NTV Telugu Site icon

Off The Record : బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి లోకల్ పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పేస్తారు?

Buggana

Buggana

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మనసు మారుతోందా? ఆయన పొలిటికల్‌ పిచ్‌ మార్చాలనుకుంటున్నారా? ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారా? లోకల్‌ పాలిటిక్స్‌ని బోర్‌గా ఫీలవుతున్నారా? ఇంతకీ ఎక్కడి వెళ్లాలనుకుంటున్నారు బుగ్గన? అక్కడేం చేయాలనుకుంటున్నారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ కేబినెట్‌లో అత్యంత కీలకంగా వ్యవహరించారు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. నాటి ఆర్థిక మంత్రిగా అష్టకష్టాలు పడి బండి లాగించేవారని చెబుతారు ఆయన సన్నిహితులు. అలాగే అసెంబ్లీలో పిట్ట కథలతో లింక్‌పెట్టి ఆయన మాట్లాడే తీరు కూడా ఆకట్టుకుంటుందని అంటారు. అలాంటి నాయకుడు ఇప్పుడు లోకల్‌ పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారట. ఎన్నాళ్ళని ఈ అసెంబ్లీ నియోజకవర్గం లెవల్‌ రాజకీయాలు చేస్తాం… కాస్త పొలిటికల్‌ పిచ్‌ మారుద్దామని అనుకుంటున్నట్టు సమాచారం. సొంత నియోజకవర్గం డోన్‌కు దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ మాజీ మంత్రి కుమారుడు బుగ్గన అర్జున్‌రెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. తండ్రి లోకల్‌గా ఆసక్తి చూపకపోవడం, కొడుకు యాక్టివ్‌ అవడంతో… డోన్‌లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద కూడా రాజేంద్రనాథ్‌రెడ్డి సరిగా స్పందించకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు. ఇక మీదట డోన్‌ నుంచి పోటీ చేసే ఆలోచన బుగ్గనకు లేదని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. అందుకే వ్యూహాత్మకంగా కొడుకుని యాక్టివ్‌గా తిప్పుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అర్జున్‌రెడ్డి గతంలో ఎప్పుడూ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా కనిపించలేదు. కానీ… గత ఎన్నికల్లో ప్రచారం నుంచే డైరెక్ట్‌గా కనిపిస్తున్నారాయన. కానీ… ఫలితాల తర్వాత చాలా రోజులు ఎక్కడా కనిపించలేదు. కొద్ది నెలల నుంచి యాక్టివ్‌ అయ్యారాయన.

ఓవైపు తండ్రి తప్పుకుంటానని చెప్పడం, కొడుకు యాక్టివ్‌ అవడంతో… ఇక డోన్‌ వైసీపీ లీడర్‌ బుగ్గన అర్జున్‌రెడ్డేనని మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గంలో. ఇక అదే సమయంలో రాజేంద్రనాథ్‌రెడ్డి ఏం చేస్తారయ్యా అంటే…. ఆయనేం పడక కుర్చీ, మర చెంబుకు పరిమితం అవ్వాలనుకోవడం లేదు, ఫ్యూచర్‌ ప్లానింగ్‌ పెద్దగానే ఉందని అంటున్నారు సన్నిహితులు. వచ్చే ఎన్నికల నాటికి డోన్‌లో కొడుకుని పూర్తిస్థాయి లీడర్‌గా నిలబెట్టి… తాను పార్లమెంట్‌కు వెళ్లాలనుకుంటునన్నారట. ఇన్నేళ్ళు వైసీపీ తరపున ఢిల్లీలో కీలక వ్యవహారాలు నడిపిన విజయసాయి రెడ్డి ఇప్పుడు సైడైపోయారు. ఆ వెలితి ఉందన్న చర్చ మొదలైందట పార్టీలో. అందుకే ఆ గ్యాపేదో మనమే ఫిల్‌ చేస్తే పోలా అన్నది బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు జగన్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు బుగ్గన. అందుకే అట్నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలుండవని అనుకుంటున్నట్టు సమాచారం. గతంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా ఉన్నపుడు…. తరచూ ఢిల్లీ వెళ్ళి రావడం, కేంద్ర పెద్దలతో సంప్రదింపుల కారణంగా… అక్కడ మంచి సంబంధాలు ఏర్పడ్డాయట ఆయనకు. ప్రత్యేకించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారాయన. ఈ పరిస్థితుల్లో తాను ఢిల్లీలో యాక్టివ్‌ అయిపోయి విజయసాయిరెడ్డి లేని లోటును భర్తీ చేయాలనుకుంటున్నారట మాజీ మంత్రి.