ఇటుక అన్న మాట వినిపిస్తే చాలు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉలిక్కి పడుతున్నారట. కలలో ఇటుకలు కనిపించినా….భయంతో ఒళ్ళంతా తడిసిపోతోందట. ఇక అసలు ఇటుక బట్టీ అన్న మాట వింటే చాలు శివాలెత్తిపోతున్నట్టు సమాచారం. అసలేంటా ఇటుక పంచాయితీ? అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఇటుక ఫోబియా ఎందుకు పట్టుకుంది? నిజామాబాద్ జిల్లాలో ఓ కాంగ్రెస్ శాసనసభ్యుడికి ఇటుక బట్టీల ఎమ్మెల్యేగా పేరు పెట్టారట బీజేపీ లీడర్స్. ఇటుక బట్టీల ఎమ్మెల్యేకు స్వాగతం అంటూ.. ప్లెక్సీలు సైతం ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. వాటి చుట్టూనే ఇప్పుడు రాజకీయ రచ్చ, అధికార పార్టీలో చర్చ మొదలయ్యాయి. ఇటు ప్రజల్లో సైతం ఈ ఇటుకల గోలేంటన్న గుసగుసలు మొదలయ్యాయట. ప్లెక్సీల దెబ్బకు అటు కాంగ్రెస్ నేతలు శివాలెత్తిపోతున్నట్టు సమాచారం. మా ఎమ్మెల్యేను అంత మాట అంటారా అంటూ.. కాషాయ పార్టీ నేతలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారట. ఈ విషయంలో బీజేపీ లీడర్స్ కూడా ఎక్కడా తగ్గడం లేదంటున్నారు. ఉన్నదే అంటే ఉలుకెందుకంటూ… రివర్స్ అటాక్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా కొద్ది రోజులుగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఇటుక బట్టీలపై మాటల యుద్దం నడుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్థానిక ఇటుక బట్టీల యజమానుల నుంచి ట్యాక్స్ వసూలు చేశారన్నది బీజేపీ నాయకుల ఆరోపణ. అందులోని నిజానిజాలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఉద్యమకారునిగా ప్రజల్లో గుర్తింపు ఉంది. డాక్టర్‌గా పేరుంది. కానీ… ఇప్పుడీ వివాదంతో ఆయన ఇలా కూడా చేస్తారా అని మాట్లాడుకుంటున్నారట నియోజకవర్గంలో. జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయం ఏర్పాటు విషయంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పంచాయతీ మొదలైంది. రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ ప్రతిపాదిస్తే… మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాత్రం బోధన్ షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో పెట్టమని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే… కొద్ది రోజుల క్రితం ఎంపీ అర్వింద్….. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని టార్గెట్ చేస్తూ.. తీవ్ర స్దాయిలో విమర్శలు చేశారు. అది కాస్తా రెండు పార్టీల మధ్య దిష్టిబొమ్మల దహనాలదాకా వెళ్లింది. ఈ విషయంలో భూపతిరెడ్డి కూడా ఎంపీకి కౌంటర్ ఇస్తూ…. అభివృద్దిపై చర్చకు రావాలని సవాలు విసిరారు. ఆ సవాల్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ రియాక్ట్ అవుతూ… ఇటుక బట్టీల దగ్గర చర్చ పెడదాం రమ్మని అన్నారు. అనండతో సరిపెట్టకుండా రూరల్ నియోజకవర్గంలోని ప్రతి ఇటుక బట్టీ దగ్గర ప్లెక్సీలు పెట్టారు. ఇందూరు నియోజకవర్గ అభివృద్ది పై చర్చకు విచ్చేస్తున్న ఇటుక బట్టీల ఎమ్మెల్యేకు స్వాగతం అంటూ.. ప్లెక్సీలు పెట్టడంతో…. పొలిటికల్ బట్టీ అంటుకుంది. ఏంటా పేరు….? అసలేమనుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తుంటే….. దాని గురించి మాట్లాడుకుంటే… కథలు కథలుగా చాలా రోజులు చెప్పుకోవచ్చని అంటున్నారట కాషాయ నేతలు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇందులో సక్రమం కంటే అక్రమంగా నడిచేవే ఎక్కువ. ఈ అడ్డగోలుతనాన్ని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్యే అనుచరులు వసూళ్లకు తెరలేపారన్న ఆరోపణలు ఉమ్మాయి. ఈ పాయింట్‌నే బీజేపీ నాయకులు హైలైట్ చేస్తూ… వసూళ్ళ వెనక ఎమ్మెల్యే ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రచ్చ చేశాక బట్టీ ట్యాక్స్‌పై ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ మొదలైందట. వసూళ్ళ ఆరోపణల్లో నిజమెంత అంటూ…. నిఘా వర్గాలు సైతం సమాచారం సేరరించినట్టు తెలుస్తోంది. దీనిపై సర్కార్ పెద్దలకు నివేదిక చేరిందట. అదంతా ఒక ఎత్తయితే…. మంచో చెడో మా యాపారం మేం చేసుకుంటున్నాం. ఆ రాజకీయ రొచ్చులోకి మమ్మల్ని లాగొద్దని ఇటుక బట్టీల యజమానులు వేడుకోవడం ఇక్కడ కొసమెరుపు.