*తెలంగాణలో 11 సీనియర్ ఐఏఎస్లు బదిలీ..
రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 11 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మహిళా శిశుసంక్షేమం, ఆరోగ్యవాఖ, అటవీశాఖ, రోడ్లుభవనాల, రవాణాశాఖకు కొత్త కార్యదర్శులు వచ్చారు. విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను నియమించారు. ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై వేటు పడింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బి.వెంకటేశం.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిషోర్.. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి.. వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా శ్రీదేవి.. మహిళా-శిశు సంక్షేమ కార్యదర్శిగా వాకాటి కరుణ.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా ఆర్వీ కర్ణన్.. అటవీ పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్.. జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా.. విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అరవింద్ కుమార్.. రోడ్లు-భవనాలు కార్యదర్శితో పాటు అదనంగా రవాణాశాఖ కార్యదర్శిగా శ్రీనివాస్‌రాజును నియామించారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా.. ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన శ్రీనివాస్‌రాజు, శ్రీదేవికి తిరిగి పోస్టింగ్ ఇచ్చారు.
*రెండో పంటకు సాగు నీటి విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ నివాసంలో రెండో పంటకు సాగు నీటి విడుదలపై సమీక్ష చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే.. నాగార్జున సాగర్ నుండి సాగునీరు విడుదల చేయలేమని సాగర్ సీఈ(CE) తెలిపారు. తాగు నీటి కోసమే నీటి విడుదల అని అధికారులు ప్రకటన చేశారు. ఈ క్రమంలో.. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు, సాగుకు నీటి విడుదల లభ్యత పై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్, అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష చేయనున్నారు.
*ఆరు గ్యారంటీలపై అనుమానాలు వద్దు.. ఆరు నూరైనా అమలు చేస్తాం.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం మంథనికి వచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ నేపథ్యంలో.. మంత్రికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలపై అనుమానాలు వద్దు, ఆరు గ్యారంటీలని ఆరు నూరైనా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రూపాయి లేకున్నా.. ఎక్కడికైనా పోయి తిరిగి రావచ్చు ఇది కదా మహిళ సాధికారత అని ఆయన అన్నారు. లక్ష్యానికి దూరంగా పనిచేసిన బీఆర్ఎస్ కి ప్రజలు గుణపాఠం చెప్పారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ చేపడుతామని తెలిపారు. ఇదిలా ఉంటే.. బీజేపీ పార్టీ రాజకీయ అంశాన్ని ముందు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీకి మాటలు తప్ప చేతలు ఉండవని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు రెండు ఒకటే, ఆ రెండు పార్టీల నేతలు మాట మీద నిలబడరని మంత్రి ఆరోపించారు.
*త్వరలో మేడిగడ్డకి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రెండో సారి సమీక్ష
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లీకేజీలు, పిల్లర్లు కూలిన ఘటనలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడిగడ్డ, అన్నారం ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు. దీనిపై తెలంగాణ శాసనమండలిలో సుదీర్ఘ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే.. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో మెడిగడ్డ పిల్లర్ల అంశాలపై ఈ.ఏన్.సి మురళీధర్, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో రెండోసారి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. త్వరలోనే మేడిగడ్డకి వెళ్లనున్నట్లు సమాచారం. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై పారదర్శక విచారణకి అదేశిస్తామని నిన్న కౌన్సిల్ లో సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది.. ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటాం అన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు, వాటి వెనుక మంత్రులు ఎవరు..? అధికారుల పాత్రతో సహా అన్నింటినీ వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీలో జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడం తమ పని కాదని మేడిగడ్డ నిర్మాణ సంస్థ పేర్కొంది. మేడిగడ్డలో బ్యారేజీ కూలిపోవడంతో పాటు దెబ్బతిన్న పైర్లను పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు అనుబంధ ఒప్పందం కుదిరితేనే పనుల్లో ముందడుగు వేస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ, బ్యారేజీ కూలిపోయినప్పుడు నిర్వహణ ఇంకా మిగిలి ఉంది మరియు M&T ప్రాజెక్ట్ ఇంజనీర్లు అధికారికంగా నిర్మాణ సంస్థ మొత్తం పునరుద్ధరణ ఖర్చును భరిస్తుందని ప్రకటించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఓ ప్రకటన కూడా చేసింది. అయితే ఇప్పుడు ఇందుకు భిన్నంగా మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజినీర్ చీఫ్, కింది స్థాయి ఇంజనీర్లకు లేఖ పంపారు.
*తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదు.. జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఏపీలో దుమారాన్ని రేపుతోంది. ఈ విషయంలో సినీ నటుడు, జనసేన నేత నాగబాబుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన స్పందించారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. అంతేగాక ఎన్నికల వ్యవస్థపై తనకు గౌరవం ఉందన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు దీనిని వివాదం చేస్తున్నారన్నారు. హైదరాబాదులో ఉన్న నా ఓటును రద్దు చేసుకున్నానని తెలిపిన నాగబాబు.. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. తన ఓటును ఆంధ్రప్రదేశ్‌కు మార్చుకొని జనసేన.. టీడీపీకి మద్దతుగా నిలుస్తామన్నారు. తాను నెల్లూరునే చదువుకున్నానన్న నాగబాబు.. జనసేన ఆవిర్భావం తర్వాత పలుమార్లు నెల్లూరుకు వచ్చానన్నారు. రాజకీయ పదవుల మీద ఆసక్తి, కోరిక, ఆలోచన లేదన్నారు. కేవలం జనసేన కార్యకర్తలలో స్ఫూర్తిని నింపేందుకే పనిచేస్తున్నామన్నారు. మంత్రి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సోమిరెడ్డికి మద్దతు ఇస్తున్నామన్నారు. రాజకీయాలకు సంబంధించి ఒక కామెడీ మ్యాగజైన్ ఉందని.. అందులో తనకు రెండు ఓట్లు ఉన్నట్లు రాశారని.. ఓటును మార్చుకుందామని భావించానన్నారు. తన భార్య పిల్లలు, కోడలు కూడా మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవాలని అనుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులు అందజేశామన్నారు. అది పరిశీలనలో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో జనసేన పోటీ చేస్తుందని నాగబాబు వెల్లడించారు. ఏ నియోజకవర్గమనేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారన్నారు. మా అమ్మది నెల్లూరు.. నెల్లూరుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నానని నాగబాబు స్పష్టం చేశారు.
*40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు.. నేడు గజగజ వణికి పోతున్నాడు..
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ కార్యదర్శి నారా లోకేష్‌లపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణు. లోకేష్ పాదయాత్ర లావు తగ్గడానికేననని ఆయన విమర్శించారు. లోకేష్‌ది క్యాట్ వాక్ అని, లోకేష్ పాదయాత్ర వద్దని ఆ పార్టీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పాడన్నారు. పాదయాత్రకే విలువలేదు, లోకేష్ రాసుకున్న ఎర్ర బుక్కు ఏం చేసుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. గత పాలకులు ఇచ్చిన మాటలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయన్న మంత్రి చెల్లుబోయిన వేణు.. గతంలో సామాజిక న్యాయం అనేది ఎండమావి.. నేడు నిండు కుండ అని అన్నారు. గత పాలకులు ఎస్సీలను వివక్షతో చూశారన్నారు. గత పాలకులు అనేక వర్గాల పేదలను వివక్షతో చూశారని ఆయన మండిపడ్డారు. దళారులు లేకుండా పేదవారి గడపలకు సంక్షేమాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేర్చారని ఆయన చెప్పారు. పేదవారు మోసపోకుండా అవినీతి అనే పదానికి తావు లేకుండా.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగించారన్నారు. రూ. 2 లక్షల60 వేల కోట్లు నేరుగా పేదలకు ఖాతాలకు సీఎం చేర్చారన్నారు. గతంలో పాలకులు ఐదేళ్ల తర్వాత హామీల గురించి ఆలోచించేవారని.. అధికారం చేపట్టిన మొదటి రోజు నుండే ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టిన నాయకుడు సీఎం జగన్ అంటూ మంత్రి పేర్కొన్నారు. పదవుల్లోనే కాదు ప్రజా అవసరాలను తీర్చడంలో సంక్షేమానికి పెద్దపీటవేశారన్నారు. అమలు చేసేవాడు మంచి వాడైతేనే పేదలకు మేలు జరుగుతుంది అన్న అంబేద్కర్ ఆశయాలను నిజం చేశారని చెప్పారు. పేదవాడికి విద్య అనేది పెద్ద ఆయుధం అని అంబేద్కర్ అన్నారని మంత్రి వెల్లడించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు నేడు గజగజగజ వణికి పోతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి ప్రజలను ఎలా మోసం చేయాలో అని ఆలోచిస్తున్నాడని.. ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. మోసానికి ఒక చిరునామా అబద్ధానికి ఒక చిరునామా వంచనకు ఒక చిరునామా చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. నైతిక విలువలు లేని నాయకుడు అధికారం కోసం ఎంత స్థాయికి అయిన దిగజారే వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. విలువలే పెట్టుబడిగా సత్యమేవ జయతే అన్న రీతిలో పాలన సాగిస్తున్న నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంటూ పేర్కొన్నారు.
*అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. అనంత లోకాలకు వెళ్లిపోయారు. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన అయ్యప్ప స్వాములు ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో.. స్వాములు వస్తున్న కారు తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఏర్టిగా వాహనం అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టడంతో.. ముగ్గురు స్వాములు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో మొత్తం ఐదుగురు భక్తులు ఉన్నట్లు సమాచారం. వెంటనే క్షతగాత్రుని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల స్వస్థలం ములుగు జిల్లా కమలాపురంకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం తెలియగానే మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వారిలో సుబ్బయ్య నాయుడు, నరసాంబయ్య, రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
*కాల్పులతో మారుమోగుతున్న పంజాబ్..11 రోజుల్లో 8 ఎన్‌కౌంటర్లు..
పంజాబ్ రాష్ట్రం పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులతో దద్దరిల్లిపోతోంది. ఆదివారం రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుంది. ఈ రోజు తెల్లవారుజామున మోగా జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లక్కీ పాటియాల్ గ్యాంగ్‌లో ముగ్గురు గ్యాంగ్‌స్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బైకుపై వచ్చిన గ్యాంగ్‌స్టర్లని పోలీసులు గమనించి, ఆపాలని కోరినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బైక్‌ని వదిలి పొలాల్లోకి పరిగెత్తారని, పోలీసులపై కాల్పులు జరిపారని మోగా డీఎస్పీ హరీందర్ సింగ్ తెలిపారు. పోలీసులు ప్రతిదాడి చేయడంతో వారు లొంగిపోయారని, ఈ ఘటనలో ఒకరు తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డారని, పోలీసుల కాల్పుల్లో కాదని అధికారులు తెలిపారు. అరెస్టయిన గ్యాంగ్‌స్టర్ల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. పంజాబ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా గ్యాంగ్‌స్టర్ల కట్టడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు, ముఠాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గత 11 రోజుల్లో తాజాగా జరిగింది 8వ ఎన్‌కౌంటర్. ఇటీవల తమపై దాడులు చేసేందుకు వస్తే పోలీసులు ప్రతీకారం తీర్చుకుంటారని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బహిరంగ హెచ్చరిక జరిగిన తర్వాత ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మొహాలి, పాటియాలో నిన్న రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. దీంట్లో ఇద్దరు కారు దొంగల్ని, హత్య నిందితులను అరెస్ట్ చేశారు.
*పూజారి హత్యతో బీహార్‌లో టెన్షన్ టెన్షన్.. కళ్లను పొడిచి, నాలుక కోసేసి పాశవికంగా చంపేసిన వైనం..
