*ఉమ్మడి ఏపీ భవన్ విభజన, తెలంగాణ భవన్ నిర్మాణంపై సీఎం సమీక్ష
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ ఢిల్లీలోని తన నివాసంలో ఈ అంశంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత….? అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడి హౌస్ ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ వాటా కింద ఎంత భూమి వస్తుందని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని, ఏపీకి 11.536 ఎకరాలు (41.68:58.32 నిష్పత్తి లో) వెళుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని సీఎం అన్నారు. అంతకుముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలుసూచనలు ఇచ్చారు.
*తెలంగాణలో 20 మంది ఐపీఎస్ లు బదిలీ.. రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా అంజనీ కుమార్
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐపీఎస్ లను బదిలీ చేసింది. 20 మంది ఐపీఎస్ లు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. డీజీపీగా రవిగుప్తాను కొనసాగించింది. రోడ్‌సేఫ్టీ డీజీగా అంజనీకుమార్.. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్.. రైల్వే డీజీగా మహేష్ భగవత్.. సీఐడీ చీఫ్‌గా శిఖాగోయల్.. జైళ్లశాఖ డీజీగా సౌమ్యామిశ్రా.. ఎస్‌ఐబీ చీఫ్‌గా సుమతి.. సీఐడీ డీఐజీగా రమేష్‌నాయుడు.. సెంట్రల్‌జోన్ డీసీపీగా శరత్‌చంద్ర.. కార్ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణ, అప్పా డైరెక్టర్‌గా అభిలాష్, మల్టీ జోన్ ఐజీగా తరుణ్‌జోషి, ప్రొబేషన్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండీగా రాజీవ్ రతన్, టీఎస్‌పీఎస్సీ డీజీగా అనిల్ కుమార్, ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్, ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డ్ అడిషనల్ డైరెక్టర్‌గా ఎం.రమేష్, ఎం.శ్రీనివాసులును డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
*కేటీఆర్ కామెంట్స్‌కు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్ అటాక్
కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడిన వీడియో అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల్లో ఓట్ల కోసం అది ఇస్తాం.. ఇది ఇస్తాం అంటాం. అంత మాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. కానీ అయితే డబ్బులు లేవు’ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టుగా ఉన్న వీడియో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ షేర్ చేస్తూ సటైర్లు విసిరారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇంతేనా? అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక కేటీఆర్ కామెంట్స్‌పై తాజాగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఘాటుగా స్పందించారు. కేటీఆర్ షేర్ చేసిన వీడియోను ఆయన కొట్టిపారేశారు. ‘కేటీఆర్.. తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? ఎందుకంటే ఏది ఫేక్ వీడియోనో.. ఏది ఒరిజినల్ వీడియోనో కూడా మీరు తేల్చుకోలేకపోతున్నారు. ఫేక్ వీడియోలను బీజేపీ సృష్టిస్తుంటే.. వాటిని మీరు ప్రచారంలోకి తెస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి నిజమైన బీ టీంగా వ్యవహరిస్తోందని మరోసారి రుజువు చేశారుజ’ అంటూ సిద్దరామయ్య కేటీఆర్‌కు రీకౌంటర్ ఇచ్చారు.
*న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
కొత్త సంవత్సరంలో అడుగుపెట్టోందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. మరో పది రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. దీంతో ప్రజలంతా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు న్యూ ఇయర్ వేడుకులపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు ప్రజలకు, ఈవెంట్ నిర్వహకులకు పలు నిబంధనలు జారి చేశారు. ‘న్యూఇయర్ వేడుకలను రాత్రి 1 గంటల వరకు ముగించాలి. ఈవెంట్ నిర్వహకులు పది రోజుల ముందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. ప్రతీ ఈవెంట్‌ల ముందు సీసీ కెమెరాలు తప్పనిసరిగా అమర్చాలి. ప్రతి ఈవెంట్స్‌లో సెక్యూరిటీ తప్పనిసరి. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు. 45 డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్ధం ఉండొద్దు. కెపాసిటీ మించి పాసులు ఇవ్వొద్దు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కల్పించొద్దు. లిక్కర్ ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు. సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయొద్దు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు పడితే పదివేల రూపాయల జరిమానాలతో పాటు ఆరు నెలల జైలు శిక్ష.. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ చేస్తాం’ అని పోలీసులు హెచ్చరించారు.
