టీడీపీ సీనియర్ లీడర్ బండారు సత్యనారాయణ మూర్తికి ఏ మాత్రం కాలం కలిసి రావడం లేదట. తాడే పామై కరుస్తోందని తెగ ఫీలై పోతున్నారట ఆయన. చంద్రబాబుతో సమానంగా నాదీ.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బండారుకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏ మాత్రం మింగుడుపడటం లేదంటున్నారు సన్నిహితులు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం తప్ప మరో జెండా తెలియని లీడర్‌కు ఇప్పుడు పార్టీ అధిష్టానం దగ్గరే మాట చెల్లుబాటుకాని పరిస్థితి. పెందుర్తి అసెంబ్లీ సీటుపై పట్టువీడకపోవడమే అందుకు కారణం అన్నది టీడీపీ ఇన్‌సైడ్ టాక్. గెలిచినా.. ఓడినా.. పెందుర్తినే అంటి పెట్టుకుని రాజకీయం చేస్తున్న బండారుకు ఈసారి ఊహించని షాకిచ్చింది పార్టీ అధిష్టానం. పొత్తు ఎఫెక్ట్ తన మీద పడుతుందని ముందే పసిగట్టిన మాజీ మంత్రి తన సహజ శైలికి భిన్నంగా.. రాజకీయ మనుగడ కోసం సీఎంతో పాటు మంత్రి రోజాలాంటి వారిని టార్గెట్ చేశారు. ఇంత చేసి వ్రతం చెడ్డా.. ఫలితం మాత్రం దక్కలేదాయనకు.
ఊహించినట్టుగానే 2009లో ప్రజారాజ్యం గెలిచిన సీట్లలో ఒకటైన పెందుర్తిని జనసేన పట్టుబట్టి సాధించుకుంది. ఆ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అభ్యర్ధి అయ్యారు. సరిగ్గా ఇక్కడ నుంచే బండారు ఇగో హర్ట్ అయిందట. సీటును జనసేనకు ఇవ్వడం కంటే.. తన ఒకప్పటి రాజకీయ ప్రత్యర్ధి పంచకర్ల రమేష్‌కు టిక్కెట్ ఇవ్వడం, ఆయన కోసం తాను పనిచేయాల్సి రావడంతో.. నేనేంటి నా రేంజ్ ఏంటనుకుంటూ బండారు తెగ ఫీలైపోతున్నట్టు తెలిసింది. దీంతో పెందుర్తి సీటు కోసం అధిష్టానం ఎదుట బలప్రదర్శన చేశారు. తన అల్లుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, సీట్ల సర్దుబాటు విషయంలో అప్పటికే చాలా తగ్గిన జనసేన పెందుర్తి విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అనేసిందట. అసలిక్కడ టిక్కెట్ హామీతోనే వైసీపీని వీడి గ్లాసు పార్టీలో చేరారు పంచకర్ల. ఈ క్రమంలో.. పేరుకు ఉమ్మడి అభ్య ర్ధి అయినా.. పంచకర్లతో కలిసి పనిచేసేందుకు బండారు వర్గం ముందుకు రాలేదు. సుమారు 25రోజుల పాటు ఎన్నికల ప్రచారం ఆపుకుని మరీ పంచకర్ల రమేష్ బాబు ఎదురు చూసినా బండారు వైపు నుంచి స్పందనలు కరవయ్యాయట. దీంతో ప్లాన్ బీ తో మాజీ మంత్రికి చెక్ పెట్టేశారు జనసేన అభ్యర్ధి.
వాస్తవానికి పెందుర్తి టీడీపీలో బండారుతో పాటు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి బలమైన వర్గం వుంది. టీడీపీలోని గండి వర్గం, జనసేన కలిసి ఉమ్మడిగా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డంతో బండారు వర్గం భగభగలాడిపోతోంది. అధినేతతోనే అమీతుమీ తేల్చేసుకోవాలని డిసైడై.. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన చంద్రబాబును కలిశారు. ఇక్కడ కలిశారు అనే కంటే క్లాస్ పీకడానికే పార్టీ అధ్యక్షుడు పిలిపించారు అనడమే కరెక్ట్ అని టీడీపీ వర్గాలే చెబుతున్న పరిస్థితి. సీనియర్ నేత అయిన బండారు పొత్తు ధర్మం పాటించడం లేదని.. ప్రచారానికి కాదు కదా .. కనీసం ఇల్లు కదిలేందుకు అంగీకరీంచడం లేదని, పైగా ద్వితీయ శ్రేణిని అయోమయంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దోళ్ళకి ఫిర్యాదులు వెళ్ళాయట. అది కూడా పార్టీ పరిశీలకుల నుంచి వెళ్ళడంతో బాబు సీరియస్‌గా తీసుకుని ఫైరైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇక్కడే అంతకు మించిన ట్విస్ట్ ఇంకోటి ఉంది. బండారుకు బాబు తలంటు ప్రోగ్రామ్ ముగిసిన వెంటనే జనసేన అభ్యర్ధి పంచకర్ల ఆయన్ని కలిశారన్నది పార్టీ వర్గాల సమాచారం. ఆయనకు పూర్తి భరోసా ఇచ్చిన టిడిపి అధ్యక్షుడు…. త్వర లో బండారుకు మరోషాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారన్నది ఇన్‌సైడ్ టాక్. దక్షిణ నియో జకవర్గ టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీకి మొదటి నుంచి పెందుర్తి మీదే గురి వుంది. 2029నాటికైనా తన కుటుంబానికి ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారాయన. ఇప్పుడు బండారు తెగే దాకా లాగడంతో…. పెందుర్తి ఇన్చార్జ్ గా గండిబాబ్జీ కుమారుడికి లైన్ క్లియర్ అవుతున్నట్టు తెలిసింది. అంటే పెందుర్తి సైకిల్ నుంచి ఇక పూర్తిగా బండాకు సత్యనారాయణను దించేసి… ఆ ప్లేస్‌లో గండి బాబ్జీ కుమారుడిని ఎక్కించేసినా ఆశ్చర్యం లేదంటున్నాయి టీడీపీ వర్గాలు. మరి దీన్ని అవమానంగా భావిస్తే…ఆయన టీడీపీని వీడతారా…?. లేక మనస్తాపం అన్న పేరు చెప్పి పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకుంటారా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. మరి ఫార్టీ ఇయర్స్ టీడీపీ ఇండస్ట్రీ బండారు తొలిసారి కండువా మారుస్తారా, కామైపోతారా అన్నది చూడాలి.
