NTV Telugu Site icon

Off The Record : వైసీపీకి తలనొప్పిగా దువ్వాడ ఎపిసోడ్?

Otr Duvvada Srinu

Otr Duvvada Srinu

మడిసన్నాక కూతంత కళా పోసన ఉండాలి… అన్నది రావు గోపాలరావు డైలాగ్‌. ఆ కళా పోసన ఉండటం వరకు ఓకేగానీ… అది శృతి మించి వెర్రి తలలు వేస్తే…. మొదటికే మోసం రావడం ఖాయం. ఇప్పుడా రాజకీయ నాయకుడి పరిస్థితి కూడా అలాగే ఉందట. ఆయనగారి కళాపోసన శృతిమించి కాదు, అంతకు మించడంతో టోటల్‌ పొలిటికల్‌ కేరీరే డేంజర్‌లో పడిందట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటాయనగారి జిల్‌ జిల్‌ జిగా జిగా స్టోరీ? వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం ఇంకా సద్దుమణగలేదు. పెద్దలు రాజీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కుటుంబ గొడవ రాజకీయ వివాదంగా మారిన క్రమంలో పరిష్కరించేందుకు గతంలో వైసీపీ నాయకత్వం చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీకాగా ఆయన భార్య వాణి వైసీపీ జెడ్పీటీసీ. అందుకే పార్టీకి ఇప్పుడీ కుటుంబ కథా చిత్రమ సమస్యగా మారిందని అంటున్నారు. ఈ ఎపిసోడ్‌ పార్టీకి మైనస్‌ అన్న అభిప్రాయం పెరుగుతోందట అంతర్గతంగా. అలాగే… ఇంట్లో కూర్చుని సెటిల్‌ చేసుకోవాల్సిన గొడవను రచ్చకీడ్చి ఎమ్మెల్సీ దువ్వాడ చివరికి పార్టీని కూడా ఇరికించేశారన్న అసహనం కూడా వైసీపీ పెద్దల్లో పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో సమస్య వచ్చిన ప్రతిసారి దువ్వాడకు మద్దతుగా నిలిచింది పార్టీ. అలాంటిది ఇప్పుడీ వ్యవహారం కాస్త తేడా అయింది కావడంతో… పార్టీ మీద కూడా ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలంటూ మెదలైన రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. ఎమ్మెల్సీపై సొంత భార్య, బిడ్డలే పోరాటం చేయడం , న్యాయం చేయాలంటూ రోడ్డు ఎక్కడంతో పాటు , ఈ ఎపిసోడ్‌లో ఆయన సన్నిహితురాలు మాధురి వ్యవహారశైలి ఇంకా డ్యామేజ్‌ చేస్తోందన్న అభిప్రాయం పెరుగుతోందట వైసీపీ వర్గాల్లో.

కట్టుకున్న భార్యే తనను ఇంటి నుంచి తరమేసిందన్న మాటలతో ఎమ్మెల్సీ కొంత సానుభూతి కూడగట్టుకోగలుగుతున్నా… వేరే మహిళతో కలిసి ఉండటం, టూర్లు తిరిగామని కలిసే ఉంటామని చెప్పడం లాంటివి పార్టీని కూడా ఇరుకున పెడుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అందుకే దువ్వాడ తన భార్య బిడ్డలపై చేసిన కామెంట్స్ అన్నిటినీ వైసీపీ అధిష్ఠానం నిశితంగా గమనిస్తోందని అంటున్నారు. ఇది ఇక్కడితో ఆగకుండా… ఇలాగే కొన్నాళ్ళు కొనసాగితే మాత్రం అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. జగన్‌కు దగ్గరి మనిషిగా , జిల్లాలో కీలకమైన నేతగా ఎదిగారు దువ్వాడ శ్రీనివాస్. ఎవరైనా జగన్‌ను విమర్శిస్తే ముందు వెనకా చూడకుండా విరుచుకుపడే నాయకుడిని దూరం చేసుకోవడం ఇష్టం లేకున్నా… ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పేట్టు లేదన్నది వైసీపీ వర్గాల వాయిస్‌. భార్య వాణి తండ్రి, సొంత మామ సంపతిరావు రాఘవరావు రాజకీయ వారసత్వాన్ని రెండున్నర దశాబ్దాలుగా కొనసాగిస్తూ పవర్ పాలిట్రిక్స్ నడిపించిన దువ్వాడ శ్రీనివాస్ భవిష్యత్తు మాధురి చేసిన అడల్ట్రీ కామెంట్స్‌తో డైలమాలో పడిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిదైనా వాళ్ళ వ్యక్తిగతం. కానీ… అది పొలిటికల్‌ కలర్ పులుముకుని రచ్చ అయ్యాక అందరం డ్యామేజ్‌ అవుతున్నామని లోకల్‌ కేడర్‌లో ఆవేదన పెరుగుతోందట. ఆ ఎపిసోడ్‌కు వెంటనే ముగింపు పలక్కుంటే మాత్రం దువ్వాడ పొలిటికల్‌ కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడుతుందన్న వాదన బలపడుతోంది. పది రోజుల నుంచి రగులుతున్న వివాదంపై వైసీపీ అధినాయకత్వం సీరియస్‌గానే ఉన్నట్టు సమాచారం. దీంతో ఎండ్‌ కార్డ్‌ పడేది వివాదానికా? లేక దువ్వాడ పొలిటికల్‌ కెరీర్‌కా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.