ఆ నియోజకవర్గంలో ఇంటిపోరు టీడీపీని ఇరుకున పెడుతోందా? పార్టీ అభ్యర్థికి కమ్మ సామాజికవర్గానికి మధ్య గ్యాప్ పెరిగిందా? అదే టోటల్‌గా తేడా కొడుతోందా? ఈ వర్గపోరు ప్రభావం గెలుపు అవకాశఆల మీద ఎంత వరకు పడుతుంది? రచ్చకెక్కు తున్న అంతర్గత పోరుకు ఆదిలోనే ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా? జగ్గయ్యపేట టీడీపీలో వార్ ముదురుతోందట. ఇప్పటి వరకు నేతల మధ్య ఉన్న కలహాలు ఇప్పుడు రచ్చెకెక్కి విమర్శలు చేసుకునే వరకు దాకా వెళ్ళడం పార్టీ అధిష్టానాన్ని కూడా కంగారు పెడుతున్నట్టు తెలిసింది. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం అసంతృప్తిగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు నాలుగోసారి అవకాశం కల్పించింది పార్టీ. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచారు తాతయ్య. హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నా…గత ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఈసారి గెలవాలని పట్టుదలగా ఉన్న తాతయ్యకు కమ్మ నేతల అసమ్మతి తలనొప్పిగా మారిందట. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఇక్కడ 35 వేల వరకు కమ్మ ఓట్లు ఉన్నాయి. టీడీపీ అవిర్భావం నుంచి జగ్గయ్యపేట టికెట్ ను కమ్మ సామాజిక వర్గానికే ఇస్తూ వచ్చింది అధినాయకత్వం. నెట్టెం రఘురాం మూడు సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 1999, 2004లో వరుసగా రఘురాం ఓడిపోవడంతో ఆయన స్థానంలో ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన శ్రీరాం తాతయ్యకు టిక్కెట్ దక్కింది.
తాతయ్య 2009, 2014లో వరుసగా గెలిచారు. 2019లో తిరిగి కమ్మ సామాజిక వర్గం టిక్కెట్ ఆశించినా దక్కలేదు. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో తాతయ్య ఓడిపోయారు. అందుకు కమ్మ నేతలే కారణమని భావిస్తోందట శ్రీరాం తాతయ్య వర్గం. దీంతో తాతయ్య, ఆయన సోదరులు తమను నియోజకవర్గంలో పక్కనపెట్టి రాజకీయాలు చేస్తున్నారనేది కమ్మ నేతల ప్రధాన ఆరోపణ. ఈసారి కూడా కమ్మ సామాజికి వర్గానికి చెందిన పలువురు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేసినా ఫైనల్ గా శ్రీరాం తాతయ్యకే దక్కింది. దీంతో నెట్టెం రఘురాం సారధ్యంలోని గ్రూప్ తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ కోసం పనిచేసే తమను తాతయ్య వర్గం పట్టించుకోవటం లేదని, దీన్ని అవమానంగా ఫీలవుతున్నారట కమ్మ నేతలు. ఎన్నికల్లో పార్టీ గెలవాలన్న కసి వాళ్ళకు కూడా ఉంది కాబ్టటి ఎవరికోసం పనిచేస్తారన్న ధోరణిలో శ్రీరామ్ తాతయ్య వర్గం ఉందని, అంతకు మించిన అవమానం ఏంటన్నది కమ్మ నేతల ఆవేదనగా తెలిసింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విమర్శలు చేయటంతో వ్యవహారం రచ్చకెక్కింది. శ్రీరాం తాతయ్య వర్గం మాత్రం అందర్నీ కలుపుకుని పోతున్నామని చెబుతోంది. అందర్నీ కలుపుకోకుండా వెళ్తే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవటం సాధ్యం కాదు కదా అన్నది ఆ వర్గం క్వశ్చన్. ఇక కమ్మ సామాజికవర్గం నేతలు సీటు కోసం ప్రయత్నాలు చేసినా…గెలుపు కోసం వారితో కలిసి పనిచేస్తామని చెబుతున్నారట తాతయ్య. నేతల మధ్య ఏమైనా చిన్న చిన్న బేధాభిప్రాయాలు వస్తే నెట్టెం రఘురాం సరిచేస్తారనే భరోసా ఉందనేది తాతయ్య వర్గం మాట. ఇక ఇక్కడ అంతర్గత పోరు తమ గెలుపునకు ఎంత వరకు ఉపయోగపడుతుందా అనే కోణంలో ఆలోచనలు చేస్తోందట సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయభాను వర్గం. నేతల మధ్య గ్యాప్ ను పూడ్చటానికి టీడీపీ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.
