*బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ రైతు బిడ్డదే..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చేసింది. బిగ్ బాస్ 7 విజేత ఎవరో మరికొద్ది సేపట్లో తెలిసిపోనుంది.బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. బిగ్ బాస్ సీజన్ 7టైటిల్ కోసం అర్జున్, ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్ దీప్ మరియు ప్రియాంక పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఫైనల్ కి చేరిన 6 గురిలో అత్యధిక ఓట్లు సాధించిన ప్రల్లవి ప్రశాంత్ కే బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ దక్కింది.. అయితే చివరి వరకు శివాజీ,అమర్ గట్టి పోటీ ఇవ్వగా విజేతగా మాత్రం పల్లవి ప్రశాంత్ నిలిచాడు. దీనితో బిగ్ బాస్ లో తొలిసారి ఈ ఘనత సాధించిన సామాన్యుడిగా ప్రశాంత్ రికార్డ్ సృష్టించారు. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడంతో అతడికి 50 లక్షల నగదుతో పాటు మారుతి కారు మరియు 15 లక్షల విలువైన బంగారం దక్కనుంది. పల్లవి ప్రశాంత్ సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టాడు. హౌస్ లో వున్న వారందరితో ఎన్ని ఇబ్బందులు తలెత్తిన కూడ ప్రశాంత్ ఎప్పుడూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా అమర్ దీప్ తో హౌస్ లో ప్రశాంత్ కి సమస్యలు వస్తున్నప్పటికీ ప్రశాంత్ వీలైన మేరకు ఎంతో కూల్ గా డీల్ చేస్తూ ఎంతో చక్కగా తన గేమ్ ను ఆడాడు.. ప్రతి టాస్క్ ను ఎంతో చక్కగా పూర్తి చేసాడు.దీనితో క్రమంగా ప్రశాంత్ గురించి ఆడియన్స్ చర్చించుకుంటూ వచ్చారు.అలాగే హౌస్ శివాజీ సపోర్ట్.. అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకలతో జరిగిన గొడవలు పల్లవి ప్రశాంత్ కి పాజిటివ్స్ గా మారాయి. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ పల్లవి ప్రశాంత్ కు బాగా వర్కౌట్ అయింది. అందుకు తగ్గట్లుగానే ప్రశాంత్ హౌస్ లో మాట్లాడుతూ వచ్చాడు. దీనితో ఆడియన్స్ రైతు బిడ్డకి ఓట్లు గుద్దేశారు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ వచ్చి బిగ్ బాస్ 7 టైటిల్ గెలుచుకున్నాడు..
*మాకిదంతా కొత్తగా ఉంది… పొలం పని కూడా చేసుకోనివ్వట్లేదు.. పల్లవి ప్రశాంత్ తండ్రి ఎమోషనల్
‘బిగ్ బాస్’ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే లైవ్ 7 గంటల నుంచి ప్రసారం అవుతోంది. నిన్న షూట్ చేసిన కంటెంట్ ను ఈరోజు టెలికాస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు నాగార్జున 10 గంటలకు విజేతను ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక ఈ బిగ్ బాస్ 7 స్టేజ్ మీద ఒక పక్క ఎలిమినేట్ అయిన వారి డాన్సు పర్‌ఫెర్మెన్స్ లే కాదు, హౌజ్‌లో టాప్ 6 లో ఉన్న హౌజ్ మేట్స్ కూడా డాన్సు పర్‌ఫెర్మెన్స్ లతో ఉర్రూతలూగించారు. ఇక యావర్, శివాజీ, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, అర్జున్, అమర్ దీప్‌లు తమదైన పాటలతో డాన్సులు చేసి మెప్పిస్తూ ఫినాలేకి మరింత ఊపు తీసుకొచ్చారు. అయితే ఈ సీజన్ విన్నర్ అని ప్రచారం జరుగుతున్న పల్లవి ప్రశాంత్ గురించి కాకినాడ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి జనాలు వస్తున్నారని ఆయన తండ్రి చెప్పారు. ఒక పక్క తమ పనులు ఆగిపోతున్నా.. తమ అబ్బాయిపై వారు ప్రేమ చూపుతున్నారనేది తమకు ఆనందం కలిగిస్తోందని ఆయన అన్నారు.. ముందు తాము ఎవరికీ తెలియమని, ఇప్పుడు తాము లక్షల మందికి తెలిశామని ఆనందం వ్యక్తం చేశారు పల్లవి ప్రశాంత్ పేరెంట్స్, తమకు ఇది ఏమీ తెలియదని, ఇప్పుడు తమని చూసేందుకు అందరూ వస్తున్నారని, పొలం పనులు చేసుకోనివ్వడం లేదని వెల్లడించారు. అంతేకాదు ఇంత పేరు రావడం ఆనందంగా ఉందని వారు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక ఇక తాను ఒక సీక్రెట్ చెప్పబోతున్నా అని అంటూ 3 నెలల కిందనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు. శివాజీ వెళ్లను అంటే రివర్స్‌లో నువ్వు వెళ్లలేవు, ఆడలేవు అన్నా, అందుకే, పట్టుదలతో నాన్న బిగ్ బాస్‌కు వెళ్లారని శివాజీ చిన్న కొడుకు చెప్పాడు.
*తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ..
తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్‌గా విశ్వప్రసాద్.. హైదరాబాద్ క్రైమ్ చీఫ్‌గా ఏవీ రంగనాథ్.. వెస్ట్‌జోన్ డీసీపీగా విజయ్‌కుమార్.. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ చీఫ్‌గా జ్యోయల్ డెవిస్.. నార్త్‌జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని.. డీసీపీ డీడీగా శ్వేత.. ట్రాఫిక్ డీసీపీగా సుబ్బరాయుడు.. టాస్క్‌ఫోర్స్ డీసీపీ నిఖితపంత్, సిట్ చీఫ్ గజారావు భూపాల్‌ను డీజీపీ ఆఫీస్‌కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
*ఈనెల 21న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్..
ఈనెల 21న కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ కు కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలతో పాటు.. కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా.. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
*40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు.. నేడు గజగజ వణికి పోతున్నాడు..
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ కార్యదర్శి నారా లోకేష్‌లపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణు. లోకేష్ పాదయాత్ర లావు తగ్గడానికేననని ఆయన విమర్శించారు. లోకేష్‌ది క్యాట్ వాక్ అని, లోకేష్ పాదయాత్ర వద్దని ఆ పార్టీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పాడన్నారు. పాదయాత్రకే విలువలేదు, లోకేష్ రాసుకున్న ఎర్ర బుక్కు ఏం చేసుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. గత పాలకులు ఇచ్చిన మాటలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయన్న మంత్రి చెల్లుబోయిన వేణు.. గతంలో సామాజిక న్యాయం అనేది ఎండమావి.. నేడు నిండు కుండ అని అన్నారు. గత పాలకులు ఎస్సీలను వివక్షతో చూశారన్నారు. గత పాలకులు అనేక వర్గాల పేదలను వివక్షతో చూశారని ఆయన మండిపడ్డారు. దళారులు లేకుండా పేదవారి గడపలకు సంక్షేమాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేర్చారని ఆయన చెప్పారు. పేదవారు మోసపోకుండా అవినీతి అనే పదానికి తావు లేకుండా.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారన్నారు. రూ. 2 లక్షల60 వేల కోట్లు నేరుగా పేదలకు ఖాతాలకు సీఎం చేర్చారన్నారు. గతంలో పాలకులు ఐదేళ్ల తర్వాత హామీల గురించి ఆలోచించేవారని.. అధికారం చేపట్టిన మొదటి రోజు నుండే ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టిన నాయకుడు సీఎం జగన్ అంటూ మంత్రి పేర్కొన్నారు. పదవుల్లోనే కాదు ప్రజా అవసరాలను తీర్చడంలో సంక్షేమానికి పెద్దపీటవేశారన్నారు. అమలు చేసేవాడు మంచి వాడైతేనే పేదలకు మేలు జరుగుతుంది అన్న అంబేద్కర్ ఆశయాలను నిజం చేశారని చెప్పారు. పేదవాడికి విద్య అనేది పెద్ద ఆయుధం అని అంబేద్కర్ అన్నారని మంత్రి వెల్లడించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు నేడు గజగజగజ వణికి పోతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి ప్రజలను ఎలా మోసం చేయాలో అని ఆలోచిస్తున్నాడని.. ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. మోసానికి ఒక చిరునామా అబద్ధానికి ఒక చిరునామా వంచనకు ఒక చిరునామా చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. నైతిక విలువలు లేని నాయకుడు అధికారం కోసం ఎంత స్థాయికి అయిన దిగజారే వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. విలువలే పెట్టుబడిగా సత్యమేవ జయతే అన్న రీతిలో పాలన సాగిస్తున్న నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంటూ పేర్కొన్నారు. మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. ” గతంలో పిల్లలు బడిబాట పట్టేవారు కాదు గొప్ప సంస్కర్తగా పాలన నిర్ణయాలు తీసుకుని విద్యకు పెద్దపీద్ద వేశారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డ.. 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాడు సీఎం జగన్. కరోనాలో నువ్వు, నీ కొడుకు, నీ దత్తపుత్రుడు ఎక్కడున్నారు. సంస్కర్తకు సాధికారత యాత్ర ఒక సలాం కొడుతుంది. కష్టంలో ఉన్న ప్రజలకు సంరక్షించే సంస్కర్త సంస్కారిగా సంరక్షకుడుగా మారి ఈనాడు పాలన సాగిస్తున్నాడు. చంద్రబాబు హయాంలో పట్టిసీమ, పోలవరం, అమరావతి అంతా అవినీతి.. చంద్రబాబు ఏ స్కీం తీసుకున్న అంతా స్కామే. రూ. 2,60,000 కోట్లు పేదలకు పంచాడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.” అని మంత్రి తెలిపారు.
