Site icon NTV Telugu

Adala Prabhakar Reddy : రాజకీయంగా ఆదాల సైలెంట్ అయ్యారా..?

Simhapuri

Simhapuri

సింహపురి పాలిటిక్స్‌లో ఆయనో సీనియర్ నేత. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటు జనాల్లో బలంగా ఉండేది. అదే సెంటిమెంట్‌ను నమ్ముకొని గత ఎన్నికల్లో పోటీ చేసినా..అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అనంతరం వైసీపీ అధిష్టానం ఆయనకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించింది. మరి…అలాంటి నేతను జిల్లా నాయకత్వం లైట్ తీసుకుంటోందా?ఏ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదా?ఇంతకీ ఎవరు ఆ సీనియర్ పొలిటీషియన్?ఆయన అనుచరుల బాధేంటి?

నెల్లూరు జిల్లా పొలిటికల్ స్క్రీన్‌పై మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. సైలెంట్ రాజకీయాలకు…అయన కేరాఫ్‌గా ఉంటారు. రాజకీయ వివాదాలకు దూరంగా..అధికార పార్టీకి దగ్గరగా ఉంటారాయన. 1999లో అల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి.. మంత్రిగా పని చేశారు. 2004, 2009లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. అప్పటినుంచి ఆయన అడపాదడపా నెల్లూరుకు వస్తూపోతూ ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులుగా నియమించింది.

హైదరాబాదులో నివాసం ఉంటున్న మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తరచుగా నెల్లూరుకు వస్తున్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదట. కాకాణి గోవర్ధన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ..ఆయన అరెస్టు తరువాత ఆదాల రాజకీయంగా సైలెంట్ అయ్యారనే చర్చ నడుస్తోంది. అధిష్టానం ఆదేశించిన కార్యక్రమంలో సైతం పాల్గొనడం లేదని టాక్‌. నెల్లూరుకు వచ్చి శుభకార్యాలలో పాల్గొనడం, ఆయన అనుచరులతో మాట్లాడటం తప్పా…ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో ఆదాల కనిపించటం లేదు. జిల్లా నాయకత్వం ఆదాల ప్రభాకర్ రెడ్డిని కనీసం పార్టీ కార్యక్రమాలు కూడా పిలవడం లేదని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీమంత్రి కాకాణి అరెస్ట్ అయిన నేపథ్యంలో..సీనియర్ పొలిటీషియన్‌గా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనలు సలహాలు తీసుకోవాల్సిన సమయంలో ఆయన్ను లైట్ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

నెల్లూరు పార్లమెంటు పార్టీ పరిశీలకుడుగా ఉన్న ఆదాలకు రోజురోజుకీ పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందన్న గుసగుసలు జోరందుకున్నాయి. ఇటీవల కాలంలో జిల్లా నాయకత్వం అనేక పోరాటాలు చేసింది. కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లడం, అరెస్టవడం దగ్గర నుంచి.. జిల్లా పార్టీ కార్యాలయంలోనే అనేక ప్రెస్మీట్లు జరిగాయి. వాటిలో ఒక్క దానికి కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి హాజరుకాలేదు. ఆయన కార్యాలయ ప్రతినిధిగా ఉన్న రంగారెడ్డి సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కనీసం పిలుపు కూడా రాకపోవడం వల్లే ఆదాల ప్రభాకర్ రెడ్డి దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఆయన అనుచరులకు జిల్లా, రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా నాయకత్వాన్ని కోరినప్పటికీ…ఆశించిన స్థాయిలో ఆయనకు సానుకూల స్పందన రాలేదట. దీంతో ఆదాల జిల్లా నాయకత్వంపై గుర్రుగా ఉన్నారనే టాక్‌ బలంగా వినిపిస్తుంది.

నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆదాల ప్రభాకర్ రెడ్డికి పట్టుంది. గతంలో ఎంపీగా పనిచేయటంతో భారీ అనుచర గణం ఉంది. అలాంటి సీనియర్ నాయకులను జిల్లా నాయకత్వం విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఆదాల ప్రభాకర్ రెడ్డికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని అందుకే దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వం కూడా దృష్టి పెట్టకపోవడాన్ని ఆదాల అనుచరులు తప్పుపడుతున్నారు. గత ప్రభుత్వంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన కాంట్రాక్ట్ పనులకు జగన్ బిల్లులు మంజూరు చేయలేదట. తన ఓటమికి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కారణమనే బాధలో ఆదాల ఉన్నారని టాక్‌. తమకు జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని..జిల్లా రాజకీయ పరిస్థితులతో పాటు.. వ్యక్తిగత సమస్యలను సైతం పట్టించుకోలేదని అప్పుడప్పుడు ఆదాల తన అనుచరుల దగ్గర చెబుతుండే వారని సమాచారం.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ఆదాల ప్రభాకర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తరువాత వీరిద్దరూ పలుమార్లు భేటీ అయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. కాకాణిపై కేసు నమోదవడం, ఆయన జైలుకు వెళ్ళినప్పటి నుంచి పార్టీలో ఆదాలను పట్టించుకునే వారే కరువయ్యారు. ఆదాల నెల్లూరుకు వస్తే ఆయన అనుచరులు ఒకరు ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ ముఖం చాటేస్తున్నారని టాక్‌. దీంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్‌కే పరిమితమయ్యారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలని పక్కన పెట్టుకుంటే..ట్రబుల్ షూటర్‌గా పనికొస్తారని.. ఓ వర్గం కావాలనే ఆదాల ప్రభాకర్ రెడ్డిని పక్కన పెట్టేసిందన్న చర్చ వైసిపిలోనే జరుగుతోంది. ఐతే మరో వర్గం మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ఆదాల పార్టీ మారే ఉద్దేశంతో ఉన్నారని..అందుకే పార్టీ కార్యక్రమాల విషయంలో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీ లైట్ తీసుకుందా?లేక ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీని లైట్ తీసుకున్నారా?అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.

 

Exit mobile version