Site icon NTV Telugu

Off The Record : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్కడ..?

Rajasingh Otr

Rajasingh Otr

బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అలకపాన్పు ఎక్కేశారా? కీలకమైన ఎన్నికల టైంలో ఆయన కనిపించడం లేదు ఎందుకు? హైదరాబాద్‌ అభ్యర్థి ఎంపికపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా? లేక శాసనసభా పక్ష నేతగా తనను ఎంపిక చేయలేదన్న అసహనమా? అసలాయన విషయమై బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్‌ రాజా సింగ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా ఓడిపోయినా… గెలిచిన ఒకే ఒక్కడు రాజాసింగ్‌. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మరోసారి విజయం సాధించారాయన. హిందుత్వ అజెండాతో ముందుకు పోతూ… అ విషయంలో ఎవరి మీదికైనా ఒంటికాలి మీదికి లేచే ఎమ్మెల్యే.. కీలకమైన లోక్‌సభ ఎన్నికల వేళ హైదరాబాద్ నియోజకవర్గంలో పత్తా లేకుండా పోవడం కలకలం రేపుతోంది. అసలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదట ఆయన. బీజేపీ హైదరాబాద్‌ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించడంపై గుర్రుగా ఉన్నారట రాజాసింగ్‌. తన నియోజక వర్గం ఉన్న పార్లమెంట్‌ సీటుకు అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు కనీసం సంప్రదించలేదని కోపంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మధ్య కొంత కాలంగా గ్యాప్‌ ఉందన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్‌ టాక్‌.

పార్టీ శాసనసభాపక్ష నేతగా తనను కాదని మహేశ్వర్ రెడ్డిని ఎంపిక చేశారంటూ ఆయన హర్ట్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదన్నది బీజేపీ వర్గాల మాట. విజయ సంకల్ప యాత్ర తన నియోజకవర్గంలో జరిగినా పాల్గొనలేదాయన. అమిత్ షా సభకు సైతం దూరంగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్స్‌ మీటింగ్ డుమ్మా కొట్టారు. ఇలా.. శాసనసభాపక్ష నేత ఎంపిక జరిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాజాసింగ్‌. ఇక మాధవీలతను అభ్యర్థిగా ప్రకటించాక ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదట. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పొలిటికల్ ఇన్చార్జి కూడా అయిన ఎమ్మెల్యే… కీలకంగా వ్యవహరించాల్సిన సమయంలో అంటీముట్టనట్లు ఉండడం పార్టీకి నష్టం కలిగిస్తుందన్న అభిప్రాయం బలపడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో పార్లమెంట్ అభ్యర్థి కి వస్తున్న ఫాలోయింగ్ తనకు ఇబ్బంది అవుతుందని రాజా సింగ్ భావిస్తున్నారా అనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. పోలింగ్‌కు ఇంకా టైమ్ ఉన్నందున ఆలోపు సెట్‌ అవుతారా? లేక అలాగే అలక మంచం మీద ఉంటారా అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Exit mobile version