NTV Telugu Site icon

Off The Record : ఏపీ బీజేపీలో కొత్త వివాదం.. గ్రూపులుగా విడిపోయిన బీజేపీ నేతలు

Ap Bjp

Ap Bjp

ఏపీ బీజేపీ నేతలు వర్గాలుగా విడిపోయారా ? పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టేసి…ఆధిపత్యం కోసం ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారా ? మా టైం వచ్చిందని చెబుతున్నదెవరు ? ఆ సీనియర్‌ నేతకు పదవి రావడంతోనే…కమలం దళంలో చీలికలు వచ్చాయా ? ఇంతకీ ఎవరా నేతలు ? ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో కొత్త వివాదం మొదలైంది. నిన్న మొన్నటి దాకా…ఎలాంటి గ్రూపులు లేకుండా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్యకర్తలు పని చేశారు. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి అధిష్టానం నుంచి మార్కులు పడ్డాయి. టీడీపీ, జనసేనతో సమన్వయం చేసుకోవడంలో ఆమె సక్సెస్ అయ్యారనే పేరు వచ్చింది. అదే సమయంలో పురంధేశ్వరిని నమ్ముకున్న కేడర్‌…తమకు పదవి వస్తుందనే నమ్మకంతో ఉన్నారట. పార్టీలో చేరికల సమయంలో పదవి ఇస్తామనే గ్యారెంటీ తీసుకున్నట్లు నేతలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో…చివరి క్షణంలో బీజేపీకి ఛాన్స్‌ వచ్చింది. అందులోనూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు…ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆయన వర్గానికి ఆశలు చిగురించాయట. సోముకు విధేయులుగా పని చేసిన వారంతా…సంబరాల్లో మునిగిపోవడంతో ప్రత్యర్థుల్లో కొత్త అనుమానం మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది.

సోము వీర్రాజు ఎమ్మెల్సీ పదవి రాగానే…ఆయన అనుచరులంతా ఒక వర్గంగా పని చేయడం మొదలుపెట్టారట. దీంతో పురంధేశ్వరిని నమ్ముకున్న వారంతా…ఒక వర్గంగా మారిపోయారట. అవకాశం వచ్చిన ప్రతిసారి సోము వీర్రాజుపై వ్యతిరేకతను ప్రదర్శించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు బాధ్యతలు ఇచ్చారని…సన్నిహితుల వద్ద సోము వీర్రాజు చెప్పుకుంటున్నారట. పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కార్యక్రమాలకు…సోము వీర్రాజు వర్గీయులు అటెండ్ కాకపోవడం, సోము వీర్రాజు కార్యక్రమాలకు రెండవ వర్గం అటెండ్ కాకపోవడం రెగ్యులర్‌గా జరుగుతోందట. దీంతో వాళ్ళందరినీ ఒక దారిలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు పార్టీకి తలనొప్పిగా మారినట్లు అంతర్గతంగా చర్చ నడుస్తోంది.

పదవులు ఆశించి పార్టీలోకి వచ్చే వారి వల్ల పెద్దగా ప్రభావం పడటం లేదనుకునే లోపు…మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల విషయంలో బిజెపికి స్కోప్ తగ్గిపోయింది. దీంతో పదవులు ఆశించిన వారంతా…మా పరిస్ధితి ఏంటో అని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఏ వర్గం వైపు వెళితే పదవి వస్తుంది ? అనే తర్జన భర్జనలో ద్వితీయశ్రేణి నేతలతో పాటు కార్యకర్తలు ఉన్నారు. ఇదంతా తెలిసినా… కేంద్ర పార్టీ మాత్రం క్షేత్రస్ధాయిలో బలోపేతం మాత్రమే ధ్యేయంగా పని చేయాలని దిశా నిర్దేశం చేస్తోంది. పార్టీ ముందున్న లక్ష్యాలలో జమిలీ ఎన్నికలు ప్రధానంగా ఉండటంతో, సీనియర్ నాయకులకు ప్రజల్లోకి ఒకే దేశం-ఒకే ఓటు అంశాన్ని తీసుకెళ్ళమే లక్ష్యంగా పని చేయాలని ఆదేశించిందట. పదవుల విషయంలో మా పరిస్ధితేంటి అనుకోవడం మానేసి, పార్టీ కోసం పని చేయాలని, పదవులు ఆశించినంత మాత్రాన రావని…చెప్పకనే చెపుతున్నారట. ఏదేమైనా.. బిజెపిలో వర్గపోరు ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.