NTV Telugu Site icon

Top Headlines @ 9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines@9am

Top Headlines@9am

లారీని ఢీకొన్న టీఎస్ఆర్టీసీ బస్సు:
నెల్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా మరొకరు మృతి చెందగా.. 10 మందికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కావలి ఆస్పత్రికి తరలించారు. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా ఈ ఘటన జరిగిందని గుడ్లూరు పోలీసులు అనుమానిస్తున్నారు.

5 రోజుల పాటు తల్లి మృతదేహంతో కొడుకు:
విశాఖలో దారుణం వెలుగుచూసింది. తల్లి గుండెపోటుతో మృతి చెందగా.. మృతదేహంతో కొడుకు 5 రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటన పెదవాల్తేరు కుప్పం టవర్స్‌లో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెదవాల్తేరు కుప్పం టవర్స్‌లో శ్యామల అనే మహిళ నివాసం ఉంటోంది. శ్యామల కుమారుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఐదు రోజుల క్రితం శ్యామల సోఫాలో కూర్చుని ఉండగా.. గుండెపోటు వచ్చింది. గుండెపోటుతో ఆమె సోఫాలోనే కన్నుమూసింది. ఇది గుర్తించని కుమారుడు.. ఐదు రోజులుగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే ఉంటున్నాడు.

తెలంగాణ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా రేవంత్ రెడ్డి:
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. మొత్తం 64 సీట్లతో తొలిసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమవుతాయని భావిస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తన వ్యూహానికి పదును పెడుతోంది. కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే పలుమార్లు సమావేశమై లోక్‌సభ ఎన్నికలపై కసరత్తు చేసింది. ఇటీవల ఏఐసీసీ లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, సీనియర్‌ నేతలకు కమిటీలో చోటు కల్పించారు.

1.25 కోట్ల ప్రజా పాలన దరఖాస్తులు:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన’ కార్యక్రమం శుక్రవారం (జనవరి 6)తో ముగిసింది. అభయహస్తం పేరుతో వివిధ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం.. జనవరి 6 వరకు కొనసాగింది. ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అధికారులు కోటిన్నరకు పైగా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కోటి మందికి పైగా భీమాకు సంబంధించినవి కాగా, వివిధ సమస్యలపై 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్‌లో ప్రభుత్వ పథకాల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి. ఇందులోనూ ప్రధానంగా ఇళ్లు, చేయూత, రేషన్ కార్డుల దరఖాస్తులు వచ్చాయి. తెల్లకాగితంపై కూడా దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పగా రేషన్ కార్డుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి.

విద్యార్థులకు డ్రగ్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టు:
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తోంది. శనివారం సెక్టార్-126 నోయిడా పోలీస్ స్టేషన్ నోయిడా-ఢిల్లీలో ఉన్న అమిటీ యూనివర్శిటీ, ఇతర విద్యా సంస్థల విద్యార్థులకు, ఇతరులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఛేదించింది. ఈ కేసులో అమిటీ యూనివర్సిటీ విద్యార్థి సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో స్వదేశీ, విదేశీ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అమిటీ యూనివర్శిటీ సమీపంలో డ్రగ్స్ సరఫరా ముఠా గుట్టు రట్టవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా అమిటీ యూనివర్సిటీలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. రెండు నెలల క్రితం నవంబర్‌లో కూడా డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరాలో పాల్గొన్నందుకు అమిటీ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థులతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30 లక్షల విలువైన డ్రగ్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇలాంటి కేసు లక్షల్లో ఒకటి:
ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. కానీ నేడు తల్లి కావడం అంత సులువు కాదనేది కూడా నిజం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం కాంప్లెక్స్ ప్రెగ్నెన్సీ ఉదంతాలు చాలా వింటున్నాము. అలాంటిదే ఇది కూడా. లక్షల్లో ఒకరికి ట్రిపుల్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇందులో ముగ్గురు పిల్లలు కలిసి పుడతారు. ఇటువంటి సంక్లిష్ట గర్భధారణ కేసులు ప్రజలను మాత్రమే కాకుండా వైద్యులు కూడా ఆశ్చర్యపరుస్తాయి. లండన్ లోని హడర్స్‌ఫీల్డ్ వెస్ట్ యార్క్స్ నుండి ఈ రోజుల్లో అలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ ఏకకాలంలో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వైద్యులు ఈ కేసును అధ్యయనం చేసినప్పుడు.. అటువంటి బిడ్డ పుట్టే సంఘటనలు 200 మిలియన్లలో ఒకటి అని వారు చెప్పారు. తల్లి లౌజీ, తండ్రి గారెత్ వారి ముగ్గురు కుమార్తెలు విల్లో, నాన్సీ, మాబెల్ డేవిస్‌లను చూసినప్పుడు వారి ముఖాలు ఒకేలా కనిపించాయి.

88 సెకండ్ల రక్తపాతం:
ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలశివ, ఎన్టీఆర్ కాంబో రిపీట్ అవుతుండడంతో… దేవర పై భారీ అంచనాలున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. రెండు భాగాలుగా దేవర రాబోతోంది. ఏప్రిల్ 5న అదిరిపోయే గ్రాఫిక్స్ అండ్ విజువల్స్‌తో దేవర పార్ట్ 1 చాలా పవర్ ఫుల్‌గా రాబోతోంది. ఈ క్రమంలో జనవరి 8న దేవర ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. దీంతో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. దేవర ప్రపంచం ఎలా ఉండబోతుందోనని గ్లింప్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ 88 సెకండ్ల నిడివితో దేవర గ్లింప్స్ కట్ చేసినట్టుగా సమాచారం. దీంతో 24 గంటల్లో దేవర గ్లింప్స్‌ దెబ్బకు డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలు కానుందని ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.

మగువలకు శుభవార్త:
భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పండగలు, ఇతర శుభకార్యాలు, వేడుకల సమయాల్లో బంగారం కొనుగోలు చేసి.. ధరిస్తుంటారు. పండగలు, శుభకార్యాల సమయాల్లో డిమాండ్‌కు తగ్గట్లుగానే.. పసిడి రేట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. గతేడాది చివరలో పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం రేట్లు భారీగా పెరిగాయి. అంతేకాదు రికార్డు స్థాయిని కూడా తాకాయి. అయితే కొత్త ఏడాదిలో మాత్రం పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులుగా తగ్గిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో నేడు (జనవరి 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,270గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఎలాంటి మార్పు లేదు. గత మూడు రోజుల్లో రూ. 100, రూ. 250, రూ. 400 చొప్పున తగ్గింది. దీంతో 3 రోజుల్లోనే రూ. 750 దిగొచ్చింది.