NTV Telugu Site icon

Top Headlines @ 9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines@9am

Top Headlines@9am

కాకినాడలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ అమలాపురం పార్లమెంట్ కు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లతో ఆయన మాట్లాడనున్నారు. కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని పవన్ ను పలువురు నేతలు కోరుతున్నారు. పార్టీలో చర్చించి అవకాశాలను బట్టి పరిశీలిద్దామని జనసేనాని చీఫ్ చెప్పారు. గతంలో వారాహి యాత్ర సందర్భంగా జరిగిన సవాళ్ళలలో దమ్ముంటే తనపై పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ కి ద్వారంపూడి చంద్రశేఖర్ సవాలు చేశారు.. ఆ సవాల్ ను స్వీకరించి పోటీ చేస్తే పార్టీకి మైలేజ్ కూడా ఉంటుందని పవన్ దగ్గర పలువురు నేతలు ప్రస్తావించారు.

స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య:
అనకాపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెనాలికి చెందిన కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేయగా.. నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లి పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి (గురువారం) 11 నుంచి 12 గంటల ప్రాంతంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు కొడగలి శివరామకృష్ణ తన భార్య, ముగ్గురు కుమార్తెలతో సైనేడ్ తాగి సూసైడ్ చేసుకున్నారు.

13 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ కేసు సుఖాంతం:
కరీంనగర్ జిల్లాలో కలకలం రేపిన 13 ఏళ్ల వశిష్ట అనే చిన్నారి మిస్సింగ్ కేసు సుఖాంతంగా ముగిసింది. గత రెండు రోజుల క్రితం నగరంలోని బైపాస్ లో అదృశ్యమయిన వశిష్ట ఆచూకీ లభ్యమైంది. గత రెండు రోజులుగా పోలీస్ బృందాలు వశిష్ట ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరం అంతా జల్లెడ పట్టారు. ఎట్టకేలకు పాప ఆచూకీని కనుగొన్నారు. వశిష్ట చివరకు హైదరాబాద్ లోని ఎంజిబిఎస్ లో వశిష్టను కనుగొన్నారు. అక్కడ వశిష్టను చూసిన పోలీసులు హక్కున చేర్చుకున్నారు. వశిష్ట భయంతో ఉండటంతో మేము మీ ఇంటికి తీసుకెళతామంటూ ధైర్యం ఇవ్వడంతో వశిష్ట పోలీసుల వద్దకు వచ్చి అమ్మకావాలంటూ ఏడ్చింది. దీంతో వెంటనే పోలీసులు వశిష్ట కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో.. తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక పోలీసులు వశిష్టను హైదరాబాద్ నుండి కరీంనగర్ కు తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పగించడంతో వశిష్ట మిస్సింగ్ కేసు సుఖాంతంగా మారింది.

దొరికితే చుక్కలే:
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు రూ.15 వేల వరకు జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ నగర పోలీసులు నిర్ణయించారు. మొదటిసారి దొరికిన వారికి గరిష్టంగా రూ. 10,000 వరకు జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇ రెండోసారి లేదా అంతకంటే ఎక్కువ పట్టుబడిన వారికి రూ. 15,000 జరిమానాతో పాటు 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధిస్తామని తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు పోలీసులు.

పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర సర్కార్:
అధిక పెట్రో ధరల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే మూడు రాష్ట్రాల్లో గెలుపుతో జోరు మీదున్న బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ప్రజలకు పెట్రో ధరల భారం తగ్గించనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు 6 నుంచి 10 రూపాయల వరకు తగ్గించాలని మోడీ సర్కార్ భావిస్తోంది. అయితే ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదనలను పెట్రోలియం శాఖ అధికారులు ప్రధాని మోడీ ఆమోదం కోసం పంపించారని సమాచారం. ఇక, ఈ ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

భయపెడుతున్న పొగ మంచు:
చలికాలం వచ్చేసింది.. రోజూ రోజుకు చలి పెరుగుతూనే ఉంది కానీ తగ్గింది లేదు. సాయంత్రం 6 తర్వాత బయటకు వెళ్లాలంటే జనాలు భయంతో గజగజా వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడం.. మునుపెన్నడూ లేని రీతిలో పొగమంచు పలు ప్రాంతాల్ని కప్పేస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ వాసులు ఈ పొగ మంచుతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయిందక్కడ. పొగమంచు కొన్ని ప్రాంతాల్లో 50 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించనంతగా మంచు కమ్మేసింది. చలి పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే అక్కడి వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరోవైపు పొగమంచు కారణంగా అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు, రేపు భారీగా పొగ మంచు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆ కంపెనీకి వీడ్కోలు పలుకనున్న రతన్ టాటా:
రతన్ టాటా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త మాత్రమే కాదు.. పెట్టుబడిదారుడు కూడా. చాలా చిన్న, పెద్ద కంపెనీల్లో తన డబ్బును పెట్టుబడిగా పెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన పుట్టినరోజు సందర్భంగా ఓ కంపెనీ విషయంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఓ ద్వారా పిల్లల వస్తువులను విక్రయించే ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ మాతృ సంస్థ బ్రెయిన్ బీస్ షేర్లను విక్రయించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కంపెనీలో దాదాపు 78000 షేర్లను కలిగి ఉన్నారు. బ్రెయిన్‌బిజ్ ఐపిఓకు సంబంధించిన పత్రాలను సెబికి దాఖలు చేసింది.

ఓటీటిలోకి వచ్చేస్తున్న హన్సిక కొత్త మూవీ:
‘దేశముదురు’ సినిమాతో హన్సిక హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని సినిమాలు చేసింది గానీ.. ఆమెకు కలిసి రాలేదు. దాంతో తమిళంలో వరస మూవీస్ చేస్తూ అక్కడే సెటిలైపోయింది. ఈ బ్యూటీ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ‘మై నేమ్ ఈజ్ శృతి’ అనే తెలుగు సినిమా చేయగా.. నవంబరు 17న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలో సందడి చేయబోతుంది. నెలన్నర తర్వాత సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.

దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌:
సెంచూరియన్‌ వేదికగా టీమిండియాతో గురువారం ముగిసిన మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ సేనను ఏకంగా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఓడించింది. అద్భుత విజయం సాధించి జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌ తగిలింది. కేప్‌టౌన్‌ వేదికగా భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు ప్రొటీస్ కెప్టెన్‌ టెంబా బావుమా దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న బావుమాకు విశ్రాంతి అవసరం కాగా.. రెండో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. మొదటి టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ బావుమా గాయపడ్డాడు.