Nvidia: ఎన్విడియాలో మరో సంచలన ప్రేమకథ.. చైనా లింక్ ఉన్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో సీఈఓ సన్నిహితుడి రహస్య వివాహం..?

Nvidia

Nvidia

ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. సంస్థ సీఈఓ జెన్సెన్ హువాంగ్‌కు అత్యంత సన్నిహితుడు, ఎన్‌విడియా మాజీ సేల్స్ చీఫ్ అయిన భారత సంతతి ఎగ్జిక్యూటివ్ జే పూరి, సర్వర్ తయారీ సంస్థ ‘సూపర్ మైక్రో కంప్యూటర్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సెన్లీ చెన్ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఎన్‌విడియా కృత్రిమ మేధస్సు చిప్‌ల కోసం సూపర్ మైక్రో తీవ్రంగా పోటీపడుతున్న సమయంలోనే వీరిద్దరూ చాలా ఏళ్లపాటు డేటింగ్ చేశారని, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో వివాహం కూడా చేసుకున్నారని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’, ఇతర అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఎన్‌విడియాలో ప్రపంచవ్యాప్త విక్రయ విభాగానికి నాయకత్వం వహించిన జే పూరి, సూపర్ మైక్రో వంటి ప్రధాన కస్టమర్లకు చిప్‌ల సరఫరా, వాణిజ్య ఒప్పందాలను పర్యవేక్షించేవారు. అయితే.. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించి చైనాకు అక్రమంగా ఎన్‌విడియా చిప్‌లను తరలించారన్న ఆరోపణలపై సూపర్ మైక్రో సిబ్బందిపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెన్లీ చెన్, ఇతర ఉన్నతాధికారుల వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం.

ఇప్పటివరకు జే పూరిపై గానీ, సెన్లీ చెన్‌పై గానీ ఎటువంటి నేరారోపణలు నమోదు కాలేదు. ఎన్‌విడియాతో తమ సంస్థ సంబంధాలను గానీ, జీపీయూ కొనుగోళ్లను గానీ సెన్లీ చెన్ పర్యవేక్షించలేదని సూపర్ మైక్రో స్పష్టం చేసింది. ఈ ఏడాది మధ్యలో వీరిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకున్నారు; ప్రస్తుతం జే పూరి ఎన్‌విడియాకు సీనియర్ సలహాదారుగా కొనసాగుతున్నారు. ఇటీవలే సీఈఓ జెన్సెన్ హువాంగ్ వ్యక్తిగత వ్యవహారాలపై బోర్డు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో, ఎన్‌విడియా ఉన్నత స్థాయి అధికారుల ప్రవర్తన, వ్యాపార పారదర్శకతపై పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.