Off The Record: అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో మునిగి తేలుతున్న బీఆర్‌ఎస్ అధినాయకత్వం ఈనెల 21న తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే… ఇక్కడే హాటు ఘాటు చర్చ మొదలైంది. గతంలో పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్టు సిట్టింగ్‌లందరికీ సీట్లు వస్తాయా? లేక మార్పులు ఉంటాయా? ఒకవేళ ఉంటే గింటే ఏ రేంజ్‌లో ఉండవచ్చన్నదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో నలుగుతున్న వన్ అండ్ ఓన్లీ టాపిక్. లిస్ట్ ప్రకటనకు ముహూర్తం ఖరారు కావడంతో ఒక వైపు ఆశవాహుల్లో మరోవైపు సిట్టింగ్ లలో టెన్షన్ పెరిగిపోతోంది. ఒకవేళ టిక్కెట్ నిరాకరిస్తే.. ఏ కారణాలు చెప్పవచ్చన్న చర్చను కూడా లేవనెత్తుతున్నారట కొందరు నాయకులు. 2018 ఎన్నికల టైంలో మొత్తం ఏడుగురు సిట్టింగ్‌లకు టిక్కెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ నాయకత్వం. ఇందులో ఐదుగురికి నియోజకవర్గాల్లో సానుకూల పరిస్థితులు లేకపోవడం కారణం అయితే.. మరో ఇద్దరికి అనారోగ్యం కారణంగా చూపుతూ పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఎంత మందికి సిట్టింగ్ లకు మళ్లీ చాన్స్ దక్కదోనన్న లెక్కలు వేస్తున్నారు.
2018 ఎన్నికల్లో మార్చిన ఏడుగురు కొత్త అభ్యర్థులు గెలవడంతో.. ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందా అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బిఆర్ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఎవరెవరికి ఇవ్వకూడదో ఈపాటికే కేసీఆర్ క్లారిటీకి వచ్చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఇద్దరు సిట్టింగ్‌లకు మళ్లీ ఛాన్స్ రాదంటున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ , బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్లు డిలిట్ కావచ్చన్నది పార్టీ వర్గాల అంచనా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు టిక్కెట్ రాదంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గం విషయంలో ఇంకా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పక్కన పెట్టి .. మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలని కేసిఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన బెట్టే అవకాశాలు ఉన్నాయి. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ,ఇల్లందు ఎమ్మెల్యే హరి ప్రియనాయక్‌లను తప్పించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ సిట్టింగ్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఛాన్స్ ఉండదని అంచనా వేస్తున్నాయి గులాబీ వర్గాలు. గ్రేటర్ హైదరబాద్ పరిధిలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని పక్కన పెట్టాలని బీఆర్‌ఎస్ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకూడదన్న ఉద్దేశ్యంతో పార్టీ అభ్యర్ధుల ఎంపికపై అధిష్టానం గట్టి కసరత్తే చేసింది. అందులో భాగంగానే.. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నట్టు నివేదికలు అందాయట. రకరకాల లఆరోపణలతో.. జనంలో కూడా వ్యతిరేకత ఉన్నట్టు తేలిందట. అందుకే వారిని తప్పించడం తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చిందట అధినాయకత్వం. వీరంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటే భవిష్యత్‌లో ఏదో ఒక రూపంలో అవకాశం ఇస్తామని భరోసా ఇచ్చే అలోచనలో ఉన్నారట గులాబీ పార్టీ పెద్దలు.
