NTV Telugu Site icon

Off The Record: ఆ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌లో ముదురుతున్న జగడం..

Jagtial

Jagtial

Off The Record: జగిత్యాల బీఆర్ఎస్‌లో జగడం స్టార్టయిందా.. అంటే వరుసగా జరుగతున్న ఘటనలు అవుననే అంటున్నాయి…. ఎమ్మెల్యే వర్సెస్ జడ్పీ చైర్మన్ గా వివాదం రోజు రోజుకు ముదురుతోందట..ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ దావా వసంతకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనేది బహిరంగ రహస్యం… వసంత ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది గమనించిన సంజయ్ కుమార్ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారట…. ఇప్పటికే మున్సిపల్ చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి ఎపిసోడ్‌తో చికాకులు ఎదుర్కొన్నారట ఎమ్మెల్యే… కొత్తగా జడ్పీ చైర్మన్ రూపంలో మరో తలనొప్పి తయారైందట… జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన దావా వసంత, ఆమె భర్త సురేష్ ఈసారి పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట… ఎమ్మెల్సీ కవితకు వసంత దంపతులు సన్నిహితులుగా మారడంతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగినట్టు తెప్పుకుంటున్నారు… కోల్డ్ వార్‌ గా మొదలైన విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయట… జగిత్యాలలో ఇటీవల నిర్వహించిన ఓ శంఖుస్థాపన కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ హాజరయ్యారు… తీరా అక్కడున్న శిలాఫలకం మీద పేరు లేకపోవడంతో ఆమె ఆవిడ వర్గీయులు ఆందోళన చేసారు. జిల్లాలో ఉన్న మూడు శాసనసభా స్థానాల్లో ఎవరికీ లేని అసమ్మతి పోరు జగిత్యాల ఎమ్మెల్యేకే ప్రారంభం కావడం వెనక అసలు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సంజయ్ కి పోటీ తయారు కావడం వెనక ఎవరున్నారు.. ఎవరి ప్రోత్సాహం, ప్రోద్భలంతో ఇలా జరుగుతోందన్నది నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌ అయింది.

జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు, జగిత్యాల ఎమ్మెల్యేకు ఎక్కడో చెడిందట…. ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ మాట్లాడుతుంటే మంత్రి స్వయంగా జోక్యం చేసుకోవడంతో కార్యకర్తలు అవాక్కయ్యారు… సంజయ్ వర్గీయులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశంలో రచ్చ జరిగింది. అప్పటికప్పుడు పరిస్థితిన చక్కదిద్దేందుకు సంజయ్ తన వర్గీయులను వారించినప్పటికీ ఆ వ్యవహారం పట్ల లోలోపల రగిలిపోతున్నారట… దానికి తోడు జడ్పీ చైర్పర్సన్ వసంతకు కొప్పుల ఈశ్వర్, జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆశీస్సులున్నాయని చెప్పుకుంటున్నారట క్యాడర్… ఇతర నియోజకవర్గాల్లో కాకుండా కేవలం జగిత్యాలలోనే ఆమె విస్తృతంగా పర్యటించడం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని బలమైన సంకేతాలు ఇవ్వడంతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఎమ్మెల్యే కొన్ని ప్రయత్నాలు కూడా చేసారట… పార్టీ పెద్దల సూచనతో కలిసి ఉన్నామని చెబుతున్నప్పటికీ లోలోపల జరిగేది జరుగుతూనే ఉందట… దీనికి తోడు మరో ఎమ్మెల్సీ ఎల్‌.రమణ కూడా జగిత్యాల నుంచి బరిలోకి దిగే యోచనలో ఉన్నారట… ఆయనకు గతంలోనే టికెట్ హామీ ఉందనే ప్రచారమూ జరుగుతోంది.

ఎమ్మెల్యే సంజయ్ కు, పార్టీ పెద్దల్లో ఒకరైన కీలక మహిళా నేతకు మధ్య గ్యాప్ ఏర్పడిందట…తాను దగ్గరుండి గెలిపించిన సంజయ్ కొన్ని సందర్భాల్లో వ్యతిరేక వ్యాఖ్యలు చేసారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అవి ఆ నోటా ఈనోటా పడి ఆమె దగ్గరకు చేరడంతో కాస్త దూరం పాటిస్తున్నారట ఆ కీలక మహిళా నేత. ఇదే అదనుగా జడ్పీచైర్మన్ దంపతులు ఆమెకు దగ్గరైనట్టు తెలిసింది… ఇటీవల ఆమెకు మద్ధతుగా డిల్లీకి కూడా వెళ్లారట జడ్పీ చైర్మన్ దంపతులు.అయితే ఎమ్మెల్యే వర్గీయులు మాత్రం పార్టీ అధిష్టానంతో వచ్చిన గ్యాప్ దాదాపు సెట్ అయినట్టేనని చెప్పుకుంటున్నారట. అధినేత నుంచి యువనేత నుంచి హామీ లభించిందని అంటున్నా… కానీ ఎమ్మెల్సీతో మాత్రం గ్యాప్ మాత్రం అలాగే ఉందట. ఆమె ఆశీస్సులు లేకుండా సంజయ్‌కుమార్‌ తిరిగి బరిలో ఉండటం సాధ్యమేనా అని క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు ఓ వైపు అధిష్టానంతో సఖ్యత లేకపోవడం… ఇంకోవైపు జడ్పీ చైర్మన్, మరోవైపు ఈ నియోజకవర్గానికే చెందిన ఎమ్మెల్సీ ఆశావహుల్లో ఉండటంతో ఎమ్మెల్యే సాబ్‌ కి ఏం చేయాలో పాలుపోవడం లేదట . పార్టీ పెద్దల ఆశీర్వాదంతో గెలిచి.. అత్యంత విధేయుడిగా పేరున్న సంజయ్… ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటారు… పూర్వపు స్థాయిలో సంబంధాలను పునరుద్దరించుకుంటారా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఓ వైపు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొంటూ… మరోవైపు సొంత పార్టీలో పోరాటం చేస్తూ ఎన్నికల సమరంలో ఎలా ముందుకు వెళతారు అనేది వేచిచూడాలి.

Show comments