NTV Telugu Site icon

Off The Record : కేసుల్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా..?

Ips Otr

Ips Otr

ఓ ఐపీఎస్ అధికారి ఇంతగా బరితెగిస్తారా..? నేరుగా ప్రభుత్వం మీదే కుట్రలు పన్నుతారా..? అది కూడా ప్రతిపక్ష పార్టీ ప్రాపకం కోసం చేస్తారా? ఇదీ ప్రస్తుతం ఏపీ పొలిటికల్‌ అండ్‌ అడ్మిన్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. అసలేం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో? వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ గురించి అంతలా రచ్చ ఎందుకు అవుతోంది? ఖాళీ పీరియడ్‌ను వాళ్ళలో కొందరు వాడుతున్నారు? లెట్స్‌ వాచ్‌. గత ప్రభుత్వ పెద్దలతో పూర్తిగా అంటకాగి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు టీడీపీ శ్రేణులను అదే పనిగా ఇబ్బందులు పెట్టారంటూ… కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు ఎలాంటి పోస్టింగ్స్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఇలా వెయిటింగ్‌లో 20 మందిదాకా ఐపీఎస్‌లు, అదే స్థాయిలో ఐఏఎస్‌లు ఉన్నారు. వీళ్ళకు పోస్టింగ్స్‌ ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చినా, కొందరి విషయంలో ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గలేదు. ఇలాంటి వాళ్లలో కొందరు త్వరలో రిటైర్ అవబోతున్నారు కూడా. వాళ్ళని పక్కకు తప్పించిన కొత్తల్లో కాస్త చర్చ జరిగినా… క్రమంగా ఆ వ్యవహారం మరుగునపడిపోయింది.కానీ ఇప్పుడు ఒక్కసారిగా వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ మెమో ఇవ్వడంతో కలకం రేగింది. ఇది అసలు ఎవ్వరూ ఊహించని పరిణామం. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లంతా…. రోజూ డీజీపీ ఆఫీస్‌కి రావాలని.. అటెండెన్స్ రిజిస్టరులో సంతకం చేయాలని.. సాయంత్రం డ్యూటీ టైం అయ్యేంత వరకు డీజీపీ ఆఫీస్‌లోనే ఉండాలన్నది ఆ మెమో సారాంశం. అంతేకాకుండా…అత్యవసరమై ఏదైనా బాధ్యత అప్పజెబితే అటెండ్ కావాలని కూడా ఆదేశించంతో మెమో వ్యవహారం సంచలనం అయింది. పరిపాలన వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఇది పెను సంచలనమే సృష్టించిందని అంటున్నారు పరిశీలకులు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వెయిటింగ్‌లో ఉండడం సహజమే కానీ.. ఈ తరహా మెమోలు ఇవ్వడం మాత్రం… రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశంలోనే తొలిసారి అయి ఉండవచ్చంటున్నారు. అందునా… డీజీ, ఏడీజీ, ఐజీ స్థాయి అధికారులకు ఇలాంటి తాఖీదులివ్వడం సంచలనమేనన్నది పోలీస్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

అసలు ఈ తరహా మెమో ఎందుకు ఇచ్చారు? ఆ పరిస్థితి ఎందుకొచ్చింది..? దీనికి కారణాలేమై ఉంటాయనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే… ఐపీఎస్‌లకు మెమోలు ఇవ్వడం ఎంత షాకింగో…. అందుకు కారణాలు కూడా అంతకంటే షాకింగ్‌గా ఉన్నాయని చెబుతున్నాయట ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఆఫీసర్స్‌… దీన్నో ఆటవిడుపుగా ఫీలవుతూ దొరికిన సమయాన్ని కేసులు నీరు గార్చడానికి వాడుకుంటున్నట్టు పసిగట్టాయట ఇంటెలిజెన్స్‌ వర్గాలు. ప్రస్తుతం ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న అధికారులు, సిబ్బందితో తరచూ మీటింగ్‌లు పెడుతూ…నిందితుల మీద గట్టి సెక్షన్స్‌ పెట్టకుండా తూతూ మంత్రంగా ముగించమంటూ లాబీయింగ్‌ చేస్తున్నట్టు ఉప్పందిందట. కేసుల్లో తమ పేర్లతో పాటు వైసీపీ పెద్దల పాత్రను, ప్రమేయాన్ని తక్కువ చేసి చూపేలా నివేదికలు ఇవ్వాలని కోరుతున్నట్టు డీజీపీ ఆఫీస్‌కు సమాచారం అందిందని అంటున్నారు. అలాగే వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేసినట్టు నిర్ధారణకు వచ్చారట పెద్దలు. నిఘా విభాగం ఇచ్చిన నివేదిక చూసిన ప్రభుత్వ పెద్దలు షాకైనట్టు సమాచారం. అందుకే సదరు ఐపీఎస్ అధికారుల ప్రయత్నాలను సీరియస్‌గా తీసుకున్నట్టే కన్పిస్తోందని అంటున్నారు. ఆ పరిణామ క్రమంలోనే అప్రమత్తమై మెమోలు జారీ చేశారనేది పోలీస్ వర్గాల్లో టాక్. ఇప్పుడు వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఎస్ అధికారులు గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు. హయ్యెస్ట్ ర్యాంక్‌ ఆఫీసర్స్‌ సైతం ఉన్నారు. దీంతో వాళ్ళు తమ కింది స్థాయి అధికారులను ప్రభావితం చేయడం చాలా సులువైన పని అని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వాళ్ళు ఎవరెవరితో…ఎక్కడెక్కడ భేటీ అయ్యారన్న సమాచారం కూడా ప్రభుత్వ పెద్దల దగ్గర ఉందట. అన్నీ నిర్ధారించుకున్నాకే మెమో ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి పోలీస్‌ వర్గాలు. ఈ మెమోల మేటర్‌ ఏ మలుపు తిరుగుతుందోనంటూ ఆసక్తి చూస్తున్నారు పరిశీలకులు.