NTV Telugu Site icon

Top Headlines @ 5pm : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపాల్‌ ప్రధాని!

నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ మూడోసారి దేశ అత్యున్నత కార్యనిర్వాహక పదవిని చేపట్టిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటనలో త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తానని చెప్పారు. ప్రచండ గత ఏడాది డిసెంబర్ 26న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తానని ప్రచండ ప్రధానిగా ఎన్నికైన తర్వాత విలేఖరులతో అన్నారు. ఇందుకు సంబంధించి దౌత్య స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. సంబంధిత రాయబార కార్యాలయాలు తన పర్యటన కోసం సన్నాహాలు చేస్తున్నాయని ఆయన ప్రధానమంత్రి అధికారిక నివాసమైన బలువతార్‌లో విలేకరులతో అన్నారు.

అయితే ప్రధాని భారత పర్యటనను నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పర్యటన తేదీ, ప్రయాణం ఇంకా ఖరారు కాలేదు. ప్రధాని పర్యటన తేదీ, వివరణాత్మక కార్యక్రమాలతో పాటు పర్యటన ఎజెండాను ఖరారు చేయడానికి కృషి చేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఒక అధికారి తెలిపారు. ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత పొరుగు దేశాన్ని సందర్శించడం సాధారణ ప్రక్రియ అని ఆయన వెల్లడించారు. ప్రచండ అంతకుముందు నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా భారతదేశానికి అధికారిక పర్యటనలు చేశారు. గతేడాది జూలైలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వానం మేరకు ప్రచండ భారత్‌లో పర్యటించారు.

సామాన్యులకు ఊరట.. తగ్గుతున్న ద్రవ్యోల్బణం

భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి 2023 నాటికి ఐదు శాతానికి తగ్గుతుంది. ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. నివేదిక ప్రకారం.. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ నిర్ణయించిన 6 శాతం కంటే తక్కువగానే ఉంటుందని అంచనా.జనవరి-మార్చి 2023లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతంగా ఉంది. గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం డిసెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 శాతంగా ఉంది. తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.డిసెంబర్ తో పోలిస్తే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గుముఖం పట్టనుంది.రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 6.77 శాతం నుంచి నవంబర్‌లో 5.88 శాతానికి తగ్గింది. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబరు వరకు మూడు త్రైమాసికాల్లో 6 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఇది ఆర్‌బీఐ నిర్దేశించిన స్థాయి కంటే ఎక్కువ.

సంక్రాంతి దర్శకుల ఎమోషనల్ లెటర్స్…

023కి గ్రాండ్ ఓపెనింగ్ ని, సంక్రాంతికి అదిరిపోయే సంబరాలని ఇచ్చాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. చిరు, బాలయ్యలు నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకూ, సీ సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకూ ప్రతి చోటా హౌజ్ ఫుల్ బుకింగ్స్ రాబడుతున్నాయి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి థియేటర్స్ కి వస్తుండడంతో ఈ సినిమాల కలెక్షన్స్ ఇప్పట్లో డ్రాప్ అయ్యేలా కనిపించట్లేదు. గత మూడు సినిమాలుగా నిరాశ పరుస్తున్న చిరంజీవి, వీల్తేరు వీరయ్యతో హిట్ లోటు తీర్చేయ్యగా… తనకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ జోనర్ లో మరోసారి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’గా కనిపించి హిట్ కొట్టాడు. ఈ రెండు సినిమాలని అంత గొప్పగా తెరకెక్కించిన ఇద్దరు దర్శకులు బాబీ మరియు గోపీచంద్ మలినేని. మెగా ఫ్యాన్ అయిన బాబీ ‘వాల్తేరు వీరయ్య సినిమాని’ మెగా అభిమానులకి గిఫ్ట్ గా ఇవ్వగా బాలయ్య ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని ‘వీర సింహా రెడ్డి’ సినిమాని మాస్ ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు.

నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. 72 మంది మృతి

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా.. ఓ విమానం అదుపుతప్పి నదిలోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 72 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. . దేశ రాజధాని ఖాట్మాండు నుంచి బయలుదేరిన విమానం పొఖారాలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో ఫ్లైట్‌లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ప్రకటించారు. కూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుంది. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఎయిర్ పోర్టును మూసేశారు. ప్రమాదంలో చాలా మంది వరకు చనిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంక్రాంతి ఎఫెక్ట్.. బోసిపోయిన భాగ్యనగరం.. రోడ్లన్నీ నిర్మానుష్యం

భాగ్యనగరం మొత్తం ఖాళీ అయిపోయింది. రోడ్లన్నీ జనంతో నిర్మానుష్యంగా మారాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులంతా స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం కానున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. నిన్న వాహనాలతో కిక్కిరిసిన రోడ్లు నేడు ఖాళీగా ఉన్నాయి. వ్యక్తిగత వాహనాలే కాకుండా ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో పండుగకు రెండు, మూడు రోజుల ముందు నుంచే నగరవాసులు తమ ఇళ్లకు బయలుదేరారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్లతో పాటు అన్ని రోడ్లు వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా విజయవాడ, బెంగళూరు, వరంగల్ హైవేల టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి.

చావు సెలబ్రేషన్స్ ముందే ప్లాన్ చేసుకున్న మహిళ

ఓ మహిళ చనిపోయింది.. అందరూ విషాదంలో ఉన్నారు.. కొందరైతే ఆగకుండా కన్నీళ్లుపెట్టుకుని ఏడుస్తున్నారు. ఇంతలో ఆ గుంపులోనుంచి ఓ నలుగురు లేచి ముందుకు వచ్చారు. డెత్ ప్రిపరేషన్స్ ఏమైనా చేస్తారేమో అనుకున్నారంతా. కానీ సడన్ గా డ్రస్సులు మార్చుకుని డ్యాన్స్ వేయడం మొదలు పెట్టారు. అంతా దిగ్ర్బంతి చెందారు.. ఏం జరుగుతుందో తెలియక అందరూ షాక్ కు గురయ్యారు. తీరా విషయం తెలుసుకున్నాక.. అయ్యో అంటూ నిట్టూర్చారు.ఇంతకీ అక్కడేం జరిగిందంటే.. ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన శాండీ వుడ్ తన 65ఏళ్ల వయసులో మరణించింది. తాను మరణించేకంటే ముందే డ్యాన్స్ చేస్తూ అందరినీ షాక్‌కు గురిచేసేలా డ్యాన్స్ ట్రూప్‌ని సిద్ధం చేసి చనిపోయింది.

దావోస్‌ వేదికగా ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్.. పాల్గొననున్న మంత్రులు

స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా సోమవారం ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ ప్రారంభం కానుంది. జనవరి 16 నుంచి 20 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి ప్రపంచంలోని ముఖ్యనేతలతో పాటు పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ, వ్యాపార నాయకులు హాజరుకానున్నారు. ఈ ఏడాది ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ థీమ్‌ ‘విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం’ అని నిర్ణయించారు.

ఈ సమ్మిట్‌లో ప్రపంచం ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం, ప్రపంచ ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పు వంటి కొన్ని ముఖ్యమైన సమస్యలను చర్చించనున్నారు. ఈ సమ్మిట్‌ వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించనున్నారు. ఈ సమ్మిట్‌కు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెట్సోలా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ ఎం రామఫోసా, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్, స్విస్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్, ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్‌తో పాటు పలువురు ప్రపంచ నేతలు పాల్గొననున్నారు.