Site icon NTV Telugu

Off The Record: వరంగల్‌ కాంగ్రెస్‌లో రచ్చ..! కొత్త-పాత నేతల మధ్య తన్నులాట..!

Cong

Cong

Off The Record: పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ తీసుకొస్తామని బీరాలు పలికిన ఉమ్మడి వరంగల్‌ కాంగ్రెస్‌ నేతలు వర్గ విభేదాలతో వీధినపడుతున్నారు. కొత్త-పాత నేతల మధ్య సమన్వయ లోపంతో ఏకంగా తన్నుకునే స్థితికి చేరుతోంది వ్యవహారం. 15 రోజుల క్రితం పరకాలలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశం రచ్చ రచ్చగా మారి ఏకంగా ఒక వర్గం నిరసనకు దిగే స్థితికి చేరుకుంది. చివరికి పోలీసులు ఓ వర్గాన్ని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మంత్రి కొండా సురేఖను ఆహ్వానించకపోవడంతో భగ్గుమన్నారు ఆమె వర్గీయులు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి తన వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ కొండా వర్గీయులను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రి సురేఖ వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరింత ఆగ్రహంతో ఊగి పోయిన కొండా వర్గీయులు కొందరు రోడ్డెక్కి ధర్నా చేశారు.

పొరుగు నియోజక వర్గం నుండి పరకాలకు వలస వచ్చినా… నమ్మకంతో గెలిపిస్తే రేవూరి తమను తొక్కేస్తున్నాడని ఆరోపిస్తున్నారు కొండా అనుచరులు. కార్యకర్తలు కొట్టుకోవడం సంగతి అలా ఉంచితే… ఈ ఘటన ఇద్దరు నాయకుల మధ్య ఉన్న కోల్డ్‌వార్‌ని బయటపెట్టిందని అంటున్నారు పరిశీలకులు. ఈ వివాదం మరింత ముదిరి ఇప్పుడు ఆడియో టేపులు బయటపెట్టుకునేదాకా వెళ్ళింది. ఇద్దరు నేతలు వార్నింగ్స్‌ ఇచ్చుకునే స్థాయికి వెళ్ళారంటూ… ఓ ఆడియో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయమై కొండా, రేవూరి మధ్య జరిగిన వాగ్వాదం ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. రాంపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రడం భరత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. గతంలో కొండా దంపతులకు ముఖ్య అనుచరుడిగా ఉన్న భరత్ ఎన్నికల తర్వాత తిరిగి కొండా సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయన చేరిక పట్ల రేవూరి అసంతృప్తితో ఉన్నారని ఆ ఆడియో ద్వారా బయట పడింది. భరత్‌ విషయంలోనే ఇద్దరు నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటలు జరిగినట్టు స్పష్టం చేస్తోంది ఆ ఆడియో. ఒక దశలో కొండా సురేఖ వాయిస్‌ వార్నింగ్ ఇచ్చేలాగా మారిపోవడంతో దమ్కీ ఇస్తున్నావా అని రేవూరి ప్రకాష్ రెడ్డి అడగడాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ అధిష్టానం రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల టికెట్ ఆఫర్ చేయగానే కొండా దంపతులు విభేదించారు.

పరకాల నుండి తమ కుమార్తెను బరిలో దించేందుకు కొండా దంపతులు చాలా రోజులు ప్రయత్నించినా… ఫలితం లేకపోయింది. పరకాలలో పట్టున్న కొండా దంపతులు రేవూరికి సహకరించాలని కూడా సూచించారు పార్టీ పెద్దలు. దాన్ని ఆసరా చేసుకుని వారు ఆయన మీద పెత్తనం చేసే ప్రయత్నం జరిగిందన్న విమర్శలున్నాయి. అలాగే ఎన్నికల్లో గెలిచాక.. మేమే గెలిపించామని చాలాచోట్ల కొండా దంపతులు చెప్పడంతో మొదలైన విభేదాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. పోలీస్‌ ట్రాన్స్ ఫర్స్ లో కొండా దంపతులు పరకాల నియోజకవర్గం పరిధిలో ఇన్వాల్వ్ అవడం మరింత ఆజ్యం పోసింది. తర్వాత క్యాడర్ చేరికలతో మరింత ముదిరిపోయాయి. పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు కూడా మొదట కొండా సురేఖకి ఇస్తారని అందరు భావించారు కానీ అనూహ్యంగా రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఇవ్వడం కూడా విభేదాలు పెరగడానికి మరో కారణం అంటున్నారు. ఎవరికి వారు తగ్గేదేలే అనడంతో లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో ఇది ఎట్నుంచి ఎటు పోతుందోనన్న ఆందోళన పెరుగుతోంది కేడర్‌కు. మరోవైపు నాయకులు ఇద్దరూ పర్సనల్‌ ఫోన్లలో మాట్లాడుకున్న ఆ సంభాషణ ఎలా బయటికి వచ్చింది? దానివల్ల లాభం ఎవరికి అన్న చర్చ సైతం మొదలైంది. మొత్తంగా ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన మాత్రం కేడర్‌లో ఉంది.

Exit mobile version