NTV Telugu Site icon

Off The Record : వైసీపీకి వరంగా మారిన చంద్రబాబు వ్యాఖ్యలు

Otr Over Chandrababu

Otr Over Chandrababu

తుపాకీ తూటా….మనిషి మాట….ఒక్కసారి బయటకు వచ్చాయంటే చెయ్యాల్సిన నష్టం చేసేస్తాయి. రాజకీయాల్లోనైతే ఒక్కోసారి ఆ మాట చేసే నష్టం ఊహకు అందదు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ ఓ మాట తూటాలా పేలింది. ఒకరికి అది బౌన్సర్ గా మారితే…మరొకరికి బౌన్స్ బ్యాక్ గా ఫుల్ పబ్లిసిటీ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఇది ఎన్నికల సమయం. మాటే తూటా. ఒక్కోసారి ఆ మాటల తూటా రివర్స్ అయి మనకే తగులుతుంది. ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలానే తయారైందన్న చర్చ జరుగుతోంది. శింగనమల నియోజకవర్గం అభ్యర్థి విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇలానే బౌన్సర్ లా మారాయి. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల క్రితం చంద్రబాబు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రానికి వచ్చారు. అక్కడ జరిగిన సభలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులును ఉద్దేశించి ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఈ మాట ఏ ఉద్దేశంతో చేశారో సరిగ్గా చెప్పలేకపోయారు. కానీ ప్రస్తుతం ఇదే వైసీపీ అభ్యర్థి పాలిట వరంగా మారింది.

ఎందుకంటే శింగనమల నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఆరు మండలాల నాయకులు ఏకమయ్యారు. ఆయన అనుచరుడైన వీరాంజనేయులుకు టికెట్ ఇవ్వకూడదు అంటూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సీఎం జగన్ దగ్గరకు వెళ్లాలని భావించారు. ఇటు వైసీపీ అధిష్టానం కూడా ఈ అభ్యర్థి విషయంలో డిఫెన్స్ లో పడిపోయిందన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి సమయంలో చంద్రబాబు చేసిన కామెంట్లు వైసీపీకి ఆయుధంలా దమారాయన్న మాటలు వినిపిస్తున్నాయి.

శింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి కొన్ని కాస్ట్ ఈక్వేషన్స్….అలాగే స్థానిక వ్యతిరేకత కారణంగా టికెట్ నిరాకరించారు. ఆ స్థానంలో ఒక సామాన్య కుటుంబానికి చెందిన వీరాంజనేయులుకు టికెట్ ఇచ్చారు. ఆయన సాంబశివారెడ్డికి అత్యంత అనుకూలమైన వ్యక్తి. దీనినే వైసిపి నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టారు. అసలు కనీసం ఒక గ్రామస్థాయి నాయకుడు కూడా కానీ వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారంటూ వైసీపీ నాయకులు ప్రశ్నించారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చంద్రబాబు ప్రజాగళం సభ పేరుతో జిల్లాకు వచ్చారు. ఎస్సీ రిజర్వుగా ఉన్న శింగనమలలో సాంబశివారెడ్డి గతంలో తన భార్యకు టికెట్ ఇప్పించారని…ఈసారి తన భార్యను కాకుండా తన దగ్గర పనిచేసే ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇప్పించారని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సహజంగానే బూమరాంగ్ గా మారాయి.

ఇదే అంశంపై మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుది ఒక పెత్తందారి మనస్తత్వంతో ఉంటే.. తాను ఒక పేద కుటుంబానికి చెందిన వీరాంజనేయులుకు టికెట్ ఇచ్చానని.. ఆయన నీకన్నా ఎక్కువ చదువుకున్నారని… కానీ నీ పాలన కారణంగా ఉద్యోగం రాక ఒక డ్రైవర్ గా మారిపోయారన్నారు. ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇవ్వకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఒక పేద కుటుంబానికి చెందిన విద్యావంతుడు వీరాంజనేయులును….తాను అసెంబ్లీకి పంపించాలని టికెట్ ఇచ్చానని జగన్ గర్వంగా చెప్పుకున్నారు. అదే సందర్భంలో ఒక టిప్పర్ డ్రైవర్ అంటే ఇంత చులకనా.. అంటూ ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి. వాస్తవంగా నిన్నటి వరకు వీరాంజనేయులు ఎవరన్నది శింగనమల నియోజకవర్గంలో చాలా మందికి తెలియదు. కేవలం జగన్ టికెట్ ప్రకటించిన తర్వాత మాత్రమే ఆయన పేరు వినపడింది. కానీ ఆయనకు పెద్దగా పబ్లిసిటీ కూడా రావడం లేదు. చంద్రబాబు ఒక్కసారిగా వీరాంజనేయులు పేరు ప్రస్తావిస్తూ టిప్పర్ డ్రైవర్ అని చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి రాష్ట్రంలోని పెద్ద సంచలనంగా మారాయి. ఒక డ్రైవర్ కు టికెట్ ఇవ్వకూడదా అన్న అంశం మీద సోషల్ మీడియాలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వీరాంజనేయులు నెత్తిపై పాలు పోసినట్టయ్యింది. వీరాంజనేయులకు ఫ్రీగా పబ్లిసిటీ రావడమే కాకుండా ఒక ఫేమస్ పర్సనాలిటీగా మారిపోయారు. అందరూ సానుభూతి చూపిస్తున్నారు. ఇటు వైసీపీలో అసమ్మతి వర్గం కూడా దీనిపై ఏమీ మాట్లాడలేని పరిస్థితికి వచ్చేసింది. మొత్తం మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇలా మిస్ ఫైరయి…వైసిపి అభ్యర్థికి ప్లస్ గా మారిందన్న చర్చ జరుగుతోంది.