*వైసీపీలో వేగంగా ఎమ్మెల్యేల మార్పు కసరత్తు.. సిట్టింగ్‌ల చివరి ప్రయత్నాలు!
ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికల సమరం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలతో పాటు ఎమ్మెల్యేల అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. వైసీపీలో ఎమ్మెల్యేల మార్పు కసరత్తు వేగంగా జరుగుతోంది. సీట్ పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు కాకుంటే తమ ఫ్యామిలీలోనే సీట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని కోరుతున్నారు. అసెంబ్లీ సీట్లు వదులుకునేందుకు ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు. అరకు ఎంపీ అభ్యర్ధిగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజును పార్టీ ఎంపిక చేయగా.. పార్టీ ప్రతిపాదనకు అంగీరిస్తూనే పోలవరం సీట్ తన భార్యకే ఇవ్వాలని బాలరాజు పట్టుబడుతున్నట్లు తెలిసింది. పత్తిపాడులోనూ అదే సీన్ జరిగినట్లు తెలుస్తోంది. పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్‌ను పక్కన పెట్టేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. సీటు పోతోందని క్లారిటీకి వచ్చిన పూర్ణ చంద్రప్రసాద్.. తను తప్పుకోడానికి అంగీకారమేనని.. అయితే తన ప్లేస్‌లో తన భార్యకే సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ రెండు సీట్ల దగ్గరే సమస్య వచ్చిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు తేలితే…. ఉభయగోదావరి జిల్లాల్లో మార్పులు, చేర్పులపై పార్టీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎమ్మెల్యే అయినా… ఎమ్మెల్యే ఫ్యామిలీ అయినా వ్యతిరేకతకు ఒక్కటేననే భావనలో వైసీసీ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దలు నచ్చచెబుతున్నారు. పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యమని, అనంతరం వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని బుజ్జగిస్తున్నారు. సున్నితంగా హ్యాండిల్ చేయాలని జగన్ సూచిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు తాడేపల్లి నుంచి కబురు రాగా.. జోన్ల వారీగా తొలగింపు ఎమ్మెల్యేల జాబితాను సీఎం జగన్ సిద్ధం చేసుకున్నారు. తర్వాత రాయలసీమ గురించి ఆలోచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నెగిటివ్ ప్రభావం ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తేనే గెలుస్తాం అనే గట్టి అభిప్రాయంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. పని తీరు మార్చుకోవాలని చాలా సార్లు జగన్ హెచ్చరించారు. కొంత మంది ఎమ్మెల్యేల ప్లస్‌లు, మైనస్‌లు స్వయంగా చెప్పినా.. తీరు మార్చుకోని వారిపైనే వేటు పడినట్లు సమాచారం. ఉమ్మడి ఏపీలోకానీ, రాష్ట విభజన తర్వాత కానీ ఎప్పుడూ ఈ స్థాయిలో సిట్టింగ్‌లను అధికార పార్టీలు మార్చలేదు. ఎమ్మెల్యేల మీద స్థానిక వ్యతిరేకత, నియోజకవర్గ స్థాయిలో నేతలతో విభేదాలు, టీడీపీ-జనసేన పొత్తులో పోటీకి వచ్చే అభ్యర్థులను ఈ సమీకరణలలో జగన్ ముఖ్యంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన కూటమికి చెక్ పెట్టేలా సామాజిక సమీకరణలతో ఎమ్మెల్యేల మార్పు, తొలగింపు, కొత్త అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.
*యాంకర్ స్థాయికి జనసేన అధినేత దిగజారిపోయారు..
