Site icon NTV Telugu

Off The Record : ప్రలోభాల పర్వం లో ట్రెండ్ సెట్టర్స్.. ఒక్కొక్కరు ఒక్కో రేంజ్.!

Otr Ap Politics

Otr Ap Politics

గిఫ్ట్‌ కొట్టు-ఓటు పట్టు. ప్రలోభ పెట్టు- పార్టీవైపు మార్చు. ఇదీ… ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో లేటెస్ట్‌ ట్రెండ్‌. సాధారణంగా పోలింగ్‌కు ముందు రెక్కలు విచ్చుకునే ప్రలోభాల కోయిలలు ఏపీలో ముందే కూస్తున్నాయి. విందులు చేస్తున్నాయి. ట్రెండ్‌ ఫాలో అవ్వం.. సెట్‌ చేస్తామన్నట్టుగా కొత్త కొత్త మార్గాలు వెదుకుతున్నారు నేతలు. ఇంతకీ ఏంటా ప్రలోభ పర్వం? ఎవరా ట్రెండ్‌ సెట్టింగ్‌ లీడర్స్‌?

ఓటరైనా సరే… కాస్త ఉపయోగపడతాడనుకున్నా సరే… వచ్చి వాలిపోతున్నారు. ఇవ్వాలనుకున్నది ఇచ్చేసెయ్‌… కోరుకున్నది కొట్టేసెయ్‌ అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. ప్రలోభాల పర్వంలో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు ఏపీ పొలిటికల్‌ లీడర్స్‌. ఇన్నాళ్ళు పోలింగ్‌కు రెండు రోజుల ముందో, లేదా ఇంకాస్త అతి జాగ్రత్త ఉన్న లీడరైతే ఓ వారం రోజుల ముందో ఈ సినిమా మొదలుపెట్టేవారు. కోరుకున్నోడికి క్వార్టర్‌ మందు బాటిల్‌, ఓ బిర్యానీ పొట్లం. లేదంటే ఒకటో రెండో పచ్చ నోట్లు చేతిలో పెట్టి ఒట్టేయించుకోవడం కామన్‌. కానీ… ఈసారి చిత్రం వేరేలా ఉంది. వైసీపీ, టీడీపీలకు ఈ ఎలక్షన్స్‌ డూ ఆర్‌ డై అన్నట్టుగా మారిపోయాయి. అందుకే చాలామంది నేతలు ముందు చూపుతో ఉన్నారు. పోలింగ్‌కు ముందు మొదలయ్యే ప్రలోభాల పర్వాన్ని అసలు నోటిఫికేషన్‌ కూడా రాకముందే మొదలుపెట్టేశారు. ఇలాంటి వాళ్ళ ఫోకస్‌ అంతా ఇప్పుడు ఎక్కువగా మహిళల మీదే ఉందట. మగోళ్ళకి మందు బాటిల్‌ ఇస్తే ఇప్పుడే తాగేసి మర్చిపోతారు గనుక మహిళలకు ప్రతిరోజూ కంటికి కనిపిస్తూ ఉండేలా ప్రెషర్‌ కుక్కర్స్‌, చీరల పంపిణీతో ఉండమ్మా బొట్టు పెడతా అంటున్నారు.