పూజారి దారుణహత్య బీహార్‌లో ఉద్రిక్తతలకు కారణమైంది. ఆరు రోజుల క్రితం కిడ్నాప్ అయిన పూజారిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. కళ్లను పొడిచి, జననాంగాలను కోసేసిన స్థితితో మృతదేహం లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ హత్య స్థానికుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. పోలీసులకు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీస్ అధికారులకు గాయాలయ్యాయి. గోపాల్ గంజ్ జిల్లాలోని దానాపూర్ గ్రామంలో శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. ఆయన బీజేపీ మాజీ డివిజనల్ అధ్యక్షుడు అశోక్ కుమార్ షా సోదరుడు. దీంతో ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. మనోజ్ కుమార్ తన ఇంటి నుంచి గుడికి వెళ్లే మార్గంలో అదృశ్యమయ్యాడని పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. శనివారం గ్రామంలోని పొదల్లో బాధితుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వార్త తెలుసుకున్న స్థానికులు, ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెబుతూ, రాళ్లదాడికి పాల్పడ్డారు. హైవేపై ఉన్న పోలీస్ వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. గోపాల్ గంజ్ డీఎస్పీ ప్రాంజల్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారుల్ని శాంతిపచేశారు. మనోజ్ కుమార్ హత్య ఎందుకు, ఎలా జరిగిందో, ఎవరూ చేశారనే విషయాలు తమకు తెలియమని మరో సోదరుడు సురేష్ షా తెలిపారు. ఈ హత్యపై బీజేపీ షహజాద్ పూనావాలా స్పందించారు. బీహార్‌లో ఇప్పుడు నితీష్ కుమార్ రాజ్ కాదు జంగిల్ రాజ్ నడుస్తోందని విమర్శించారు. ఇండియా కూటమి పాలనలో సాధువులు, పూజారులకు ప్రమాదమని విమర్శించారు. బీహార్ రాష్ట్రంలో ఎవరూ సురక్షితంగా లేరని అన్నారు.
*విజృంభించిన అర్ష్‌దీప్, అవేశ్.. 116 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌట్!
జొహానెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27) చెలరేగడంతో దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఆండిలే ఫెలుక్వాయో (33; 49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) టాప్ స్కోరర్. టోనీ డి జోర్జి (28), ఎయిడెన్ మార్‌క్రమ్ (12), తబ్రైజ్ షంసి (11 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేశారు. ప్రొటీస్ మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి రీజా హెండ్రిక్స్ (0) బౌల్డ్ కాగా.. ఆ మరుసటి బంతికే రస్సీ వాండర్ డసెన్ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ సమయంలో కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ (12)తో కలిసి ఓపెనర్ టోని డి జోర్జి (28) మూడో వికెట్‌కు 39 పరుగులు జోడించాడు. అర్ష్‌దీప్ వేసిన 8వ ఓవర్ ఐదవ బంతికి కీపర్ క్యాచ్ ఇచ్చి టోని వెనుదిరిగాడు. తన తర్వాతి ఓవర్లో ప్రమాదకర హెన్రిచ్ క్లాసెన్ (6) ను అర్ష్‌దీప్ బౌల్డ్ చేయడంతో ప్రొటీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆపై అవేశ్ ఖాన్ మాయ మొదలైంది. అవేశ్ వేసిన 11వ ఓవర్ తొలి బంతికే ఎయిడెన్ మార్క్‌రమ్ బౌల్డ్ అవగా.. తర్వాత బంతికే వియాన్ మల్డర్ (0) ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ సమయంలో ఆండిలే ఫెలుక్వాయో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వేగంగా పరుగులు చేస్తూ దక్షిణకాఫ్రికా స్కోరు సెంచరీకి చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కేశవ్ మహారాజ్ (4)ను అవేశ్ ఖాన్ ఔట్ చేయగా.. పెహ్లుక్వాయోను అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. నంద్రె బర్గర్ (32 బంతుల్లో 7)ను కుల్దీప్ యాదవ్ బౌల్డ్ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఫెలుక్వాయో దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా ఈ మాత్రం స్కోరునైనా చేయగలిగింది. ఈ వన్డేలో భారత పేసర్లు 9 వికెట్లు పడగొట్టారు.
