Site icon NTV Telugu

Off The Record : టీడీపీ ఫ్లేవర్ ఉంటేనే ఏపీ బీజేపీలో పదవులు..?

Ap Bjp Otr

Ap Bjp Otr

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో సన్నివేశాలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయా? కొద్దో గొప్పో పసుపు ఫ్లేవర్‌ తగిలితేనే కాషాయ దళంలో పదవులు దక్కుతున్నాయా? పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నామంటూ జబ్బలు చరుచుకునేవారికి చివరికి మిగిలేదా వాపులు, కాపడాలేనా? ఏపీ కమలంలో ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే వాళ్ళ సంఖ్య పెరుగుతోందా? పార్టీలో అసలేం జరుగుతోంది? నాయకులు ఏమని మాట్లాడుకుంటున్నారు? కేవలం కాషాయం ఒక్కటే ఉంటే సరిపోదు…. అదనంగా కాస్త పసుపు కలర్‌ని జోడిస్తేనే పదవులు అంటూ ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో మాట్లాడుకుంటున్నారట. పై స్థాయిలో ఉన్న నాలుగైదు పోస్టుల్ని వదిలేస్తే… మిగతా వ్యవహారమంతా అలాగే నడుస్తోందన్న అసహనం లీడర్స్‌లో పెరుగుతోందంటున్నారు. ఇచ్చే పదవులే అంతంత మాత్రం….. అందులోనూ…. తెలుగుదేశం బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే దక్కుతున్నాయన్నది రాష్ట్ర బీజేపీలో లేటెస్ట్‌ వాయిస్‌ అట. అదీ కూడా అక్కడా ఇక్కడా కాదు… ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే డిస్కషన్‌ జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎవరెవరికో పదవులు దక్కుతున్నాయి. కానీ… దశాబ్దాల తరబడి అంటిపెట్టుకుని ఉన్న మా సంగతేంటి అంటూ…. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కొందరు నేతలు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న నామినేటెడ్‌ పదవుల్లో మనకు దక్కేదే తక్కువ. వాటిని కూడా టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకులకో, వాళ్ళ అనుచరులకో ఇస్తున్నారంటూ లోలోపల మధనపడుతున్నట్టు తెలుస్తోంది.

పైకి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయకున్నా…. ఆంతరంగికుల దగ్గర ఆవేదన పడుతున్నవాళ్ళే ఎక్కువట. 20 సూత్రాల ఆర్థిక పథకం చైర్మన్ లంకా దినకర్ నుంచి ఇటీవల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పదవుల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులకు ఇవ్వడం దాకా…మొత్తం అదే పంథాలో నడుస్తోందంటున్నారు. వాళ్ళందరికీ టీడీపీ బ్యాక్ గ్రౌండ్ ఉండటం ఒక క్వాలిఫికేషన్‌ అన్న చర్చ జరుగుతోందట‌‌ పార్టీలో. దీంతో మేం కూడా ఒకసారి అలా వలస వెళ్ళి వస్తే మాకూ పదవులు వస్తాయి కదా అని ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోందట పార్టీలో. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టిక్కెట్‌ వదులుకున్న అడ్డూరి శ్రీరామ్ కనకదుర్గ గుడి ఛైర్మన్‌ పదవి అడిగారని, కానీ అక్కడ టిడిపి బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాయకుడినే ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఈక్వేషన్స్‌ తెర మీదికి రావడంతో… ఇప్పుడు ఏపీ బీజేపీకి నామినేటెడ్‌ పదవుల వ్యవహారం తలనొప్పిగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తమకు అసెంబ్లీలో సంఖ్యా బలం తగ్గడమే ఈ పదవుల పందేరంలో వెనకబడటానికి కారణమన్న చర్చ కూడా జరుగుతోందట పార్టీలో. సీట్ల కేటాయింపు సమయంలోనే… గట్టిగా పట్టుబట్టి మరిన్ని సాధించుకుని ఉంటే… ఇప్పుడీ సమస్య తప్పేదని కూడా అంటున్నారట కొందరు ఏపీ కాషాయ లీడర్స్‌. క్షేత్రస్ధాయిలో నిలబడాలంటే కేడర్‌కు కొన్ని పదవులైనా ఇప్పించుకోగలగాలని, ఇప్పుడా పరిస్థితి మాత్రం రాష్ట్ర పార్టీలో కనిపించడం లేదని మాట్లాడుకుంటున్నారట ఎక్కువ మంది. రాబోయే నామినేటెడ్‌ పదవుల పంపకాల్లో ఈ ఈక్వేషన్స్‌, కేలిక్యులేషన్స్‌ని కాషాయ నేతలు ఎంత వరకు బలంగా వినిపిస్తారో, ఎలా పదవులు సంపాదిస్తారో చూడాలి.

Exit mobile version