*మంచి మనసు చాటుకున్న ప్రధాని మోడీ.. కాన్వాయ్‌ను ఆపి..!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కకి మళ్లించారు. ఈ ఘటన ఆదివారం (డిసెంబర్ 17) వారణాసిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెట్టింట హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాని మోడీ అంబులెన్స్‌కు దారి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అహ్మదాబాద్, హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలోనూ ప్రధాని తన కాన్వాయ్‌ను ఆపి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో ఉన్నారు. అదివారం తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సమయంలో అటువైపుగా అంబులెన్స్ రావడంను మోడీ గుర్తించారు. ఆ అంబులెన్స్‌కు మార్గం కల్పించేందుకు తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కకి మళ్లించాలని భద్రతా అధికారులకు సూచించారు. వెంటనే సిబ్బంది అంబులెన్స్‌కు మార్గం సుగమం చేయడంతో అంబులెన్స్ ఎలాంటి ఆటకం లేకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2019లో ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతుండగా.. కవరేజీకి వచ్చిన ఓ ఫొటోగ్రాఫర్ కుప్పకూలిపోవడంతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 2022 సెప్టెంబర్ 30న ప్రధాని కాన్వాయ్ గుజరాత్‌లోని ప్రధాన అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు రహదారిపై ఆగిపోయింది. ప్రధాని మోడీ అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 2022 నవంబర్ 9న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలోని ర్యాలీ నుండి తిరిగి వస్తుండగా అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి మోడీ తన కాన్వాయ్‌ను ఆపారు.
*పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై స్పదించిన మమతా బెనర్జీ!
ఇటీవల పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశం అని, పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఇప్పటికే అంగీకరించారని, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు. విపక్ష పార్టీల కూటమి ఇండియా సమావేశంలో పాల్గొనేందుకు సీఎం మమతా బెనర్జీ నేడు ఢిల్లీ పయనమయ్యారు. ఈ సందర్భంగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇది భద్రతా లోపం. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఇప్పటికే అంగీకరించారు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఈ ఘటనపై విచారణ జరగనివ్వండి’ అని దీదీ అన్నారు. ‘ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ సమస్యను లేవనెత్తాయి. అందుకే టీఎంసీ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్‌ను సస్పెండ్ చేశారు. ఇతర కాంగ్రెస్ మరియు డీఎంకే ఎంపీలను కూడా సస్పెండ్ చేశారు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రాలకు కాషాయ రంగు వేయాలన్న కేంద్రం ఆదేశాన్ని సీఎం మమతా బెనర్జీ మరోసారి ప్రస్తావించారు. ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలనే అంశాలను కూడా నిర్ణయించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇక డిసెంబర్ 20న ప్రధాని నరేంద్ర మోడీతో దీదీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా బెంగాల్‌కు రావాల్సిన బకాయి నిధులను విడుదల చేయాలని ప్రధానిని కోరనున్నారు.
