Site icon NTV Telugu

Off The Record: ఏపీలో రికార్డుస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‎ల ట్రాన్స్‌ఫర్స్‎..! కారణమేంటి..?

Ap

Ap

Off The Record: ఎన్నికల సందర్భంగా ఏపీలో ఓ కొత్త రికార్డ్‌ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఐఎఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. అది కూడా అలాంటిలాంటివి కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్‌ తీసుకుని మరీ చేసిన ట్రాన్స్‌ఫర్స్‌ కావడంతో అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతకు ముందు కూడా కొందరు ఐపీఎస్‌లు, ఒకరిద్దరు ఐఎఎస్‌ ఆఫీసర్స్‌ని బదిలీ చేసినా.. ఈ స్థాయిలో ఈసీ బదిలీ వేటేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఏపీలోనే కాదు.. అసలే రాష్ట్రంలోనూ జరిగిన దాఖలాలు లేవు. 8 మంది ఐపీఎస్‌లు.. ఐదుగురు ఐఏఎస్‌లు. ఓ ఐఆర్‌టీఎస్‌.. ఇలా ఒకరి తర్వాత ఒకరిని గ్యాప్‌ ఇచ్చి బదిలీ చేస్తూనే ఉంది ఎన్నికల సంఘం. వివిధ జిల్లాల ఎస్పీలు.. కీలకమైన కమిషనరేట్‌కు చెందిన పోలీస్‌ కమిషనర్‌, ఓ రేంజ్‌ డీఐజీ.. ఏకంగా ఇంటెలిజెన్స్‌ డీజీ.

అలాగే వివిధ జిల్లాల కలెక్టర్లు.. అలాగే మద్యం వ్యవహారాలు చూసే ఐఆర్‌టీఎస్‌ అధికారిని విడతల వారీగా.. బదిలీ చేసింది ఈసీ. ఇదే కాకుండా.. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డారన్న కారణంతో ఓ ఐఏఎస్‌ సస్పెండ్‌ అయ్యారు. దీంతో ఏ రాష్ట్రంలోనూ అధికారులపై ఈ స్థాయిలో ఎన్నికల సంఘం కన్నేసి ఉండదన్న చర్చ ఇప్పుడు పరిపాలనా వర్గాల్లో జోరుగా జరుగుతోందట. అదే సమయంలో ఈసీ వేటు, వేట ఇక్కడితో ఆగుతుందా? లేక మరిన్ని బదిలీలు ఉంటాయా? అన్ క్వశ్చన్‌ కూడా వస్తోందట. ఇంత మంది మీద చర్యలు తీసుకున్నారు కాబట్టి.. ఇక వేటకు బ్రేకులు పడ్డట్టేననేది కొందరి వాదన. కానీ, ఇంకొందరు మాత్రం కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఎన్నికల టైంలో ఈ స్థాయిలో అధికారుల మీద చర్యలు తీసుకోలేదని.. పరిస్థితిని బట్టి చూస్తుంటే.. ఏమైనా జరగొచ్చన్నది ఎక్కువ మంది అధికారుల అభిప్రాయంగా తెలిసింది.

వాస్తవానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇచ్చిన ఫిర్యాదులో ఐఏఎస్‌లు కావచ్చు.. ఐపీఎస్‌లు కావచ్చు.. 20 మంది దాకా ఉన్నారు. అందులో కీలకమైన, ప్రతిపక్షాలనే టార్గెట్‌ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్న వారిని ఇప్పటికే తప్పించినట్టు చెబుతున్నారు. అలాగే డీజీపీ కంటే కీలకంగా వ్యవహరిస్తున్న నిఘా విభాగం హెడ్‌ పీఎస్సార్‌ ఆంజనేయులను కూడా తప్పించి వేరే వారిని నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో ప్రభావితం చేయగలిగే ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో.. వాళ్ళని దాదాపు తప్పించారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా కొందరు కీలక అధికారులను తప్పించాలని వత్తిడి చేస్తూనే ఉన్నాయట. సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్‌ రెడ్డిలను తప్పించాల్సిందేనని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. వీరిలో కూడా డీజీపీ కంటే సీఎస్‌పై ఎలక్షన్‌ కమిషన్‌కు నిత్యం ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయట. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ సహా.. ఇతర పరిపాలనా అంశాల్లో సీఎస్‌ వైసీపీకి సహకారం అందిస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ.

ఈ క్రమంలో ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేసి తీరాలంటూ వరుస కంప్లైంట్లు చేస్తూనే ఉన్నారు ప్రతిపక్ష నేతలు. అందుకే త్వరలోనే చీఫ్‌ సెక్రెటరీ, డీజీపీల పైనా ఈసీ వేటు వేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా.. గతంతో పోల్చుకుంటే ఈ స్థాయిలో అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడం మామూలు విషయం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఇప్పుడు చర్చ అంతా… లిస్ట్‌లో ఇంకెంత మంది ఉన్నారన్నదే. కానీ… ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే నామినేషన్‌ల ప్రక్రియ ముగిసింది.. ఇక బదిలీలు ఏం ఉండవనే భావన వ్యక్తమవుతున్నా.. వెయిట్‌ అండ్‌ సీ అనే వాళ్లు కూడా లేకపోలేదు. దీంతో ఎప్పుడు ఎవరి మీద బదిలీ వేటు పడుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది అధికార వర్గాల్లో..

Exit mobile version