Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?

  • నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉదయగిరి టీడీపీ..
  • ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ మీద పార్టీలోనే వ్యతిరేకత ఉందా?..
  • మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు టచ్‌లోకి కొందరు..
  • ఎన్నికల టైంలో అందర్నీ కలుపుకుని వెళ్ళిన కాకర్ల..
  • క్రమంగా బొల్లినేని వర్గాన్ని దూరం పెట్టారన్న అభిప్రాయం..
  • ఇటీవల హైదరాబాద్‌లో ఒక పెళ్ళిలో ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం భేటీ..
  • బొల్లినేని రామారావు యాక్టివ్‌ అవ్వాలని ఆయన వర్గం వత్తిడి..
  • ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండే ఒకరిద్దరు కూడా మాజీ ఎమ్మెల్యే చెంతకు?..
  • వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు కాకర్ల ప్రయారిటీ ఇస్తున్నారన్న ఫిర్యాదు..
Otr Udayagiri Tdp

Otr Udayagiri Tdp

Off The Record: పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా…. నెల్లూరు జిల్లా ఉదయగిరి టిడిపిలో ఇంటర్నల్‌గా రీ సౌండ్స్‌ వస్తున్నాయట. ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు వ్యతిరేకంగా ఒక వర్గం రీ యూనియన్‌ అవుతున్నట్టు తెలుస్తోంది. పాత తరం పార్టీ నేతలకు, ఎమ్మెల్యేకి మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. వరుస భూ వివాదాలు కాకర్ల మెడకు చుట్టుకుంటున్నాయట. అనుచరులు చేసే తప్పులకు కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారుతోందంటున్నారు. ఆయన వ్యవహార శైలి నచ్చని పాత తరం టిడిపి నేతలందరూ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి టచ్‌లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మండలాల్లో తమకేం పనులు జరగడంలేదని.. పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం ఎమ్మెల్యే మనుషులు చెప్పినట్టే పనిచేస్తున్నారంటూ సీనియర్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. 2024 ఎన్నికలకు ముందు ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా బొల్లినేని రామారావు ఉన్నారు. అయితే ఫైనల్‌గా ఆయన్ని కాదని టీడీపీ అధిష్టానం ఎన్నారై కాకర్ల సురేష్‌కు మొదటి లిస్ట్‌లోనే అవకాశం కల్పించింది. అప్పటి వరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసిన సురేష్.. అన్ని వర్గాలను కలుపుకొని జనంలోకి వెళ్ళి ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే విజయం సాధించారు. కానీ… గెలిచాక వైఖరి మారిందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. వరుస వివాదాలు చుట్టు ముడుతుండగా… అటు బొల్లినేని వర్గాన్ని సైతం దూరం పెట్టేశారన్నది కేడర్‌ చెబుతున్న మాట. తన వర్గాన్ని దూరం పెట్టినా… బొల్లినేని రామారావు పెద్దగా రియాక్ట్‌ అవకుండా, నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెట్టకుండా.. నెలకోసారి తన వాళ్ళని కలుస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ చర్చ ఉదయగిరి నియోజకవర్గంలో జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక వివాహానికి మాజీ ఎమ్మెల్యే వెళ్ళగా.. అదే పెళ్ళికి ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన పాతతరం టీడీపీ నేతలు, పలువురు మండలాధ్యక్షులు హాజరయ్యారు. వాళ్ళంతా కలిసి అప్పుడు ఎమ్మెల్యే మీదున్న అసంతృప్తిని బొల్లినేని దగ్గర వెళ్ళగక్కినట్టు తెలిసింది. కాకర్ల తమను పట్టించుకోవడంలేదని, ఒక సిఐ తో పాటు పలువురు అధికారులను మార్చాలని కోరినా.. చేద్దాం చూద్దామనే మాటలే తప్ప పని జరగడం లేదని వాపోయారట. పోలీస్‌ స్టేషన్లతో పాటు మండల కార్యాలయాల్లో కూడా తమకు పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే…. ప్రజలకు, ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ పెరిగిపోవడం వల్లే.. పార్టీకి మైలేజ్ రావడం లేదని అంతర్గతంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది. వింజమూరు, ఉదయగిరి, దుత్తలూరు, కలిగిరిలో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందని, పార్టీకీ అది పెద్ద డ్యామేజ్ అంటూ చెప్పుకొచ్చారట. ఓ సీఐ వ్యవహార శైలి కూడా ఎమ్మెల్యే కాకర్ల కు చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉందన్నది సీనియర్స్‌ వాయిస్‌. నక్కలగండి రిజర్వాయర్ లో ఉండే మత్స్య సంపదను ప్రైవేట్ వ్యక్తులు కాజేస్తుంటే ఎమ్మెల్యే కనీసం పట్టించుకోలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓ పోలీస్ అధికారి పర్యవేక్షణలో ఈ చేపల దందా సాగుతోందట. ఈ వ్యవహారం ఎమ్మెల్యే కి తెలుసా లేదా అనే అనుమానాలను స్థానిక టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

×
×
Ad

ఇప్పుడసలు నియోజకవర్గంలో ప్రతిపక్షం బలంగా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న చర్చ కూడా నేతల మధ్య జరిగిందట. ఈ పరిస్థితుల్లో ఉదయగిరి నియోజకవర్గంలో మళ్లీ యాక్టివ్ అవ్వాలని బొల్లినేని రామారావును పాత తరం టీడీపీ నేతలు కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం పార్టీ సెంట్రల్‌ ఆఫీసులోని గ్రీవెన్స్ సెల్‌లో జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో పని చేస్తున్నారు బొల్లినేని రామారావు. ఇక నుంచి ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టాలని కోరారట స్థానిక నేతలు. మరోవైపు ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌… ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో సన్నిహితంగా ఉండే వాళ్ళని కూడా దూరం పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ జిల్లా అధ్యక్షులకు చెప్పలేక, దూరం పెడుతున్న ఎమ్మెల్యేకి దగ్గర అవ్వలేక కొందరు టీడీపీ సీనియర్స్‌ సతమతమవుతున్నారట. గతంలో ఎమ్మెల్యేకి దగ్గరగా ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా ఇప్పుడు బొల్లినేనికి టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబు హెచ్చరికల తర్వాత ఎమ్మెల్యేలో మార్పు వస్తుందని అందరూ భావించారని, కానీ ప్రస్తుతం అలాంటిదేమీ కనిపించడం లేదని సొంత నేతలే చెబుతున్నారు. వైసీపీ నుంచి వచ్చిన ఒకరిద్దరు నేతలకి ప్రాధాన్యం ఇస్తున్నారని.. తమను పట్టించుకోవడంలేదని పాత తరం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో మెట్ట ప్రాంత నియోజకవర్గ రాజకీయం రసకందాయంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం.