NTV Telugu Site icon

Off The Record : ఏపీలో బీజేపీకి అభ్యర్థులు దొరకడం లేదా..?

Ap Bjp Otr

Ap Bjp Otr

ఏపీ బీజేపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదా? ఎంపీ సీట్ల విషయంలో ఫర్వాలేదనుకున్నా… అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం కాగడాలు పట్టుకు తిరుగుతున్నారా? అసలు ఎంపిక కసరత్తు ఏ దశలో ఉందో ఆ పార్టీ నేతలకు కూడా తెలియకపోవడానికి కారణాలేంటి? కేవలం ఆరు లోక్ సభ, పది అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల ఎంపిక కోసం ఇంత జాప్యం దేనికి? ఏపీ పొత్తులో భాగంగా ఆరు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమైంది బీజేపీ. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి లోక్‌సభ సీట్లలో ఆ పార్టీ యుద్ధానికి సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. అలాగే శ్రీకాకుళం, పాడేరు, విశాఖ నార్త్, కాకినాడ సిటీ, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ఆదోని, ధర్మవరం అసెంబ్లీ సెగ్మెంట్లల్లో బీజేపీ అభ్యర్థులు రంగంలోకి దిగుతారని చెప్పుకుంటున్నారు. అంత వరకు ఓకే అనుకున్నా… అక్కడ అభ్యర్థులు ఎవరన్నదే ఇప్పుడు అసలు సమస్య. అదే సమయంలో ఫైనల్‌గా రెండు మూడు నియోజకవర్గాలు కూడా అటు ఇటయ్యే అవకాశం ఉందన్న ప్రచారంతో మొత్తం గందరగోళంగా ఉందట ఏపీ బీజేపీ వ్యవహారం.

 

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న పార్లమెంట్ స్థానాలు కాకుండా.. రాజంపేట, హిందూపురం వంటి సీట్లను బీజేపీ కోరుకుంటున్నట్టు సమాచారం. ఆ రెండు స్థానాలు తమ పార్టీకి దక్కితే.. ప్రచారంలో ఉన్న రెండిటిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారట కాషాయ నేతలు. అలాగే నరసాపురానికి బదులు ఏలూరు టిక్కెట్ కోరుకుంటున్నారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి కొత్తపల్లి గీత, విజయనగరానికి మాధవ్ లేదా కాశీరాజు, అనకాపల్లికి సీఎం రమేష్, రాజమండ్రికి పురందేశ్వరి లేదా సోము వీర్రాజు, తిరుపతి అభ్యర్థిగా సత్యప్రభ పేర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వచ్చి.. బీజేపీ కోరుకున్నట్టు రాజంపేట, హిందూపురం టిక్కెట్లు దక్కితే.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కానీ రాయలసీమలో తిరుపతి మినహా మిగిలిన చోట్ల బీజేపీకి పార్లమెంట్‌ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా లేనట్టు సమాచారం. రాజంపేట, హిందూపురం వంటి సెగ్మెంట్లల్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు.

వాటిని బీజేపీకి ఇస్తే… మైనార్టీల ఓట్లు పడవనే ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. ఇక కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలోనూ సర్దుబాట్లు తప్పవనే చర్చ జరుగుతోంది. టీడీపీ ఇప్పటికే ప్రకటించిన పి.గన్నవరం, అనపర్తి స్థానాలపై డైలమా కొనసాగుతోంది. ఈ సెగ్మెంట్లలో మహాసేన రాజేష్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్లను ప్రకటించింది టీడీపీ. అయితే పలు వివాదాల కారణంగా స్వయంగా తానే తప్పుకోవడానికి సిద్దపడ్డారు రాజేష్‌. దీంతో ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించి అక్కడ నుంచి అయ్యాజీ వేమాకు టిక్కెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక అనపర్తి సెగ్మెంట్ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుందనే ప్రచారం ఉంది. అయితే ఈ రెండిటిలో ఏదోకటి మాత్రమే బీజేపీకి వెళ్తుందని.. అలా కాకుండా.. రెండూ వెళ్తే మాత్రం.. కాకినాడ సిటీ తమ ఖాతాలోకి వస్తుందని అంటున్నారు టీడీపీ నేతలు. కానీ.. అనపర్తిలో పోటీకి పూర్తి విముఖత ప్రదర్శిస్తోంది బీజేపీ. దీంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ-బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరుగుతుందనే ఆసక్తి పెరుగుతోంది. ఇక బీజేపీకి కేటాయించిన మిగిలిన స్థానాల్లో కూడా విశాఖ నార్త్, ధర్మవరం, జమ్మలమడుగు లాంటి చోట్ల మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డిలు పోటీకి సిద్దంగా ఉన్నారు. ఇక కైకలూరు సెగ్మెంట్ నుంచి కామినేని శ్రీనివాస్ పేరు వినిపిస్తున్నా.. ఆయనకు వయస్సు అడ్డంకిగా మారవచ్చంటున్నారు. దీంతో ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్న తపనా చౌదరిని కైకలూరు నుంచి రంగంలోకి దింపాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే అందుకాయన ఎంతవరకు సుముఖంగా ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోందట. బీజేపీకి కేటాయించిన మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసుకునే విషయంలో ఆ పార్టీ అధినాయకత్వం ఇంకా ఓ స్పష్టతకు రాలేకపోతున్నట్టు సమాచారం. గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని భావిస్తున్న కూటమి పార్టీలకు బీజేపీ విషయంలో అది అతి కష్టసాధ్యమైన అంశంగా మారిందట. దీంతో ఏపీ కమలం సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఎంపిక ఎప్పటికి కొలిక్కి వస్తుందనే నిరాశా నిస్పృహ కూటమి పార్టీల్లో కన్పిస్తోందంటున్నారు పరిశీలకులు.

Show comments