నారా లోకేష్ పాదయాత్ర ఆపసోపాలు పడుతూ ముగిసిందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర ఏ ప్రభావం లేని యాత్ర అని.. పాదయాత్ర తర్వాత కూడా లోకేష్‌లో ఏం మార్పులేదన్నారు. లోకేష్ యాత్ర వల్ల ఒళ్ళు తగ్గింది తప్ప బుర్ర పెరగలేదని అన్నారు. లోకేష్ సభకు కాస్ట్ లీ యాంకర్లు వస్తున్నారని.. మీసం తిప్పి హాస్యం చేయటంలో బాలయ్యను మించిన వారు లేరన్నారు. పవన్ మరింత కాస్ట్ లీ యాంకర్ అని.. నోట్లు, సీట్ల కోసం మాత్రమే దత్త పుత్రుడు పవన్ అనే యాంకర్ వస్తున్నాడని విమర్శించారు. అసమర్థ కొడుకు కోసం వృద్ద తండ్రి చంద్రబాబు పడుతున్న పాట్లు చూస్తే జాలి కలుగుతోందన్నారు. లోకేష్‌లో మెటీరియల్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. శునకాన్ని కనకపు సింహాసనం మీదు కూర్చోబెట్టేందుకు తండ్రి ప్రయత్నిస్తున్నాడని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. దత్త పుత్రుడు పవన్ యాంకరింగ్ ఎందుకు చేస్తున్నారని.. లోకేష్ సభకు పవన్ మొదట రాను అన్నారని మంత్రి తెలిపారు. నాదెండ్లతో అడిగినా పవన్ నో అన్నారని.. పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లి నోట్లు, సీట్లు మాట్లాడుకున్నారన్నారు. అందుకే రేపు మీటింగ్‌కు పవన్ కిరాయి తీసుకుని వెళ్తున్నాడన్నారు. పవన్ దిగ జారుడుతనం అందరూ గుర్తించాలన్నారు. రేపటి సభ చాలా కామెడీగా ఉంటుందని.. సోదరుడికి చౌదరులు పదానికి లోకేష్‌కి తేడా తెలియదన్నారు. అశుభాలతో అట్టర్ ఫ్లాప్ షో యువగలమని ఆయన అన్నారు. పవన్ సూట్ కేసులు మోసేది నాదెండ్ల అంటూ మంత్రి పేర్కొన్నారు. వైసీపీలో అంతర్గతంగా మార్పులు చేర్పులు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. “శాస్త్రీయంగా ఆలోచన చేసి జగన్ మార్పులు చేస్తున్నారు. 175 గెలవటం ఎలా అనే వ్యూహంతో వెళ్తున్నాం. ఫలితాలు ఎన్నికల తర్వాత చూస్తారు. మార్పు జరిగింది అసంతృప్తి అంటున్నారు కానీ అసంతృప్తి లాంటివి ఏం లేవు. 175 సీట్లతో జగన్ మళ్లీ సీఎం అవుతారు. 151 లాభం లేదని 175 కోసం చేస్తున్నారు.” అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
*ప్రధాని అభ్యర్థిగా ఖర్గేను తిరస్కరించిన ఇండియా కూటమి
ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా కూటమి’ సమావేశం ముగిసింది. ఈ నెల 22 న దేశవ్యాప్త ఆందోళనకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది. పార్లమెంట్ లో అధికార పార్టీ వ్యవహారానికి నిరసనగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఈ సమావేశంలో భారత కూటమి ప్రధాని అభ్యర్థిపై చర్చించారు. మల్లిఖార్జున్ ఖర్గే ప్రధానిగా పోటీ చేస్తారా అనే అంశంపై మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను తెచ్చారు. ఈ సమయంలో మమతా బెనర్జీ మల్లికార్జున్ ఖర్గేని ప్రధానమంత్రి అభ్యర్థిగా చేయాలని ప్రతిపాదించారు. దీనికి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. మరోవైపు.. ఈ ప్రతిపాదనను ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు ఆమోదించలేదు. సమావేశం అనంతరం మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ సమావేశంలో 28 పార్టీలు పాల్గొన్నాయన్నారు. కూటమి ముందు నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసి పనిచేయాలి.. సమస్యలను లేవనెత్తాలన్నారు. దేశవ్యాప్తంగా కనీసం 8-10 సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రధాని ఎవరో “ఇండియా” కూటమి అంతర్గత వ్యవహారమని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తామని ఖర్గే అన్నారు. ఎన్నికల్లో గెలవడమే మా ముందున్న కర్తవ్యం, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఖర్గే తెలిపారు. కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. డిసెంబర్ 31 కల్లా సీట్ల సర్దుబాటు పై నిర్ణయం తీసుకుంటామన్నారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియ సత్వరమే ప్రారంభమౌతుందని తెలిపారు. అనంతరం.. సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. సమావేశం విజయవంతంగా ముగిసిందని తెలిపారు. సీట్ల సర్దుబాటు సత్వరమే పూర్తి కావాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎంపీల సస్పెన్షన్ ప్రజాస్వామ్యం పై దాడి అని అన్నారు. ఎంపీల సస్పెన్షన్ పై దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చినట్లు రాజా పేర్కొన్నారు.
