అక్కడ కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ పట్టుకుందట. టిక్కెట్ దక్కని వారి మద్దతు ఉంటుందా లేక మేడిపండు మాదిరిగా అవుతుందా అని నిద్రాహారాలు మానేసి ఆందోళన పడుతున్నారట. పైకి సరేనంటున్నా… ఎక్కడ ఏ రూపంలో జర్క్ ఇస్తారోనంటూ గూఢచారులను కూడా పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడుందా వాతావరణం? అభ్యర్థులకు అంత భయం ఎందుకు? ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి అభ్యర్ధుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంటుందట. సీటు సాధించిన ఆనందం కంటే రాకుండా పోయిన వారి అలకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయట. తిరుపతి, మదనపల్లె, శ్రీకాళహస్తి,చిత్తూరు, సత్యవేడులో ఇలాంటి వాతావరణం ఉన్నట్టు తెలిసింది. అలక మీదున్న ఆశావహులు పైకి సెట్ అయినట్టు కనిపిస్తున్నా… లోలోపల ఏం గోతులు తీస్తున్నారోనన్న టెన్షన్ అభ్యర్థుల్ని వెంటాడుతోంది. తిరుపతి జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆరణి శ్రీనివాసులు. అయితే ఆయన రాకను స్థానిక టిడిపి, జనసేన కేడర్ వ్యతిరేకించింది. తనకు టికెట్ దక్కకపోవడంపై మీడియా ముందే కంటతడి పెట్టుకున్నారు టీడీపీ నేత సుగుణమ్మ. ఆమెతో పాటు టిడిపి నుంచి ఐదారుగురు, జనసేన నుంచి ఇద్దరు తిరుపతి టికెట్ ఆశించారు. వాళ్ళెవరికీ కాకుండా…చిత్తూరుకు చెందిన ఆరణి శ్రీనివాసులుకు టికెట్ దక్కింది. దీంతో వారం పాటు రచ్చ రచ్చ చేశారు ఆశావహులు. తరువాత అధిష్ఠానం అదేశాలతో టీడీపీ నేతలంతా వెనక్కి తగ్గారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి శ్రీనివాసులు గెలుపునకు కృషి చేస్తామని ప్రకటించారు. ఇక జనసేన నేత హరిప్రసాద్ ఇప్పటికే మద్దతు పలికారు…ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాత్రమే ఇంకా అలక పాన్పు మీద ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ వారంలో సెట్ అవుతాయని తప్పనిసరిగా వారి నుంచి సహకారం లభిస్తుందని ఆశావహంగా చెబుతున్నారు ఆరణి.
ఇక మదనపల్లెలో కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన షాజహాన్ కు టికెట్ ఇవ్వడంతో టిడిపినేత దొమ్మాలపాటి రమేష్, జనసేన నేత రాందాస్ చౌదరి నిరాశపడ్డారు. రెండు రోజులు
మౌనంగా ఉన్న ఇద్దరూ రెబల్స్‌గా బరిలో దిగడానికి సై అంటున్నారట. మిగిలిన నేతలు పార్టీ అదేశాలతో కలసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎవరు ఎప్పుడు ఎలా మారతారోనని తెగ టెన్షన్ పడుతున్నారట షాజహాన్. ఇక సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు సీటు ఇవ్వకూదని ధర్నాలు చేసిన వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇదే పరిస్థితి కాళహస్తి, చిత్తూరులో కూడా ఉంది. సర్లే కానీయండి అంటూ ఊ కొట్టారు మూడు పార్టీలకు చెందిన నియోజకవర్గాల ముఖ్యలు. కానీ… ఆ ఊకొట్టడమే అభ్యర్థుల్ని కంగారు పెడుతోందట. సరేనన్న మాట మనస్ఫూర్తిగా అంటున్నారా? లేక కనిపించకుండా సీటు కింద ఎర్త్ పెడుతున్నారా అన్న డౌట్స్ పెరుగుతున్నాయి. ఎవర్ని కదిలించినా… ఏమో.. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అంటున్నారు తప్ప అవును వాళ్ళ మీద నమ్మకం కుదిరిందన్న మాట మాత్రం రావడం లేదంటున్నారు. అసంతృప్త నేతలు ఆయా అభ్యర్ధులతో కలసి ప్రచారానికి,సభలు,సమావేశాలకు వస్తున్నా, తమ వర్గం అండగా ఉంటుందని చెబుతున్నా అభ్యర్దుల్లో మాత్రం ఎక్కడో ఏదో తేడా కొడుతోందట. దానికి తోడు అభ్యర్ధుల అనుచరులు కూడా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు వార్తలు మోసుకొస్తుండటంతో మరిన్ని డౌట్స్ పెరుగుతున్నట్టు తెలిసింది. దీంతో ఇక లాభం లేదనకుని ఆయా నేతలు అసంతృప్తుల మీద నిఘా పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయి? నిజంగా పార్టీ చెప్పినట్లు పనిచేస్తున్నారా? లేక ప్రత్యర్థులకు లీక్‌లు ఇస్తున్నారా అంటూ ఎప్పటికప్పుడు తమ మనుషుల ద్వారా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితి ముఖ్యంగా తిరుపతి, మదనపల్లె , సత్యవేడులో ఎక్కవగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. తమ మనుషులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ద్వారా ఆయా నేతలకు ఇచ్చే ప్రాధాన్యతలో మార్పులు చేసుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో అసంతృప్త నేతల సమావేశం ఉందంటే చాలు… షేకవుతున్నారట ఆయా అభ్యర్ధులు. ఎప్పుడెలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని టెన్షన్ పడుతున్నారట. చేయాల్సిన ఎన్నికల ప్రచారం కంటే వీళ్ళ పంచాయతీనే ఎక్కువైందంటూ పలుపురు అభ్యర్ధులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.ఇలా పైకి సైలెంట్ గా ఉండి మద్దతు తెలిసిన నేతల వ్యవహారం చివరకు మేడిమండు సామెతలా మారకుండా చూసుకోవడానికి ప్రత్యేక ఆఫర్స్ కూడా సిద్ధమవుతున్నాయట. మరి కదాకా వెంట ఉండి గెలుపు తీరాలకు చేరుస్తారా లేక మధ్యలోనే హ్యాండిచ్చేస్తారా అన్నది చూడాలి.
