరి డౌట్‌. మరోవైపు పదే పదే అలుగుతున్న పెద్దమనిషిని పార్టీ ముఖ్యులు కూడా లైట్ తీసుకున్నారని, అందుకే ఇలా నిర్వేదంగా మాట్లాడారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అయితే తన దగ్గరికి వచ్చిన క్యాడర్‌తో కూడా సంజయ్ పార్టీలోకి వచ్చినప్పుడే నిర్ణయం తీసుకుని వుండాల్సింది… అప్పుడు వెనక్కితగ్గి తప్పు చేశానని అంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు ప్రత్యర్దులతో పార్టీ గుట్టును… ఇటు క్యాడర్‌తో ఇలా అంతర్గత వ్యవహారాలను చర్చిస్తుండటంతో… అసలు జీవన్‌రెడ్డి మదిలో ఏముంది అనేది ఇప్పుడు అంతుచిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. మొత్తానికి మోఖా చూసి ధక్కా ఇస్తున్న మోస్ట్ సీనియర్ నేత తదుపరి స్టెప్స్ ఏవిధంగా ఉంటాయనేది ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్గాల్లో సస్పెన్స్‌.