ఇలా మహిళల మీద ఫోకస్‌ పెట్టిన నేతల్లో ముందు వరుసలో ఉన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. 2014, 2019 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు గెలిచిన జగ్గిరెడ్డి ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం తహతహలాడుతున్నారు. ముందుగా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటేనే గట్టెక్కుతానన్న క్లారిటీకి వచ్చి గాలాన్ని అటువైపు విసిరారట. నియోజకవర్గంలో ఆసరా పథకం పంపిణీ పేరుతో మండలాల వారీగా రెండు మూడు సభలను పెట్టి డ్వాక్రా సంఘాలను ఆహ్వానిస్తున్నారు. వచ్చిన మహిళలు అందరికీ ఫ్రీగా కుక్కర్లు ఇచ్చేశారట. మెల్లిగా విషయం ఆ నోటా ఈ నోటా పాకి అందరికీ తెలిసిపోవడంతో వైసీపీ సమావేశాలకు పోటెత్తారు మహిళలు. నాకో కుక్కర్‌ అంటే నాకేదంటూ డిమాండ్‌ చేసి మరీ కుక్కర్స్‌ని పట్టుకెళ్ళినట్టు తెలిసింది. కానీ… ఇక్కడే చిర్ల జగ్గిరెడ్డి నోటు చిరిగిపోయిందట. ఏదో కొద్ది మంది డ్వాక్రా సంఘాల వాళ్ళకి ఇచ్చేసి పేరు కొట్టేద్దామనుకుంటే… ఇదేంట్రా బాబోయ్‌ పుట్టలు పగిలినట్టు ఇలా వచ్చి కుక్కర్స్‌ పట్టుకెళ్ళిపోతున్నారు…. ఇది ఇలాగే కొనసాగితే… సంపాదనంతా కుక్కర్స్‌కే సరిపోయేట్టుందేనని కక్కలేక, మింగలేక అన్నట్టుగా ఉందట ఎమ్మెల్యే టీం. దీన్ని కొనసాగించలేం.. అలాగని ఆపనూలేం…. ఎలాగా అని తెగ ఆలోచించీ….. చించగా.. ఫ్లాష్‌లాంటి ఐడియా వచ్చేసిందట. యాన్‌ ఐడియా కెన్‌ ఛేంజ్‌ యువర్‌ లైఫ్‌ అనుకుంటూ… లక్కీడిప్‌ మొదలు పెట్టారట ఎమ్మెల్యే మనుషులు. మీ అందరి పేర్లు రాసివ్వండి… మేం లక్కీ డ్రా తీసి నోట్‌ చేసుకుంటాం. ఆ లక్కీ లేడీస్‌ అందరికీ కుక్కర్స్‌ ఇచ్చేస్తామంటున్నారు. అలాగని డ్రాలో పేరు తగలని వారు కూడా ఏం ఫీలవ వద్దు. మన ఎమ్మెల్యేకు మళ్ళీ ఓటేస్తే… ఆయన గెలిచేశాక అదృష్టం ప్రెషర్ కుక్కర్‌ రూపంలో మీ ఇంటి తలుపు తడుతుందంటూ గడుసుగా చెబుతున్నారట జగ్గిరెడ్డి మనుషులు. ఎన్నికల సీజన్ కాబట్టి మార్కెట్లో కుక్కర్లు దొరకటం లేదని కవరింగ్‌ ఇస్తూ బుజ్జగించి పంపుతున్నట్టు తెలిసింది. మహిళలు కూడా ఇటు మీటింగ్‌కు వచ్చినట్లు ఉంటుంది.. అదృష్టం ఉంటే కుక్కర్ తగులుతుందనుకుంటూ సభలకు వస్తుండటంతో మీటింగ్‌లు కళకళలాడిపోతున్నాయంటున్నారు. సదరు మహిళలకు భోజనాలు పెట్టి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దగ్గరుండి మరీ వడ్డిస్తున్నారట. దీంతో వస్తున్నవారంతా అబ్బా… ఏం మర్యాద ఏం మర్యాద అనుకుంటూ ఓ ముద్ద ఎక్కువే లాగించేస్తున్నారట. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మార్కెటింగ్‌ టెక్నిక్‌ ఇక్కడితో ఆగిపోలేదండోయ్‌….. గతంలో గడప గడపకు అంటూ గ్రామ పర్యటనలు చేసినప్పుడు ఆయనకు హారతులు ఇచ్చేవారు కొందరు మహిళలు. అలా హారతి ఇవ్వగానే… ఇలా … అదే పళ్ళెంలో రెండు వేల రూపాయలు పెట్టేవారట ఎమ్మెల్యే. ఇది కూడా బాగా ప్రచారం అవడంతో ఎక్కడికక్కడ హారతి పళ్ళాలతో రెడీ అయిపోయేవారట మహిళలు. దీంతో పళ్లెంలో వేసే రెండు వేలు కాస్తా… వెయ్యి రూపాయలకు తగ్గిపోయింది. ఇప్పుడిక ఎలక్షన్‌ సీజన్‌ కదా… ప్రచారం కోసం వెళ్ళిన ప్రతిచోట హారతుల మీద హారతులు పట్టేస్తుంటే అన్ని వేలు ఎక్కడ తేవాలనుకుంటూ… ఇప్పుడా మొత్తాన్ని 500 రూపాయలకు కోసేశారట. ఎంత తగ్గించినా సరే… 500 రూపాయలు మాత్రం ఊరికే వస్తాయా అనుకుంటూ హారతి పళ్లేలతో సిద్ధమైపోయేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదంటున్నారు ఎమ్మెల్యే మనుషులు. ఇదో రకం ప్రలోభాల పర్వం అనే వాళ్ళు లేకపోలేదు. అయితే ఎమ్మెల్యే దెబ్బకు టీడీపీ నేతలు ఎవరైనా మనస్ఫూర్తిగా హారతి ఇద్దామనుకున్నా వద్దులేమ్మా అనే పరిస్థితికి వచ్చేశారట.

ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ వైసీపీ నాయకుడిది ఇంకో స్టైల్‌. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురం సమన్వయకర్తగా పంపింది వైసీపీ అధిష్టానం. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు సమీపంలోని తన ఇంజినీరింగ్‌ కాలేజీలో మార్కాపురం నియోజకవర్గం వాలంటీర్స్‌తో సమావేశం అయ్యారు అన్నా. మీటింగ్‌ అయ్యాక ఒక్కో వాలంటీర్‌కు ఐదువేల రూపాయల చొప్పున స్వీట్‌ బాక్స్‌లో పెట్టి మరీ అందించారు అన్నా అనుచరులు. ప్రతి వాలంటీర్‌ తన పరిధిలోని 50 కుటుంబాల ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయించాలని, అండగా నిలవాలని కోరారట. అంటే…వాలంటీర్ల ద్వారా అన్నా రాంబాబు ఓటర్లకు కూడా ప్రలోభాల సందేశం పంపారా అన్న చర్చ జరుగుతోంది. ఇక పల్నాడు నేతలైతే మా రూటే సపరేటు అంటున్నారు. వీళ్ళు ఊరికి ముందే… అంటే… దసరా, సంక్రాంతి టైం నుంచే జాగ్రత్త పడుతూ వస్తున్నారు. నిరుడు దసరా టైంలో ఇక్కడ లంబాడీలు చేసే సుగాలి వేడుకకు చీరలు పంచి పెట్టారు టీడీపీ నాయకుడు జీవీ ఆంజనేయులు. తండాల్లోని ప్రతి మహిళకు చీర అందేలా జాగ్రత్తలు తీసుకున్నారాయన. విషయం తెలిసిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మనమేం తక్కువ తిన్నాం… అంటూ సంక్రాంతికి దాదాపు లక్షన్నర చీరలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రతి మహిళా ఓటరుకు చీర చేరాలన్న టార్గెట్‌తో పంచారు. కొన్ని గ్రామాల్లో తీసుకోవడానికి ఇష్టపడలేదన్న సమాచారంతో… తీసుకున్నవాళ్లకే ఇంకోటి అదనంగా ఇచ్చేయమంటూ జోరుగా పంచేశారు ఎమ్మెల్యే. అంతా చూస్తున్న పరిశీలకులు మాత్రం ఇది ఇప్పుడే ఇలా ఉంటే పోలింగ్‌ టైం దగ్గరపడేకొద్దీ…ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కుతుందో ప్రలోభాలు ఎన్నిరూపాలు సంతరించుకుంటాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version