*పీరియడ్స్ నొప్పి.. భరించలేక గర్భనిరోధక మాత్రలు.. 16 ఏళ్ల బాలిక బ్రెయిన్ డెడ్
నెలసరి వల్ల వచ్చే నొప్పి భరించలేక ఓ బాలిక గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. ఆ తరువాత తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె చివరకు బ్రెయిన్ డెడ్‌తో కన్నుమూసింది. అత్యంత విషాదకర ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. యూకేకు చెందిన లైలా ఖాన్ (16) కొద్ది నెలల క్రితం విపరీతమైన పీరియడ్స్ నొప్పితో బాధపడింది. తన బాధను స్నేహితులతో పంచుకోగా గర్భనిరోధక మాత్రలు తీసుకోమ్మని సూచించారు. స్నేహితుల సలహా మేరకు ఆమె నవంబర్ 15 నుంచి గర్భనిరోధక మాత్రలు (Contraceptive Pills) తీసుకోవడం ప్రారంభించింది. మాత్రలు తీసుకున్న 10 రోజులకే లైలా తీవ్ర అస్వస్థతకు గురైంది. తరచూ వాంతులు చేసుకోవడం, తీవ్ర కడుపు నొప్పితో బాధపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరిక్షించిన వైద్యులు కడుపులో ఫుడ్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ అయ్యింటుందని అనుమానించి దాని తగిన ట్రీట్‌మెంట్ చేసి ఇంటికి పంపించారు. పరిస్థితి మెరుగు కాకపోతే మళ్లీ ఆసుపత్రికి తీసుకురావాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అదే రోజు రాత్రి లైలా ఆరోగ్యం మరింత క్షీణించింది. వాంతి చేసుకోవడానికి బాత్రూమ్‌కు వెళ్లిన బాలిక అక్కడే కుప్పకూలిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిట్‌కు తరలించారు. వైద్యులు ఆమెకు సీటీ స్కాన్ నిర్వహించి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టినట్టు చెప్పారు. డిసెంబర్ 13న ఆమెకు ఆపరేషన్ నిర్వహించి వైద్యులు భయపడాల్సిందేమి లేదని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కానీ శస్త్ర చికిత్స జరిగిన రెండో రోజుకే లైలా మరణించింది. ఆమెది బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. క్రిస్మస్ పండుగ వేళ లైలా మరణం ఆమె కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇంత దుఃఖంలోనూ లైలా కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయినా తమ కూతురి అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు మరికొందరికి ప్రాణం పోశారు.
