Site icon NTV Telugu

Off The Record: రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.. పెండింగ్ బిల్లుల కథ కంచికి చేరినట్టేనా..?

Pending Bills

Pending Bills

Off The Record: తెలంగాణ గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లుల కథ ముగిసింది. పదింటిలో కేవలం మూడు బిల్లుల్ని మాత్రమే ఆమోదించిన గవర్నర్‌ తమిళ్ సై …. తన దగ్గర ఉన్న మిగతా వాటిని డిస్పోజ్ చేశారట. అంటే… ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆమోదం పొందాల్సిన బిల్లులేవీ… రాజ్ భవన్‌లో పెండింగ్‌లో లేనట్టేనన్న మాట. దీంతో ప్రభుత్వం కోర్ట్ కెళ్ళినా పరిస్థితి ఆపరేషన్ సక్సెస్… పేషంట్ డెడ్ అన్నట్టుగా తయారైందని అంటున్నాయట రాజకీయవర్గాలు. తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్టుగా ఉంది. పలు అంశాలపై రెండు పక్షాల మధ్య ఒకలాంటి యుద్ధమే నడుస్తోందట. శాసన సభ ఆమోదించిన బిల్లుల విషయం లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

గత సెప్టెంబర్‌లో అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్లో ఏడు రాజ్ భవన్‌లో పెండింగ్‌లో ఉండగా.. ఇటీవలి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరో మూడు గవర్నర్‌ టేబుల్‌ మీదున్నాయి. దీంతో గవర్నర్ బిల్లుల్ని ఆమోదించడం లేదంటూ హై కోర్టుకు వెళ్ళింది రాష్ట్ర సర్కారు… ఆ తర్వాత సుప్రీం కోర్టు తలుపు కూడా తట్టింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా రాజ్ భవన్‌లోని పెండింగ్ బిల్లులకు చలనం వచ్చింది…మొత్తం పదింటిలో మొదట మూడు బిల్లులకు ఆమోద ముద్ర వేశారు గవర్నర్. మరో మూడింటిని పెండింగ్‌లో పెట్టారు… రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ఒక బిల్లును క్లారిఫికేషన్ కోసం తిప్పి పంపేశారు. ఇంకోటి అసలు తన దగ్గరకే రాలేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాజాగా తన దగ్గర ఉన్న మూడు పెండింగ్ బిల్లుల పై నిర్ణయం తీసుకున్నారు గవర్నర్‌ తమిళిసై. ఇందులో రెండింటిని మరింత వివరణ కావాలంటూ ప్రభుత్వానికి తిప్పి పంపించారు…. ఇంకో బిల్లును తిరస్కరించారు. .

మొత్తానికి గవర్నర్ తన దగ్గర ఉన్న అన్నిటినీ డిస్పోజ్‌ చేశారు… అయితే ఇందులో ప్రభుత్వానికి ఒనగూరిన ప్రయోజనం పెద్దగా లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రాముఖ్యత లేని వాటిని ఆమోదించి.. కీలక బిల్లుల్ని రాష్ట్రపతికి పంపడమో, వివరణ కోసం తిప్పికొట్టడమో చేశారు. ఒక బిల్లును అయితే ఏకంగా తిరస్కరించారు. ప్రభుత్వం కోర్ట్‌కు వెళితే గవర్నర్ తన ఆప్షన్స్ ను ఉపయోగించుకున్నారు… తన దగ్గర ఉన్న బిల్లులను అన్నింటినీ ఆమోదించకుండా వివిధ మార్గాలను ఎంచుకున్నారు. దీంతో ఇప్పుడు రాజ్‌భవన్‌లో పెండింగ్‌ బిల్లులు ఏవీ లేవని అనిపిస్తున్నా…ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం మాత్రం నెరవేరలేదు. గవర్నర్ అన్ని విధాలా తన విచక్షణాధికారాలను ఉపయోగించుకున్నారు. ప్రభుత్వం కోర్ట్‌కు వెళ్ళి గవర్నర్ దగ్గర ఉన్న బిల్లులను బయటకు తేవడంలో సక్సెస్ అయినా ఫైనల్‌గా వాటిని ఆమోదింప చేసుకోలేకపోయింది. అందుకే ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Exit mobile version