పచ్చని పల్లెల్లో ఇథనాల్ చిచ్చుపెడుతోంది. కంపెనీ మళ్లీ పనులు స్టార్ట్ చేయడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఉద్యమిస్తున్న రైతులకు మేమున్నామంటూ అభయం ఇచ్చిన రాజకీయ నేతలు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారు. ఇంతకీ…ఇథనాల్ కంపెనీ రగడ వెనుక ఎవరున్నారు? గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు వివాదం చెలరేగుతోంది. రాజోలి మండలం పెద్ద ధన్వాడ శివారులో 29 ఎకరాల్లో 189 కోట్ల రూపాయలతో గాయత్రీ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ఇథనాల్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వంలో 2023 నవంబర్‌లో ఏపీకి చెందిన వారు అనుమతులు పొందారు. ప్రతీరోజూ సుమారు లక్షా ఇరవై వేల లీటర్ల ఇంధనం ఉత్పత్తి చేసేలా కంపెనీ నిర్మాణానికి ప్లాన్ చేశారు. జీపీ తీర్మానం, ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండానే ఓ మధ్యవర్తి ద్వారా సేద్యం కోసం భూములు కొనుగోలు చేసి కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ గ్రామాలతో పాటు మరో పది గ్రామాల రైతులు, ప్రజలు ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. భూగర్భ జలాలతో పాటు, ఈ ప్రాంత పరిసరాలను కాలుష్యం చేసే ఇథనాల్ కంపెనీ మాకొద్దంటూ రైతులు, గ్రామాల ప్రజలు తెగేసి చెప్పారు. ఈ క్రమంలో ఈ యేడాది జనవరిలో పెద్ద ధన్వాడ పరిసర గ్రామాల ప్రజలు గ్రామ సభలు నిర్వహించుకున్నారు. జేఏసీగా ఏర్పడి, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి, రిలే నిరాహరదీక్షలు వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వీరి ఆందోళనలకు కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మద్దతు పలికాయి. ఆందోళన కార్యక్రమాలకు సంఘీబావం తెలిపిన స్థానిక బిఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తున్న అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కంపెనీని అడ్డుకుంటామని హామీ ఇచ్చి… శాసనమండలి సమావేశాల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు పలికి….వారిని హైదరాబాద్ తీసుకెళ్లి సంబంధిత మంత్రులతో కలిశారు. ఫ్యాక్టరీ అనుమతులపై పునరాలోచిస్తామని ..దాంతో పాటు ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామని హమీ పొందారు.
ఇంత వరకు బాగానే ఉంది. మరి కంపెనీ ఏర్పాటు నిర్ణయంపై వెనక్కి తగ్గకుండా రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రే ప్రయివేట్ సైన్యంతో పనులు ప్రారంభించేందుకు సిద్ధమవడం, కంపెనీ నిర్మాణ ప్రాంతంలో జెసిబిలు, బుల్డోజర్లతో పాటు కంటైనర్ క్యాబిన్లు దించటం, తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకోవడంతో గ్రామస్థులు, రైతులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. కంపెనీకి చెందిన కంటైనర్, వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు, గుడిసెలు తగలబెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐతే ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. పలువురుకి నోటీసులిచ్చారు.
మరోవైపు…ఇథనాల్ కంపెనీ యాజమాన్యానికి స్థానికంగా ఎవరి అండదండలున్నాయనే చర్చ మొదలైంది. స్థానిక పొలిటీషియన్స్ సపోర్ట్ లేకుండా, పోలీసుల పహారాలో రాత్రికి రాత్రే పనులు ప్రారంభం చేసేందుకు సన్నద్ధం కావడం అంటే అంతా ఆషామాషి వ్యవహారం కాదంటున్నారు. స్థానికంగా, తాజానో, మాజీనో ఇథనాల్ కంపెనీ యాజమాన్యానికి భరోసా కల్పిస్తున్నారనే చర్చ ఇథనాల్ కంపెనీ బాధిత గ్రామాల్లో సాగుతోంది.
ఇక…అలంపూర్ నియోజకవర్గంలో ఈ అంశం బేస్ చేసుకోని కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల డిమాండ్ మేరకు ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయొచ్చు కదా అని ప్రశ్నిస్తోంది బిఆర్ఎస్. స్థానిక గ్రామాల ప్రజలకు ఇథనాల్ కంపెనీ రద్దు చేయిస్తాఅంటూ … మోసం చేసి యాజమాన్యానికి బాసటగా నిలిచింది కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమారే అంటూ బిఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కు ప్యాకేజ్ అంది ఉంటుందని, అందుకే రైతులు , గ్రామస్థులపై అరెస్టుల పర్వం సాగుతున్న పట్టనట్లే ఉంటున్నారని అంటోంది గులాబీ పార్టీ. దీనిపై కాంగ్రెస్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. పెద్ద ధన్వాడ ప్రాంతంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అనుమతులు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చాయంటోంది. అప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్లే శాసనసభ్యులుగా కొనసాగుతున్నారని…కంపెనీ ఏర్పాటుకు అప్పటి ఎమ్మెల్యే అబ్రహం హయాంలో బీజం పడిందంటున్నారు. కంపెనీ యాజమాన్యంతో అంటకాగేది, ప్రస్తుత ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డే అని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రైతులు, గ్రామస్థులకు సంపూర్ణ మద్దతుగా నిలవడంతో పాటు సంబంధిత మంత్రి శ్రీధర్ బాబు వద్దకు తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసింది తామే అంటోంది మాజీ ఎమ్మెల్యే సంపత్ శిబిరం.
మొత్తం మీదా తమ ప్రాంతాన్ని కలుషితం చేసే ఇథనాల్ కంపెనీ రద్దుకు పార్టీలకు అతీతంగా వెన్నంటి నిలవాలని, రద్దు చేసే వరకు సాగే తమ ఉద్యమానికి బాసటగా నిలవాలని బాధిత గ్రామాల ప్రజలు రాజకీయ పార్టీల నేతలను కోరుతున్నారు.
