NTV Telugu Site icon

Off The Record : నేనేంటి.. నా రేంజ్ ఏంటి.. కూటమి నాకిచ్చిన పదవేంటి..?

Otr Ab

Otr Ab

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు అలకమీదున్నారా? కూటమి ప్రభుత్వం తనకిచ్చిన నామినేటెడ్‌ పోస్ట్‌తో సంతృప్తిగా లేరా? నా రేంజ్‌ ఏంటి?… నా ర్యాంక్‌ ఏంటి?… నేను పడ్డ కష్టం ఏంటి? వీళ్ళు నాకు ఇచ్చిన పోస్ట్‌ ఏంటంటూ… ఫైరైపోతున్నారా? ఏబీవీ విషయంలో ఏం జరుగుతోంది? అసలాయనేం కోరుకుంటున్నారు? ఏబీ వెంకటేశ్వరరావు….2014 టీడీపీ హయాంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పూర్తి స్థాయి పెత్తనం చెలాయించిన ఐపీఎస్‌ ఆఫీసర్‌. పోలీస్‌ ఆఫీసర్‌గా కంటే టీడీపీ సానుభూతిపరుడిగానే ఎక్కువ పాపులర్‌ అయ్యారన్నది విస్తృత ప్రచారం. అందుకు తగ్గట్టే… 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏబీవీకి చుక్కలు చూపించారన్నది డిపార్ట్‌మెంట్‌ టాక్‌. పోలీస్‌ పరికరాల కొనుగోళ్ల కేసులో సస్పెండ్‌ అయ్యారు. కోర్ట్‌లు, కేసులంటూ నానా రచ్చ జరిగింది అప్పట్లో. ఇక 2024లో తిరిగి టీడీపీ అధికారం వచ్చాక ఊపిరి పీల్చుకున్నారాయన. డీజీ ర్యాంక్‌లో ఈ మధ్యే రిటైర్‌ అయ్యారు. తర్వాత పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నామినేటెడ్‌ పోస్ట్‌ ఇచ్చింది కూటమి సర్కార్‌. మామూలుగా అయితే… ఇలాంటి పదవుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు రాజకీయ నాయకులు. ప్రకటన వచ్చీరాగానే…. జీవోకంటే ముందు వాళ్ళు వెళ్ళి కుర్చీలో వాలిపోతుంటారు. కానీ… ఏబీవీ విషయంలో మాత్రం మేటర్‌ తేడాగా ఉందట. గవర్నమెంట్‌ ఆర్డర్‌ ఇచ్చి వారాలు గడుస్తున్నా… ఆయన మాత్రం ఇంత వరకు అటువైపు తొంగి చూడలేదట. ఎందుకలా అని ఆరాలు తీస్తున్నవారికి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయంటున్నారు. నేనేంటి… నా పరపతేంటి…. ఆ ఐదేళ్ళు నేను పడ్డ కష్టాలేంటి… వీళ్ళిచ్చిన పోస్ట్‌ ఏంటి? ఠాఠ్‌…. అదసలు నా స్థాయి కాదు, దానికి బదులు కామ్‌గా ఉండటమే బెటర్‌ అంటూ… మండిపడుతున్నట్టు సమాచారం. వైసీపీ హయాంలో ఐదేళ్ళు అవమానపడ్డాను, జీతం కూడా లేకుండా పని చేశాను.

అలాంటి నాకు పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవా….. అది నా స్థాయికి తగ్గది కాదు. వేరే పోస్ట్ ఇవ్వండి. అంతే తప్ప అక్కడ ఛార్జ్‌ తీసుకునే ప్రసక్తేలేదని భీష్మించుకు కూర్చున్నారట. ఇదే విషయాన్ని తన సన్నిహితులకు చెప్పేస్తున్నారట ఆయన. అటు టీడీపీ, ఇటు పోలీస్‌ వర్గాల్లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌ అయింది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌కు ఎలాంటి పవర్స్‌ ఉండవని, ఐజీ, డీజీ, జిల్లాల ఎస్పీలతో అస్సలు యాక్సిస్‌ ఉండదని, ఎవ్వరూ తన మాట వినరని అంటున్నారట ఏబీ వెంకటేశ్వరరావు. అటు టీడీపీలోని ఓవర్గం సైతం ఏబీవీకి సపోర్ట్‌గా మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం ముద్రతో ఐదేళ్ళు కష్టపడ్డ ఆఫీసర్‌కి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంత పవర్‌లేని పోస్ట్‌ ఇస్తారా? అదసలు సరైన పనేనా అని చర్చించుకుంటున్నారట కొందరు టీడీపీ అభిమానులు. ఇంకొందరైతే… ఓ అడుగు ముందుకేసి సోషల్‌ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ…. సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నారట. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే ప్రసక్తే లేదని చెబుతున్న ఏబీ వెంకటేశ్వరరావు… తన ప్రాధాన్యతల్ని కూడా ప్రభుత్వం ముందు పెడుతున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఒక విచారణ కమిటీ వేసి దానికి తనను ఛైర్మన్‌ని చేయాలన్నది ఆయన మనసులోని మాటగా తెలుస్తోంది. లేదంటే విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఓఎస్‌డీ పోస్ట్‌ ఒకటి క్రియేట్‌ చేసి.. దానికి స్పెషల్‌ పవర్స్‌తో తనకు ఇవ్వమని అడుగుతున్నారట. గత ప్రభుత్వ అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేస్తే… తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, దాని ద్వారా డిపార్ట్‌మెంట్‌లో అందరితో మాట్లాడే అవకాశం ఉంటుందని ఏబీవీ సన్నిహితులకు చెబుతున్నట్టు సమాచారం. అటు టీడీపీలోని ఓ వర్గం కూడా ఆయన్ని సపోర్ట్‌ చేస్తున్న క్రమంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రభుత్వంగనుక అలాంటివన్నీ కుదరవు…. ఇచ్చిన పోస్ట్‌లో జాయిన్‌ కావాల్సిందేనని గట్టిగా అంటే ఏబీవీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఇంట్రస్టింగ్‌ పాయింగ్‌. దీంతో భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.