NTV Telugu Site icon

Off The Record : వైసీపీ నేత మాజీ మంత్రి ఎక్కడ అంటూ నెల్లూరంతా ఆరా..!

Anilkumar Yadav Otr

Anilkumar Yadav Otr

బ్రో.. ఎక్కడ బ్రో? నెల్లూరులో అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు! మేరే పీఛే కౌన్‌ హై మాలుం అన్న నాయకుడు ఇప్పుడే పీఛే ముడ్ అన్నారు. ఇంతకూ వైసీపీ నేత, మాజీ మంత్రి ఎక్కడ? పాలిటిక్స్ నుంచి వేరే యాక్టివిటీస్‌కు షిఫ్టయ్యారా? నెల్లూరులో కూడా అంతగా కనిపించడం లేదట! ఏంటి సంగతి? అనిల్ కుమార్ యాదవ్! అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నేత. తన చిన్నాన్న మరణంతో ఆయన రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి వచ్చారు. కార్పొరేటర్ గెలిచారు. నెల్లూరు సిటీలో మొదట్నుంచీ రెడ్డి సామాజిక వర్గానిదే పైచేయి. 1972 నుంచీ ఇక్కడ వారిదే పెత్తనం. 2014, 2019 ఎన్నికల్లో సీన్ మారింది. వైసీపీ తరఫున రెండుసార్లు అనిల్ కుమార్ యాదవ్ పోటీచేసి గెలుపొందారు. బీసీ సామాజిక వర్గం, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో దీన్ని క్యాష్ చేసుకున్న జగన్.. రెండు పర్యాయాలు సీటిచ్చి అనిల్‌ను గెలిపించుకున్నారు కానీ.. 2024లో మాత్రం పరిస్థితి తలకిందులైంది.

మొదట్నుంచీ అగ్రెసివ్‌గా వ్యవహరించే అనిల్ కుమార్ యాదవ్… జగన్‌పై ఈగ వాలనిచ్చేవారు కాదు. ఎవరైనా అధినేతను విమర్శిస్తే.. ముందూ వెనుకా చూడకుండా విరుచుకుపడేవారు. అన్నకు నమ్మిన బంటునంటూ ప్రచారం చేసుకున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో.. జిల్లాలో సీనియర్ నేతలు కీలకంగా ఉన్నప్పటికీ, జగన్ క్యాబినెట్‌లో అనిల్‌కు స్థానం దక్కింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ధోరణి పూర్తిగా మారిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఎవరినీ ఖాతరు చేయరనే విమర్శలు ఎక్కువయ్యాయి. పార్టీలోని నేతలపైనే పరోక్ష విమర్శలు చేస్తారని… తాను ఏం చెబితే జగన్ అదే చేస్తారని అనిల్ చెప్పుకుంటారని పార్టీలో టాక్. ఆయన మాట తీరుపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. మంత్రిగా మూడేళ్లు ఉన్నా.. జిల్లా అభివృద్ధికి ఏమీ చేయలేదనే విమర్శలు వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు పార్టీలోని పలువురు నేతలు రకరకాల కారణాలతో అనిల్‌కు దూరమయ్యారు. అప్పట్లో ఈయనకు టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగింది. అంత సీన్ లేదు.. ఎవరూ అడ్డుకోలేరని.. అనిల్ ఘాటుగా రియాక్టయ్యారు. ప్రత్యర్థి నారాయణ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా సవాల్ విసిరారు. అయితే ఎన్నికల సమయంలో కొన్ని ఈక్వేషన్ల వల్ల నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్ ఆదేశించారు.

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గట్టి అభ్యర్థిని పోటీకి దించాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పినా.. అనిల్‌ కుమార్ తనకు అనుకూలంగా ఉన్న డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్‌కు దగ్గరుండి టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు.. అది వేరే సంగతి. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ నారాయణపై ఘోర పరాజయం పాలయ్యారు. ఇటు నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ కూడా ఓడిపోయారు. గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంతకుముందే ఆయన సవాల్ విసిరారు. రిజల్ట్ తర్వాత ఏమైంది మీ రాజకీయ సన్యాసం అని విలేకరులు అడిగితే.. సవాళ్లను ప్రత్యర్థులు తీసుకోలేదని కవర్ చేశారు. సరే, రెండు గెలుపులు.. ఒక ఓటమి తర్వాత అనిల్ కుమార్‌ కనిపించడం లేదు. పార్టీ యాక్టివిటీస్‌కి కూడా దూరంగా ఉన్నారు. నెల్లూరు నుంచి చెన్నైకి ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు. అక్కడ కొన్ని బిజినెస్‌లు ఉన్నాయని.. వాటినే ఫుల్ టైం చూసుకుంటున్నారని చెబతున్నారు. అప్పుడప్పుడూ నెల్లూరుకు వస్తున్నా.. తన సన్నిహితులతో మాట్లాడి వెళ్లిపోతున్నారు తప్ప, పెద్దగా బయటకు ప్రొజెక్ట్ కావడం లేదని సమాచారం. హైదరాబాదులో కూడా కొన్ని వ్యాపారాలను స్వయంగా చూసుకుంటున్నాని తెలిసింది.