*డంకీ రిలీజ్ కి ముందు షాక్.. షారుఖ్ భార్యకి ఈడీ నోటీసులు
షారుఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న డంకీ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉంటే సినిమా విడుదల కాకముందే షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పై ఈడీ పట్టు బిగించడం హాట్ టాపిక్ అయింది. అయితే ఇది సినిమాల విషయం కాదండోయ్ అసలు ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం? నిజానికి, గౌరీ ఖాన్ లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ తులసియానీ గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్. అయితే అదే గ్రోప్ ఇప్పుడు ఇన్వెస్టర్లు, బ్యాంకుల నుంచి సుమారు రూ.30 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్ షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ కూడా ఈడీ స్కానర్ కిందకు రానున్నారు. అయితే దీనిపై గౌరీ ఖాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందున, ఆమెను అనేక కోణాల్లో ప్రశ్నించవచ్చు. ఆ కంపెనీతో గౌరీకి ఉన్న కాంట్రాక్ట్ ఎలా ఉంది? అలాగే ఆమెకు ఎంత డబ్బు చెల్లించారు లాంటివి విషయాలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది గౌరీ ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారు ఈ కంపెనీపై నివేదికను దాఖలు చేయడమే కాకుండా, సీఎండీ మరియు డైరెక్టర్‌తో పాటు గౌరీ ఖాన్‌పై మోసం కేసు వేశారు.గౌరీ ఖాన్ ఇటీవల ఆమె కుమారుడు అబ్రామ్ ఖాన్ వార్షిక కార్యక్రమంలో కనిపించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు, షారుఖ్‌తో కలిసి ఈవెంట్‌లలో ఆమె తరచుగా కనిపిస్తుంది.
*ప్రభాస్ ఫాన్స్ కి బంపర్ న్యూస్.. ఈ 20 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంటకే సలార్!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ని పలకరించబోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా యాక్షన్ ట్రైలర్ ఆడియన్స్ లో సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీ బుకింగ్స్ ని ఎప్పుడు ఓపెన్ చేస్తారా..? ఎప్పుడు టికెట్స్ కొనుగోలు చేద్దామా అని ఎదురు చూస్తున్నారు ఫాన్స్. అంతేకాదు స్పెషల్ షోలు ఏమన్నా ఉంటాయా అని వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చారు. మొదటిరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆరు షోలు పడబోతున్నాయి. ఇక 20 సెలెక్టెడ్ థియేటర్లలో తెల్లవారుజామున ఒంటిగంట షో కూడా వేయనున్నారు. ఇక టికెట్ రేట్లు విషయానికి వస్తే.. సింగిల్ స్క్రీన్స్ లో 250, 175, 100 రేట్లు, మల్టీఫెక్స్ ల్లో 370, 470 ధరతో టికెట్స్ అమ్మాలని నిర్ణయించారు. అంటే సాధారణ టికెట్ రేట్లతో పోలిస్తే మల్టీఫెక్స్ ల్లో రూ.100, సాధారణ థియేటర్లలో రూ.55 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో థియేటర్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకోగా థియేటర్ల లిస్టు ఇప్పుడు చూద్దాం.
కింది 20 థియేటర్లలో తెల్లవారుజామున 1 గంటలకు సాలార్ షోలను ప్రదర్శించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
1) నెక్సస్ మాల్, కూకట్‌పల్లి
2) AMB సినిమాస్, గచ్చిబౌలి
3) బ్రహ్మరాంబ థియేటర్,
కూకట్‌పల్లి
4) మల్లికార్జున థియేటర్, కూకట్‌పల్లి
5) అర్జున్ థియేటర్, కూకట్‌పల్లి
6) విశ్వనాథ్ థియేటర్, కూకట్‌పల్లి
7) సంధ్య 70MM, RTC X రోడ్స్
8) సంధ్య థియేటర్ 35MM, RTC X రోడ్స్
9) రాజధాని డీలక్స్, దిల్ సుఖ్ నగర్
10) శ్రీరాములు థియేటర్, మూసాపేట
11) గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ
12) శ్రీ సాయి రామ్ థియేటర్, మల్కాజిగిరి
13) SVC తిరుమల థియేటర్, ఖమ్మం
14) వినోద థియేటర్, ఖమ్మం
15) వెంకటేశ్వర థియేటర్, కరీంనగర్
16) నటరాజ్ థియేటర్, నల్గొండ
17) SVC విజయ థియేటర్, నిజామాబాద్
18) వెంకటేశ్వర థియేటర్, మహబూబ్‌నగర్
19) శ్రీనివాస థియేటర్, మహబూబ్ నగర్
20) రాధిక థియేటర్, వరంగల్