*పార్లమెంట్ ఘటనపై ప్రధాని ముఖం చాటేస్తున్నారు.. చర్చ అవసరమే!
పార్లమెంట్‌లో చోటుచేసుకున్న ఘటనపై చర్చించేందుకు ప్రధాని మోడీ ముఖం చాటేస్తున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేశ్ అన్నారు. పార్లమెంట్ అలజడిపై చర్చ అవసరమే అని పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందనే దానిపై హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు ఇండియా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనపై ప్రధాని స్పందిస్తూ.. ఇది చాలా దురదృష్టకరమని, ఈ ఘటనపై అనవసరపు రాద్ధాంతం చేయొద్దని ప్రతిపక్షాలను కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోడీ స్పందనపై జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘డిసెంబర్ 13న లోక్‌సభలో జరిగిన అసాధారణ ఘటనపై ప్రధాని ఎట్టకేలకు మౌనం వీడారు. విచారణ అవసరమని, చర్చ అవసరం లేదని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉంది. లోక్‌సభలో దుండగుల చర్యపై చర్చ అవసరం లేదని మోదీ అంటున్నారు. విచారణ జరిగితే సరిపోతుందట. డిసెంబరు 13న ఏమి జరిగింది, ఎలా జరిగిందనే దానిపై హోం మంత్రి వివరణ ఇవ్వాలి. చర్చకు తావివ్వకుండా ముఖం చాటేస్తే ఎలా?. దుండగులకు పాస్‌లు మంజూరు చేసిన మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పాత్రపై ప్రశ్నలు తలెత్తుతాయి’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. పార్లమెంటులో డిసెంబర్ 13న అలజడి చెలరేగిన సంగతి తెలిసిందే. ఇద్దరు దుండగులు సందర్శకుల గ్యాలరీ నుంచి.. ఏకంగా సభలోకి దూకారు. గ్యాస్‌ను సభలో వదిలి కలకలం సృష్టించారు. ఈ ఘటనతో ఎంపీలు అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వెంటనే తేరుకొని భద్రతా సిబ్బంది సాయంతో దుండగులను బంధించారు. ఈ ఘటనలో ఎవరికీ హానీ కలగలేదు. దీనికి సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విచారిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
*సుదర్శన్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం!
జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ప్రొటీస్ నిర్ధేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), సాయి సుదర్శన్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలు బాదారు. అంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ (5/37) ఐదు వికెట్స్ పోగొట్టాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మంగళవారం దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. స్వల్ప ఛేదనలో భాగంగా భారత్ నాలుగో ఓవర్లోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌కు శ్రేయస్ అయ్యర్ జతకలిశాడు. ఈ ఇద్దరు దక్షిణాఫ్రికాకు మరో అవకాశమే ఇవ్వలేదు. క్రీజులో కుదురుకునేదాకా సింగిల్స్, డబుల్స్ తీసిన సాయి.. గేర్ మార్చి బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. మరోవైపు అయ్యర్ కూడా ఫోర్లు బాదాడు. పెహ్లూక్వాయో వేసిన 16వ ఓవర్లో సాయి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత శ్రేయస్ వరుసగా ఫోర్, సిక్సర్ బాది అర్థ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. తిలక్ వర్మ (1 నాటౌట్)తో కలిసి సాయి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు భారత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27) విజృంభించడంతో దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలోనే 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఫెలుక్వాయో (33) టాప్ స్కోరర్. ఓపెనర్ టోనీ డిజోర్జి (28), కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (12), షంసి (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), కేశవ్ మహరాజ్ (4) పరుగులు చేశారు. రీజా హెండ్రిక్స్, వాండర్ డసెన్, వియాన్ ముల్డర్ డకౌట్‌గా వెనుదిరిగారు.
