Site icon NTV Telugu

Off The Record : అక్కడ జనసేన నేతలు పేరుకే ఎమ్మెల్యేల.. పెత్తనం అంతా వేరే పార్టీ వాళ్లదా?

Janasena Otr

Janasena Otr

ఆ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వ్యవహారం అక్క పెత్తనం- చెల్లెలి కాపురంలా మారిపోయిందా? ఎమ్మెల్యే పదవి ఒక పార్టీది అయితే…. మరో పార్టీ నాయకులు పవర్‌ సెంటర్స్‌గా మారిపోయారా? మనం జస్ట్‌…. పేరుకు ఎమ్మెల్యేలుగా, ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోవాల్సిందేనా అని వాళ్ళంతా మధనపడుతున్నారా? మెల్లిగా అది బ్లాస్టింగ్‌ స్టేజ్‌కు చేరుకుంటోందా? ఎక్కడుందా పరిస్థితి? ఎవరా ఎమ్మెల్యేలు? అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అత్యధికంగా సీట్లు సాధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళ పరిస్థితి గందరగోళంగా ఉందా అంటే… అవునన్నదే పరిశీలకుల సమాధానం. ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జనసేన తరపున గెలిచారు. నిడదవోలు నుంచి విజయం సాధించిన కందుల దుర్గేష్ సంగతి పక్కనపెడితే…. మిగతా జనసేన ఎమ్మెల్యేలంతా లోలోపల కుతకుతలాడిపోతూ….పైకి మాత్రం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నట్టు నటిస్తున్నారట. అలా ఎందుకు? ఏమైందని సన్నిహితులు ఎవరన్నా అడిగితే….పేరుకే ఎమ్మెల్యేలం తప్ప…. మా చేతిలో ఏం లేకుండాపోతోందని ఘొల్లుమంటున్నట్టు సమాచారం. నియోజకవర్గాల్లో అడుగడుగునా తెలుగుదేశం నాయకుల పెత్తననం పెరిగిపోతోందని, ప్రతి విషయంలోనూ…వాళ్ళకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని, అసలు ఎమ్మెల్యేలు వాళ్ళో… మేమో అర్ధం కావడం లేదంటూ ఫ్రస్ట్రేట్‌ అవుతున్న్టటు సమాచారం. కూటమిలో భాగస్వాములు కావడం, లోకల్‌గా టిడిపి నేతలకు జనసేన ఎమ్మెల్యేకంటే ఎక్కువ పట్టు ఉండటంతో…. అధికారులతో పాటు ఓవరాల్‌గా నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల మాటకే విలువ ఉంటోందని, మేం ఆటలో అరటిపండులా మారిపోతున్నామని వాపోతున్నట్టు తెలుస్తోంది. కందుల దుర్గేష్ మంత్రి అవడంతో ఆయనకు ఇబ్బంది లేకున్నా…. మిగతా ఐదుగురికి ఇలాంటి సమస్యలే వస్తున్నాయట. భీమవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జస్ట్ ఎన్నికలకు ముందు గ్లాస్‌ కండువా కప్పుకున్నారు. మిగతా వాళ్ళలో పోలవరం నుంచి చిర్రి బాలరాజు, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ విజయం సాధించారు. వీరంతా తొలిసారి ఎమ్మెల్యేలు కావడంతో వీరి గెలుపులో టిడిపి నాయకులు ముఖ్య పాత్ర పోషించారన్న అభిప్రాయం ఉంది. అయితే… ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేదాకా పరిస్థితి ఒకలా ఉన్నా.. ఇపుడు అధికారం చెలాయించే విషయంలో మాత్రం తమకు పూర్తి స్వేచ్చ లేకుండా పోయిందనేది జనసేన నాయకుల మాట. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా, టిడిపినేతలకు పైన ఉన్న పరిచయాలతో తమకు అవసరమైన నామినేటెడ్ పదవుల దగ్గరనుంచి లోకల్ కాంట్రాక్టుల వరకు ఏది కావాలనుకుంటే అది తెచ్చుకోగలుగుతున్నారట.

జనసేన ఎమ్మెల్యేలు మాత్రం ఆస్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారని సమాచారం. తమకున్న అధికారంతో ఏదన్నా చేద్దామనుకున్నా…. టిడిపిలో త్యాగాలు చేసిన సీనియర్ నాయకులు అడ్డుపడుతున్నారని, వాళ్ళని కాదనలేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్ధంగాక తలలు పట్టుకుంటున్నారట జనసేన శాసనసభ్యులు. ఉంగుటూరు జనసేన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అయినప్పటికీ… ఆయన వెనుక టిడిపి మాజీ ఎమ్మెల్యే కమ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఉండటంతో ఇద్దరి మధ్య నామినేటెడ్‌ పోస్టులు, ఇతర వ్యవాహారాల్లో ఏకాభిప్రాయం కుదరడంలేదని సమాచారం. నరసాపురంలో జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు ఒకరికి నలుగురు అన్నట్టుగా టిడిపి నేతలు పోటీ వస్తున్నారట. తాడేపల్లిగూడెం, పోలవరంలోనూ ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. దీంతో…. విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకు వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకోవాలని ఒక దశలో అనుకున్నారట ఎమ్మెల్యేలు. కానీ… కాస్త నింపాదిగా ఆలోచించాక… తత్వం బోధపడి వెనక్కి తగ్గినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు పవన్‌కు ఫిర్యాదు చేసినా… ఆయన సర్దుకుపొమ్మని చెబుతారు తప్ప… సమరశంఖం ఊదమని చెప్పరు కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టు తెలుస్తోంది. అలా… జిల్లాలోని జనసేన ఎమ్మెల్యేలంతా…. పైకి ప్రశాంతంగానే కనిపిస్తున్నా లోలోపల తీవ్రంగా మధనపడుతున్నారట. అదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం పనుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం కంటే… పై స్థాయిలో పైరవీలు చేయించుకోవడం బెటరన్న ఫార్ములా ప్రకారం వెళ్తున్నారట. దీంతో రెండు పార్టీల నేతల మధ్య పైకి కనిపించని కోల్డ్‌వార్ నడుస్తోందని చెప్పుకుంటున్నారు. ఒకరి చేతిలో అధికారం, మరొకరిచేతిలో పెత్తనం అన్నట్టుగా ఉమ్మడి జిల్లాలో టిడిపి-జనసేన నేతల పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. అయితే… ప్రస్తుతానికి జనసేన ఎమ్మెల్యేలు లోలోపల మధనపడుతున్నా…. రాను రాను మాట నెగ్గించుకునే ప్రయత్నంలో కోల్డ్‌ వార్‌ కాస్తా… రియల్‌ వార్‌గా మారే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయం ఉంది. సర్దుకుపోదాం.. రా అన్నట్టుగా జనసేన ఎమ్మెల్యేలు కాంప్రమైజ్‌ అయితే…. వాళ్ళ రాజకీయ ఉనికే ప్రశ్నార్ధకం అవుతుంది గనుక ఏదో ఒక టైంలో బరస్ట్‌ అయిపోయే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే ఇక ప్యాచ్‌ లర్క్‌ కూడా కష్టం అవుతుందన్న విశ్లే,ణలు పెరుగుతున్నాయి. వ్యవహారం ముదిరి చిరిగి చేట అవకముందే రెండు పార్టీల పెద్దలు జోక్యం చేసుకోవాలని, లేదంటే పరిణామాలు తేడాగానే ఉండవచ్చన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో.

Exit mobile version