NTV Telugu Site icon

Off The Record : జహీరాబాద్లో బీఆర్ఎస్కు ఇబ్బందికర వాతావరణం.?

Bb Pati Otr

Bb Pati Otr

ఆ ఎంపీ పార్టీ మార్పుతో గులాబీ దళం ఇరకాటంలో పడిందా? దీటైన అభ్యర్థి దొరక్క తంటాలు పడుతోందా? ఎందుకా పరిస్థితి తలెత్తింది? ముందస్తు సంకేతాలు ఉన్నా… జాగ్రత్తలు తీసుకోకపోవడానికి కారణాలేంటి? ఏదా నియోజకవర్గం? రేస్‌లో ఉన్న నాయకులు ఎవరు? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కి లోక్ సభ ఎన్నికలకి ముందు భారీ షాక్ తగిలింది. అది ఊహించిన పరిణామమే అయినా…ముందు జాగ్రత్త లేకపోవడంతో పార్టీ మాత్రం డైలమాలో పడిందట. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్‌ఎస్‌కి బైబై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. పాటిల్‌ పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా… ఆయన మాత్రం ఎక్కడా బయటపడకుండా గుంభనంగా ఉండటంతో ఎంపీ అభ్యర్థిగా ఆయన్నే ప్రకటిస్తారని అనుకున్నారు ఎక్కువ మంది. కానీ…ఎంపీ ఫిరాయింపుతో ఇప్పుడు దీటైన అభ్యర్థి కోసం వెదుకుతోందట బీఆర్‌ఎస్‌. 2014 వరకు పెద్దగా ఎవరికీ పరిచయం లేని వ్యక్తి బీబీ పాటిల్‌. కానీ అప్పటి లోక్ సభ ఎన్నికలకు ముందు ఒక్కసారిగా పేరు తెరపైకి వచ్చింది. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎంపీగా గెలిచారాయన.

ఇక ఇప్పుడు ఆయన కాషాయ కండువా కప్పుకోవడంతో స్థానికంగా బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయట. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషణ మొదలు పెట్టడం ఇబ్బంది కావచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. జహీరాబాద్ లో మూడు సార్లు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే ఎంపీగా గెలవడంతో మళ్ళీ అదే సామాజికవర్గానికి చెందిన వారినే బరిలో దించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అందుకు DCMS చైర్మన్ శివకుమార్, మాజీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి పేర్లను పరిశీలిస్తోందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. జహీరాబాద్ అసెంబ్లీకి చెందిన శివకుమార్ ఈసారి జహీరాబాద్ ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక అందోల్ కి చెందిన మఠం భిక్షపతి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన భిక్షపతికి నిరుడు స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ప్రభుత్వం మారడంతో ఆరు నెలల్లో పదవి పోయింది. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికైనా ఎంపీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోందట పార్టీ. వీరిద్దరితో పాటు బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా ఈ సారి జహీరాబాద్ ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారట. తన కొడుక్కి ఎంపీ టికెట్ ఇవ్వాలని పోచారం అధిష్టానాన్ని వత్తిడి చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి లింగాయత్ కి టికెట్ ఇస్తే రెడ్డి సామాజికవర్గం భాస్కర్ రెడ్డికి సపోర్ట్ చేస్తుందని లెక్కలేస్తున్నారట పోచారం. మరి ఈ ముగ్గురిలోనే ఎవరినైనా ఎంపీ క్యాండిడేట్ గా ఫైనల్ చేస్తారా..? లేదా మరెవరినైనా తెరపైకి తీసుకువస్తారా అన్నది చూడాలి. మరి జహీరాబాద్ గడ్డపై హ్యాట్రిక్ కొట్టాలన్న బీఆర్‌ఎస్‌ ఆశ నెరవేరుతుందా..? లేదా చూడాలి..?