NTV Telugu Site icon

Off The Record : కార్మిక సంఘాలపై బొగ్గు కార్మికులు ఆగ్రహం

Coal Otr

Coal Otr

బొగ్గు కార్మికులు భగ్గుమంటున్నారు. నమ్మి మిమ్మల్ని పెత్తనం చేయమంటే… నట్టేట ముంచుతున్నారంటూ కార్మిక సంఘాల మీద రగిలిపోతున్నారు. అది ఇది అని లేదు. అన్ని సంఘాల విషయంలోనూ అదే సీరియస్‌నెస్‌, అంతే నిలదీత. ఐక్య పోరాటాలు చేయాల్సిన టైంలో… శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏంటా రాజకీయం అంటూ నిలదీస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో సింగరేణి కార్మికులు మండిపడుతున్నారు? తమ యూనియన్‌ నాయకుల్ని నిలదీస్తున్నారు? వాళ్ళలో అసహనం ఎందుకు పెరుగుతోంది? సింగరేణి బొగ్గు బ్లాక్‌లను వేలం వేయాలని డిసైడ్ అయింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని నిరసిస్తున్నామని కార్మిక సంఘాలు చెబుతున్నా… ఉమ్మడి పోరాట కార్యాచరణ మాత్రం కనిపించటడం లేదు. దేశం మొత్తం సంగతి ఎలా ఉన్నా… సింగరేణి పరిధిలోని బ్లాక్స్‌ని మాత్రం సంస్థకే కేటాయించాలన్న డిమాండ్‌ ఉంది. కానీ… కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా… ప్రక్రియను వేగవంతం చేసిందట. దీంతో ఐక్య పోరాటాలు చేయాల్సిన కార్మిక సంఘాలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. తెలంగాణ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉంది ఏఐటీయూసీ. దాంతోపాటు వివిధ పార్టీల అనుబంధ సంఘాలున్నాయి. ప్రాంతీయ, జాతీయ పార్టీలకు అనుబంధ సంఘాలన్నీ యాక్టివ్‌గానే ఉన్నాయి. కానీ… వేలానికి నిరసనగా వత్తిడి పెంచే ప్రయత్నం చేయడం లేదన్న అసహనం ఉందట సంస్థ కార్మికుల్లో. ఉమ్మడి ఆందోళనకు గుర్తింపు సంఘం ఏఐటియూసి పిలుపునిచ్చినా… ఎవ్వరూ కలిసిరాలేదన్న మాట వినిపిస్తోంది కార్మిక వర్గాల్లో. వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఒంటరి పోరాటం చేసి వదిలేసినట్టు చెబుతున్నారు. ఇక సీఐటియూ తమ పార్టీ సీపీఎం తో కలిసి బస్సు యాత్ర నిర్వహించింది. బీఆర్‌ఎస్‌ సంఘం టీబీజీకేఎస్ ఆమధ్య కొన్నాళ్ళు ధర్నాలు చేసింది వదిలేసింది.

ఇలా… ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప సంస్థ ప్రయోజానలు కోసం ఉమ్మడిగా చేసిందేంలేదన్న అసహనం కార్మికుల్లో పెరుగుతోందంటున్నారు. ఇలా చేస్తే… కేంద్రం దిగి వస్తుందా? బొగ్గు బ్లాక్‌ల వేలం ఆగుతుందా అని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెలో భాగంగా…40 రోజులలకు పైగా బంద్‌ అయ్యాయి బొగ్గు బావులు. ఆ తరహా ఉమ్మడి పోరాటాన్ని ఇప్పుడు చేయకుంటే… సంస్థ ఉనికే ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన కార్మిక వర్గాల్లో పెరుగుతోందట. అదే సమయంలో యూనియన్స్‌ మధ్య ఉన్న అంతర్గత రాజకీయాలు కూడా తెరమీదికి వస్తున్నట్టు తెలిసింది. సంస్థ ప్రైవేటీకరణకు ఓ యూనియన్ జై కొట్టిందంటూ… మరో యూనియన్ కార్మికుల్లో చర్చ పెట్టినట్టు ప్రచారం ఉంది. దీంతో యూనియన్‌ ఏదైనా సరే… తమ ప్రాబల్యం చాటుకోవడానికి, నేతలు పబ్బం గడుపుకోవడానికి తప్ప కార్మిక శ్రేయస్సును పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది సంస్థలో.
కేవలం కార్మిక సంక్షేమం కోసమే పుట్టిన సంఘాలు విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సైతం…సింగరేణి బ్లాక్స్‌ వేలం వద్దు…ఈ ఏరియాలోని బ్లాక్స్‌ని సంస్థకే కేటాయించాలని పట్టుబడుతోంది. ఈ పరిస్థితుల్లో ముందుండి నడిపిస్తూ…. తమ కోసం పోరాడే నాయకుడు లేదా సంఘం కోసం ఎదురు చూస్తున్నారట సింగరేణి కార్మికులు. మరి ఇప్పుడున్న సంఘాలు యాక్టివ్‌ పార్ట్‌ తీసుకుంటాయా లేక కార్మిక ప్రయోజనాలను గాలికి వదిలేస్తాయా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.