Off The Record: వాళ్ళంతా…ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం, డిమాండ్ల సాధన కోసమే పనిచేస్తుంటారు. పైకి అందరి లక్ష్యం ఒక్కటిగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ…అదర్ టార్గెట్స్ మాత్రం వేరుగా ఉంటాయట. తమ ఉద్యమంతోనే ఇప్పటిదాకా ఏదైనా సాధించగలిగాం అని గొప్పగా చెప్పుకునే ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులకు వాస్తవంగా ఉమ్మడి లక్ష్యం ఉందా అన్న డౌట్స్ అక్కడి ఎంప్లాయిస్‌కే వస్తున్నాయట. పైకి ఎంత గట్టిగా మాట్లాడుతున్నామని చెబుతున్నా… కొన్ని సంఘాలు ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అందుకే గట్టిగా ఉండాల్సిన దగ్గర కూడా… సోసోగా వెళ్ళిపోతుంటారన్నది ఇంటర్నల్ టాక్. అన్ని ఉద్యోగ సంఘాలను ఒక తాటి మీదకు తేగలిగాం, సీఎస్‌ను కలిసి డిమాండ్లపై క్లారిటీ ఇవ్వకుంటే ఆందోళన బాట పడతామని హెచ్చరించినట్టు ప్రచారం చేసుకుంటోంది ఏపీజేఏసీ. 70 శాతం డిమాండ్ల సాధనతో ముందున్నామని, అందుకే అందర్నీ కలుపుకుని పోతున్నామని చెప్పుుకుంటున్నారట ఆ యూనియన్ నాయకులు. మరి ప్రచారం చేసుకుంటున్నట్టు ఏపీజేఏసీ అన్ని ఉద్యోగ సంఘాలను ఒక్క తాటి మీదికి తీసుకురాగలిగిందా అంటే ఎంప్లాయిస్ నుంచి స్పష్టమైన సమాధానం మాత్రం రావడం లేదు.
మరోపక్క ఇటీవల కార్యాచరణ మొదలెట్టిన ఏపీ ఉద్యోగుల సంఘం తీరు మరోలా ఉంది… ఎవరేం చెప్పినా.. ఏం చేస్తున్నా.. మా ఉద్యం మొదలైంది… ఓపీఎస్ సాధనకు ప్రత్యేక సమితి కూడా పెట్టాం.. అంతా మాతో అనుబంధంగా పని చేస్తారు.. అంటూ కొత్తగా కార్యాచరణ ప్రకటించారు ఆ యూనియన్ నాయకులు. వచ్చే నెల 8వరకూ కార్యాచరణ ప్రకటించారు.. జిల్లాల వారీగా రిలే నిరాహారదీక్షలు మొదలయ్యాయి. వీళ్ళు కూడా అన్ని సంఘాలను కలుపుకుని వెళుతున్నామనే చెబుతున్నారు. అలా అంటూనే… ఏపీ ఎన్జీఓల సంఘంపై తీవ్రమైన కామెంట్లు చేశారు. సీపీఎస్ రద్దు ఉద్యమంలో ఏపీఎన్జీఓలు పాల్గొనలేదని, వారు ఉద్యోగులను మోసం చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఓవైపు అవతలి యూనియన్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నా… చీమ కుట్టినట్టు కూడా లేదట ఏపీ ఎన్జీఓస్‌కి. ఏపీ సీఎస్‌ను కలిసిన వారిలో బొప్పరాజుతో పాటు, ఎన్జీఓల సంఘ నాయకులు కూడా ఉన్నారు. కానీ.. ఎక్కడా మాట మాత్రం కూడా స్పందించలేదట. అంటే ఉమ్మడి కార్యాచరణ వారికి ఇష్టం ఉన్నట్టా, లేనట్టా అన్న అనుమానాలు ఉద్యోగుల్లో వస్తున్నట్టు తెలిసింది. ఏపీజేఏసీ అమరావతితో కలిసి పని చేస్తారని గతంలో అనుకున్నదంతా భ్రమేనని, ఎవరి దారి వారిదేనన్నట్టుగా ఉందని అనుకుంటున్నారు ఎంప్లాయిస్. ఎవరికి వారు అందరూ ఏకం కావాలంటారు…ఒక్కరూ ముందుకు రారన్నట్టుగా తయారైంది ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల తీరు. ఎందుకంటే… కొందరికి ప్రభుత్వంతో మొహమాటం, పెద్దలతో సాన్నిహిత్యంలాంటివి ఉన్నాయట అందుకే వాళ్లు గట్టిగా మాట్లాడలేకపోతున్నారట. అలాగని సైలెంట్‌గా ఉంటే… తమ సంఘ సభ్యుల్లో సైతం వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నందున మెలకువ వచ్చినప్పుడల్లా కలిసి పనిచేద్దామని అరవడం, తర్వాత యధావిధిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళడం చేస్తున్నారట. ఉద్యోగ సంఘాల ఐక్యత బ్రహ్మ పదార్దమేనని, ఇలాంటి నాయకుల్ని పెట్టుకుని ఐక్య ఉద్యమాలతో డిమాండ్లు ఎలా సాధించుకోగలుగుతామని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఉద్యోగులు.