NTV Telugu Site icon

Off The Record : ఏలూరు ఎంపీ సీటు పై పొలిటికల్ హీట్

Eluru Mp Seat Otr

Eluru Mp Seat Otr

ఆ లోక్‌సభ నియోజకవర్గంలో ఇద్దరూ కొత్త అభ్యర్థులే. రాజకీయ వారసత్వాలు తప్ప… ఎవ్వరికీ డైరెక్ట్‌గా ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. అయినా.. ఇప్పుడు పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని కొత్త కొత్త పాయింట్స్‌ బయటికి వస్తున్నాయి. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా స్టోరీ? ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలక్షన్ హీట్ సమ్మర్ సెగల్ని మరిపిస్తోంది. గతంలో ఎప్పుడూలేని విధంగా జరుగుతున్న పరిణమాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. నియోజకవర్గానికి కొత్త అభ్యర్ధులుగానే కాదు.. ఫస్ట్ టైమ్ పోటీచేస్తున్న యంగ్ స్టర్స్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్ అన్నది టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇక్కడ ఈసారి వైసీపీ తరపున మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ యాదవ్ బరిలో ఉన్నారు. పేరు ప్రకటించిన నాటి నుంచి పనిమొదలు పెట్టి నిత్యం జనంలో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారాయన. తన తండ్రి ఉమ్మడి పశ్చిమగోదావరి జెడ్పి చైర్మెన్ గా ఉన్న నాటి నుంచి ఏలూరుతో సత్సంబంధాలు ఉండటం సునీల్ కు కలిసొస్తోంది. దానికి తోడు ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వైసిపి ఎమ్మెల్యేల బలం అడ్వాంటేజ్ అవుతోంది. దీనికి తోడు కూటమి తరపున అభ్యర్ది ప్రకటన తమకు మరింత కలిసొస్తుందనే ధీమాతో కనిపిస్తోంది వైసిపి. టిడిపి తరపున ఉమ్మడి కడప జిల్లాకు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పేరును ప్రకటించడంతో ఆయన నాన్ లోకల్ అనే ఫీలింగ్‌ పెరుగుతోందట. దాన్ని అనుకూలంగా మార్చుకునే పనిలో వైసీపీ బిజీగా ఉన్నట్టు తెలిసింది. ఇక కూటమి విషయానికొస్తే టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న పుట్టా మహేష్ యాదవ్‌ వ్యాపారవేత్త. టీటీడీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కొడుకు ఆయన. నాన్‌ లోకల్‌ ఎఫెక్ట్‌ విషయమై టీడీపీ కేడర్‌లో కొంత ఆందోళన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే ఆ పార్టీ తరపున ఆర్ధికంగా బలమైన నేతలు ఇంకెవరు అందుబాటులో లేకపోవడం, ప్రత్యర్ధి పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్దిని బరిలో దించడంతో పుట్టా మహేష్‌కు లైన్ క్లియర్ అయ్యింది. యంపి అభ్యర్ధి ఆర్ధికంగా బలమైన వాడైతే చాలు… మిగతాది మేము చూసుకుంటామని చెప్పుకొచ్చిన టిడిపి నేతలు కొత్త అభ్యర్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారట. వైసిపి చేస్తున్న ప్రచారాలను తిప్పికొడుతూనే పోలవరం,కొల్లేరు,చింతలపూడి లిఫ్ట్ అంశాలను అస్త్రాలుగా మలచుకుంటున్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో టిడిపి అభ్యర్ధులు ఓడిపోవడం ఆ పార్టీకి ఇప్పటికీ మైనస్‌గానే ఉందట. దీనికి తోడు కడపకు చెందిన పుట్టా మహేష్‌ను దించడంతో… ఆయన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టాల్సి వస్తోందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఏలూరు పార్లమెంటులోపరిధిలో రెండు అసెంబ్లీ స్థానాల్లో జనసేన, ఒకచోట బిజేపి పోటీలో ఉన్నాయి. దీంతో ఒకచోట గ్లాసు, సైకిల్‌ మరోచోట కమలం సైకిల్‌ గుర్తులకు ఓటు వేయాలనే ప్రచారం అవసరమవుతోంది. ఇది కొంత గందరగోళానికి దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. వీటన్నిటిని సెట్ చేయడానికి సరిపోయేంత సమయం చేతిలో లేకపోవడంతో ఏలూరు పార్లమెంటులోటిడిపి ఎలా నెట్టుకొస్తుందోనన్న చర్చ జరుగుతోంది.ఏలూరు పార్లమెంటు సీటుకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న సమయంలో ఇద్దరు కొత్త అభ్యర్ధుల మధ్య జరుగుతున్న ఫైట్ లో ఎవరిది పైచేయి అవుతుందనేది సస్పెన్స్ గా మారింది. ఇద్దరూ కొత్త క్యాండిడేట్స్‌ కావడంతో రెండు పార్టీల సీనియర్స్‌కు ఇది సవాల్‌గా మారుతోందంటున్నారు పరిశీలకులు.