Site icon NTV Telugu

Off The Record: డీసీసీబీ ఛైర్మన్‌ పీఠంపై కాంగ్రెస్‌ గురి.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విభేదాలు..!

Nzb Cong

Nzb Cong

Off The Record: నిజామాబాద్ జిల్లా డీసీసీబీ పీఠంపై గురిపెట్టింది హస్తం పార్టీ. గులాబీ పార్టీ కింద ఉన్న ఛైర్మన్ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారట కాంగ్రెస్ పెద్దలు. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కనుసన్నల్లో ఆపరేషన్‌ డీసీసీబీ నడుస్తోందంటున్నారు. పాలకవర్గంలో మెజార్టీ డైరెక్టర్లు బీఆర్ఎస్ నేతలే ఉన్నప్పటికీ.. చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టించడంలో తెర వెనుక చక్రం తిప్పారట హస్తం పెద్దలు. గతంలో చైర్మన్ సీటు ఆశించి భంగ పడ్డ ఓ డైరెక్టర్‌ని ఇప్పుడు అదేసీట్లో కూర్చోబెట్టే దిశగా పావులు కదుపుతున్నారట. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు భాస్కర్‌ రెడ్డి ప్రస్తుతం డీసీసీబీ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన్ని తప్పించి తమకు కావాల్సిన వారిని పదవి ఇప్పించేందుకు కాంగ్రెస్‌ నేతలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఆ క్రమంలోనే వైస్ ఛైర్మన్ రమేష్ రెడ్డి, మరో 15 మంది డైరెక్టర్లతో కలిసి జిల్లా సహకార అధికారికి అవిశ్వాస నోటీసులు అందచేశారట. త్వరలో బలపరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. అవిశ్వాస తీర్మానానికి ముందే.. మెజార్టీ డైరెక్టర్లను పార్టీలో చేర్చుకుని డీసీసీబీని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ స్కెచ్ వేస్తోందంటున్నారు.

మరోవైపు నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మన్ పై సొంత పార్టీ డైరెక్టర్లు అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం గులాబీ పార్టీకి మింగుడు పడటం లేదట. ఊహించని పరిణామంతో ప్రతిపక్షం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా అదే సమయంలోఇది హస్తం పార్టీలో కూడా చిచ్చు పెడుతున్నట్టు తెలిసింది. ఛైర్మన్ పీఠంపై తన సమీప బంధువును కూర్చో బెట్టాలన్న టార్గెట్‌తో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నీతానై వ్యవహారిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఐతే ఛైర్మన్ రేసులో ఉన్న రమేష్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కి సన్నిహితుడు కావడంతో ఆయన్ని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యతిరేకిస్తున్నారట. ఈ విషయంలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య చిచ్చు రేగుతోందంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది, వ్యవహారాన్ని ఎలా డీల్‌ చేస్తారన్న టెన్షన్‌ కాంగ్రెస్‌ కేడర్‌లో పెరుగుతోందట. మరోవైపు బ్యాంకు డైరెక్టర్లను సీఎం దగ్గరికి తీసుకువెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వీలైనంత త్వరగా సీఎం సమక్షంలో డైరెక్టర్స్‌కు కాంగ్రెస్‌ కండువా కప్పి ఛైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ప్లాన్‌లో ఉన్నారు జిల్లా కాంగ్రెస్ నాయకులు. అచు మెజార్టీ డైరెక్టర్లు బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ.. ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట గులాబీ నేతలు. జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసే యోచనలో ఉన్న డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు సొంత పార్టీ డైరెక్టర్లు నుంచి వ్యతిరేకత రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అదే సమయంలో హస్తం పార్టీలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విభేదాలతో చివరికి ఏం చేస్తారోనన్న టెన్షన్‌ ఉందంటున్నారు. కీచులాటల్లో ఏమీ జరక్కముందే మేటర్‌ని త్వరగా ఫినిష్‌ చేయాలన్న ప్లాన్‌ ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

Exit mobile version