మూడు దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న ఆ ఫ్యామిలీ ఈసారి పొలిటికల్ స్క్రీన్ మీది నుంచి కనుమరుగయ్యే పరిస్థితి. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినా… ఒక్కటీ రాకపోవడంతో ఆ దంపతులు దిక్కులు చూస్తున్న పరిస్థితి. అయినా దింపుడుకల్లం ఆశలు మాత్రం అలాగే ఉన్నాయట. ఇంతకీ ఎవరా దంపతులు? ఏంటి వాళ్ల టిక్కెట్ల కథ? ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పనబాక దంపతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైందట. ఇద్దరిలో కనీసం ఒక్క టిక్కెట్ ఆశించినా… ఎవ్వరికీ దక్కకపోవడంతో ఇక ఏం చేయాలా అన్న డైలమాలో ఉన్నట్టు తెలిసింది. కోట మండలానికి చెందిన పనబాక కుటుంబానికి 1996లో మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. అప్పట్లో నేదురుమిల్లి కుటుంబానికి పనబాక దంపతులు సన్నిహితంగా ఉండేవారు… దీంతో అప్పుడు నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పోటీ చేసి గెలిచారు పనబాక లక్ష్మి. అప్పుడు రిజర్వ్ స్థానంగా ఉన్న నెల్లూరు లోక్ సభ నుంచి 1998లో మధ్యంతర ఎన్నిక్షల్లో కూడా గెలిచారామె. 1999 ఎన్నికల్లో ఓడిపోగా 2004లో ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగానే మూడోసారి ఎంపీ అయ్యారామె. అప్పుడే కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. ఇక 2009 పునర్విభజనలో నెల్లూరు జనరల్ సీటు కాగా… బాపట్లకు షిఫ్ట్ అయి విజయం సాధించారు లక్ష్మి. అదే సమయంలో తన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆమె భర్త కృష్ణయ్య.
ఇక 2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఓడిపోయాక కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న పనబాక దంపతులు..2018లో టిడిపిలో చేరారు. 2019 ఎన్నికలలో తిరుపతి లోక్ సభ టికెట్ ఆశించారు ఆమె. అలాగే సూళ్లూరుపేట లేదా గూడూరు అసెంబ్లీ టిక్కెట్ మీద ఆశలు పెట్టుకున్నారు కృష్ణయ్య. కానీ లక్ష్మికి మాత్రమే టిడిపి తరపున తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత 2021 లో జరిగిన ఉప ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు పనబాక లక్ష్మి. ఈసారి కూడా ఆమె తిరుపతి, ఆయన గూడూరును ఆశించినా ఇద్దరికీ నిరాశే మిగిలింది. ఆ మధ్య వెంకటగిరిలో జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు హాజరై టిక్కెట్ సంగతి ప్రస్తావించినప్పుడు ముందు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు ఫైనల్‌గా ఇద్దరినీ పక్కన పెట్టేశారు. పొత్తులో భాగంగా తిరుపతి ఎంపీ టిక్కెట్ బీజేపీకి వెళ్ళింది. దీంతో గూడూరు లేదా సూళ్లూరుపేట అసెంబ్లీ టిక్కెట్ అయినా ఇస్తారనుకున్నా.. అదీ జరగలేదు. దీంతో పనబాక దంపతుల రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా మారిందంటున్నారు. మావల్ల జరిగిన తప్పేంటంటూ ఈ దంపతులు సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలిసింది. టికెట్ ఇవ్వలేమని ముందే చంద్రబాబు క్లారిటీ ఇచ్చి ఉంటే… ప్రత్యామ్నాయం చూసుకునే వాళ్ళమని, ఇప్పుడిలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారట. ఇప్పటికీ ఆఖరు నిమిషంలోనైనా సూళ్ళూరుపేటలో ప్రకటించిన అభ్యర్థిని మార్చి తమకు ఇస్తారన్న నమ్మకంతో ఉందట పనబాక ఫ్యామిలీ. వాళ్ల ఆశలు నెరవేరతాయా లేక అడియాశలే అవుతాయా అన్నది చూడాలి.
