కనిపెంచిన తల్లిదండ్రులను కాదని.. తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సామాజిక కట్టుబాట్లకు విరుద్దంగా వివాహం చేసుకున్నందుకు ప్రేమ జంటపై గ్రామస్తులు మండిపడ్డారు. ప్రియుడు, ప్రియురాలికి ఊహించని శిక్ష విధించారు. ప్రేమ జంటను ఎద్దుల మాదిరిగా నాగలికి కట్టి పొలం దున్నించారు. అంతటితో ఆగకుండా వారిని కర్రలతో కొడుతూ హించించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. నాగరిక సమాజంలో ఇలా అనాగరికంగా చిత్రహింసలకు గురిచేయడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
రాయగడ జిల్లాలోని కంజామఝిరా గ్రామానికి చెందిన ఆ యువకుడు, యువతి ఇటీవల ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే, ఆ యువకుడు ఆ యువతి అత్త కుమారుడు కావడంతో కొంతమంది గ్రామస్తులు వారి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వారి ఆచారాల ప్రకారం అలాంటి వివాహానికి ఒప్పుకోరు. అయినా అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ప్రేమ జంటను పొలం వద్దకు తీసుకువచ్చి నాగలికి కట్టి దున్నారు. ఆ తర్వాత దేవాలయానికి తీసుకెళ్లి శుద్ధీకరణ కర్మలు చేయించారు. కాగా ఈ మొత్తం వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది. పోలీసు సూపరింటెండెంట్ ఎస్ స్వాతి కుమార్ మాట్లాడుతూ, ఘటనపై దర్యాప్తు చేపట్టడానికి పోలీస్ బృందం గ్రామాన్ని సందర్శించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
