NTV Telugu Site icon

Off The Record: తిరుమల లడ్డూపై రోజా ఎందుకు స్పందించడం లేదు..?

Otr Roja

Otr Roja

Off The Record: తిరుమల శ్రీవారికి మహా భక్తురాలు ఆ మాజీ మంత్రి. అది ఎంతలా అంటే… సాధారణ భక్తులు ఎవ్వరికీ వీలవని విధంగా వారానికోసారి, కుదిరితే రెండు సార్లు కొండెక్కి దర్శనం చేసుకునేంత. మరి అంతటి భక్తి ఉన్న నాయకురాలు శ్రీవారి మహా ప్రసాదం లడ్డూపై ఇంతటి వివాదం జరుగుతున్నా.. ఎందుకు మాట్లాడటం లేదు? అసలా విషయమే తెలియదన్నట్టుగా కామైపోవడానికి కారణాలేంటి? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏమా భక్తిరస కథాచిత్రమ్‌?

ఎక్కడ…? ఆమె ఎక్కడ? కొండ లడ్డూ గురించి కొండంత వివాదం నడుస్తుంటే…. అసలెందుకు నోరు తెరవడం లేదు? అన్ని విషయాల మీద అనర్గళంగా మాట్లాడుతూ ప్రత్యర్థులకు కౌంటర్స్‌ ఇచ్చే మాజీ మంత్రి రోజా… తిరుమల శ్రీవారి భక్తురాలు కూడా. గట్టిగా మాట్లాడుకుంటే… వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రీ వెళ్ళనన్ని సార్లు కొండకు వెళ్లారని, వారానికోసారి, కుదిరితే రెండు సార్లు కూడా స్వామి దర్శనానికి వెళ్ళేవారన్నది ఆమె మీదున్న ప్రచారం. అంతటి భక్తురాలైన రోజా… స్వామివారి మహా ప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యి క్వాలిటీ గురించి దేశమంతా మోగిపోతుంటే…ఎందుకు మాట్లాడటం లేదన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. పైగా ఆమె రెండుసార్లు గెలిచిన నగరి నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉంది. అంతకు ముందు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా తక్షణం స్పందించే రోజా ఫలితాల తర్వాత మాత్రం టచ్‌ మీ నాట్‌ అన్నట్టుగానే ఉంటున్నారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసినవారి మీద చర్యలు తీసుకోమని కోరినా… అధిష్టానం వెంటనే పట్టించుకోలేదన్న అసహనం కూడా అందుకు ఒక కారణమై ఉండవచ్చంటున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం మీదగాని, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై గాని స్పందించలేదు మాజీ మంత్రి.

రెస్పాండ్‌ అయిన రెండు మూడు సందర్భాల్లో అంతకు మించిన రేంజ్‌లో కౌంటర్స్‌ పడటంతో…ఇక కామ్‌ అయిపోయారు. వరద సాయంపై ఆ మధ్య ఐదు నిమిషాల వీడియో విడుదల చేస్తే .. అది కూడా తేడా కొట్టిందన్న మాటలు వినిపించాయి.ఇలాంటి సమయంలో తిరుమల శ్రీవారి ప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు అన్న మాటలు ప్రకంపనలు రేపుతున్నాయి. అందుకు మాజీ సీఎం జగన్‌తో పాటు ఇద్దరు ముగ్గురు వైసీపీ నేతలు కౌంటరిచ్చినా… ఎక్కువ మంది దృష్టి మాత్రం రోజా మీదే ఉందట. ఎన్నికల తర్వాత ఆమె స్పందనలు తక్కువగా ఉన్నా…. మిగతా వివాదాలు వేరు, ఈ లడ్డూ వివాదం వేరు, ఇలాంటి ఎపిసోడ్‌పై రోజా ఎందుకు మాట్లాడటం లేదంటూ ఆసక్తిగా చూస్తున్నాయట రాజకీయ వర్గాలు. ఆమె ఎందుకు స్పందించాలో రీజన్స్‌ కూడా చూపిస్తున్నారు జిల్లాకు చెందిన కూటమి నేతలు. అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా దర్శనాలకు వెళ్ళడం, వెళ్ళి ప్రతిసారి ప్రోటోకాల్‌లో పదుల సంఖ్యలో జనాన్ని వెంటేసుకుని వెళ్ళడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్వామివారి దర్శనాల పేరుతో రోజా డబ్బు దండుకుంటున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ కూడా జరిగింది. ఐదేళ్ళలో లెక్కకు మించిన సార్లు దర్శనానికి వెళ్ళడం, ఆ పేరుతో వ్యాపారం చేశారంటూ తీవ్ర స్థాయిలోనే ఆరోపణలు చేశారు కూటమి నాయకులు.

అయితే… స్వామివారి మీద భక్తితోనే తాను అన్ని సార్లు తిరుమలకు వెళ్ళాను తప్ప.. వ్యాపారం చేయలేదని చాలాసార్లు వివరణ ఇచ్చుకున్నారు రోజా. సరిగ్గా.. ఇప్పుడు ఇదే పాయింట్‌ని పట్టుకుని లాగుతున్నారట రాజకీయ ప్రత్యర్థులు. వారానికో సారి, కుదిరితే రెండు సార్లు తిరుమల వెళ్ళి స్వామి దర్శనం చేసుకునేంత భక్తి ఉన్న రోజా… సాక్షాత్తు ఆయనకు సమర్పించే నైవేద్యాలు, ఇతర ప్రసాదాలపై ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంటే ఎందుకు మాట్లాడటంలేదన్నది వాళ్ళ క్వశ్చన్‌. ఇదే సమయంలో రకరకాల విశ్లేషణలు, ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఈ పొలిటికల్‌ ఫైర్ బ్రాండ్ మౌనం వెనుక చాలా పెద్ద కారణమే ఉండవచ్చన్న చర్చ నడుస్తోందట. ఇప్పుడు లడ్డూ వివాదంపై తాను మాట్లాడితే… గతంలోని తన సిఫారసు లేఖలు, ప్రోటోకాల్‌ దర్శనాల వ్యవహారాలు మొత్తాన్ని బయటికి లాగుతారని, అదే జరిగితే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతోనే రోజా మౌన వ్రతం పాటిస్తున్నారన్న చర్చ జరుగుతోందట చిత్తూరు జిల్లా రాజకీయవర్గాల్లో. అటు సోషల్‌ మీడియాలో సైతం రోజమ్మా… మౌనం ఎందుకమ్మా అంటూ ఆడేసుకుంటున్నారట నెటిజన్స్‌. దీంతో ఎరక్కపోయి ఇరుక్కుపోయానన్నట్టుగా ఉందట మాజీ మంత్రి వ్యవహారం. కాస్త లేటుగా అయినా లేటెస్ట్‌గా, తనదైన స్టైల్‌లో ఘాటుగా స్పందిస్తారా? లేక ఎందురకొచ్చిన గొడవ… కామ్‌గా ఉంటే పోలా అనుకుని నోటికి తాళం వేస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.