Site icon NTV Telugu

Off The Record : కోమటిరెడ్డి బ్రదర్స్ని లాక్ చేశారా?

Otr Komatireddy Brother

Otr Komatireddy Brother

ఎట్నుంచి ఎవరు ఎలా నరుక్కొస్తారో తెలియదు. ఎవరు కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారో అర్ధం కాదు. పైకి మాత్రం అంతా మేకప్‌ నవ్వులు నవ్వుతున్నారు. నోటితో మాట్లాడుకుంటూ… నొసటితో వెక్కిరించుకుంటున్న పరిస్థితి ఉందక్కడ. సీనియర్‌ లీడర్స్‌ తీరుతో కేడర్‌ పరిస్థితి అడకత్తెరలో ఉన్నట్టుగా మారిందట. ఏ నియోజకవర్గంలో ఉందా గందరగోళ పరిస్థితి? అందుకు దారితీసిన కారణాలేంటి? సుదీర్ఘ కసరత్తు తర్వాత భువనగిరి ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసింది కాంగ్రెస్‌ పార్టీ. మొదటి జాబితాలోనే ఈ నియోజకవర్గం పేరు ఉంటుందని అనుకున్నప్పటికీ… సీనియర్స్‌ జోక్యం, రకరకాల ఈక్వేషన్స్‌తో సాధ్యపడలేదట. దీంతో తీవ్ర ఉత్కంఠ, భారీ కసరత్తు తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఖరారు చేస్తూ… సస్పెన్స్ కు తెరదించింది పార్టీ అధిష్టానం. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రతిపాదనలు, విజ్జప్తులను కాదని… సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఖరారు చేయడం జిల్లా నేతల్లో హాట్ టాపిక్ అయింది. అటు కోమటిరెడ్డి వర్గంలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం భువనగిరి ఎంపీ స్దానం కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీటు కాగా… ఇక్కడి నుంచి మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. అంతకు ముందు 2009-14 మధ్య ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎంపీగా ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై గట్టిపట్టుందన్నది రాజకీయ పరిశీలకుల మాట. ఆ కారణంతోనే ఎంపీ అభ్యర్థి విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ విడివిడిగా తమ అనుయాయుల్ని తెరపైకి తీసుకువచ్చి టిక్కెట్‌ ట్రయల్స్ వేశారు. ఓ అడుగుముందుకేసిన రాజగోపాల్ రెడ్డి బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపితే బాగుంటుందని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే తమలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నా… చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉమ్మడిగా గట్టిగానే వ్యతిరేకించారన్నది కాంగ్రెస్ పార్టీలో ఓపెన్ టాక్‌.

వాళ్ళు వ్యతిరేకించిన వ్యక్తే… చివరికి అభ్యర్థి అవడంతో… ఇప్పుడు బ్రదర్స్ వైఖరి ఎలా ఉండబోతోందన్నది తాజా చర్చ. ఆయనకు ఈ ఎన్నికల్లో సీనియర్ నేతలు ఇద్దరూ మనస్ఫూర్తిగా సహకరిస్తారా లేదా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. ఈక్రమంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్ఛార్జ్‌ బాధ్యతల నుండి మార్చి… సికింద్రాబాద్‌ను అప్పగించడం, అన్ని నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జ్‌లుగా పెడితే… భువనగిరికి మాత్రం ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డిని నియమించడం ఆసక్తిగా మారింది. ఈ మార్పు చేర్పులనము జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మేటర్‌ చాలానే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికే ఎన్నికల ఇన్ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారంటేనే వెనకున్న వ్యూహాన్ని అర్ధం చేసుకోవచ్చన్నది కాంగ్రెస్‌ వర్గాల మాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ల పంపిణీ వ్యవహారంలో పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్.. ఎంపీ అభ్యర్ది విషయంలో పరిస్థితులు భిన్నంగా ఉండటాన్ని జీర్ణించుకొలేకపోతున్నారట. అలాంటి వాళ్ళకే ఇప్పుడు అభ్యర్థిని గెలిపించే బాధ్యత ఇవ్వడమంటే ఒక విధంగా లాక్‌ చేయడమేనన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. పరిణామాలను గమనిస్తున్న కాంగ్రెస్ క్యాడర్ … వీళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఇప్పుడు కూడా కలిసి పని చేస్తారా? లేక కాంగ్రెస్‌ డీఎన్‌ఏలో ఉన్న గ్రూప్‌ రాజకీయానికి తెర లేపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

 

Exit mobile version