NTV Telugu Site icon

Off The Record: మెదక్‌లో మళ్లీ పాత యుద్ధం.. పద్మాదేవేందర్‌రెడ్డి వర్సెస్‌ మైనంపల్లి

Mynampally

Mynampally

Off The Record: మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య మరోసారి వార్ మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. 2008లో జరిగిన ఉప ఎన్నిక, 2009 సాధారణ ఎన్నికల్లోనూ ఇద్దరూ తలపడగా మైనంపల్లి హనుమంతరావే పైచేయి సాధించారు. రాష్ట్రం విడిపోయాక మైనంపల్లి మెదక్ నియోజకవర్గం నుంచి మల్కాజిగిరికి షిఫ్ట్ అవడం, బీఆర్ఎస్‌లో చేరడంతో విభేదాలు సద్దుమణిగాయి. అయితే ఇప్పుడు కొడుకు రోహిత్ కోసం పార్టీ మారిన మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరి మళ్లీ మెదక్ మీద దృష్టి పెట్టడంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైనట్టయింది.

హనుమంతరావు తన కొడుకు రోహిత్‌కు మెదక్ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కుదరకపోవడంతో.. తనకిచ్చిన మల్కాజ్‌గిరి టిక్కెట్‌ని కూడా వదులుకుని అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటికి చేరిపోయారాయన. పార్టీ మారాక మెదక్ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారట మైనంపల్లి. అక్కడ వరుస పర్యటనలతో కేడర్‌కి దగ్గరవుతూ.. గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట. మరో వైపు ఇన్నాళ్ళు తనకు అనుకూలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ కేడర్‌ని కూడా తన వైపు తిప్పుకునే ప్లాన్‌లో ఉన్నట్టు తెలిసింది. దీంతో మెదక్ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.

తన పాత అనుచరులు, బీఆర్‌ఎస్‌ కేడర్‌ని మైనంపల్లి తిప్పుకోగలిగితే పద్మా దేవేందర్‌రెడ్డి తిప్పలేనంటున్నారు. ఈ క్రమంలోనే… పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇప్పటి నుంచే మాటల తూటాలు పేలుస్తున్నారట నేతలిద్దరూ. ఇన్ని రోజులు అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని నయా పైసాతో ఖర్చు పెట్టిస్తానని మైనంపల్లి చెబుతుంటే ఎలక్షన్లు రాగానే డబ్బుల సంచులతో బయలుదేరారంటూ రివర్స్‌ కౌంటర్‌ వేస్తున్నారు పద్మా దేవేందర్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో ఈ సారి అందరి కన్ను మెదక్ పై పడినట్టు తెలిసింది. మరి మూడో సారి గెలిచి ఆమె హ్యాట్రిక్ కొడుతారా..? లేక మైనంపల్లి తన కుమారుడిని గెలిపించుకుని మెదక్‌లో పద్మకు ముచ్చటగా మూడో సారి ఓటమి రుచి చూపిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

మెదక్ లో పద్మా దేవేందర్ రెడ్డి, మైనంపల్లి మధ్య వార్ | Off The Record | Ntv